- మూడు జాబ్ నోటిఫికేషన్లు రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ
- మొత్తం 290 ఏఈఈ పోస్టుల భర్తీకి చర్యలు
- ఆర్ అండ్ బీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీలు
- అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 290 ఇంజినీర్ పోస్టుల భర్తీకి మంగళవారం మూడు వేర్వేరు నోటిఫికేషన్లను రిలీజ్ చేసింది. ఈ మేరకు టీజీపీఎస్సీ సెక్రటరీ ఎం.హరిత వెబ్ నోట్ విడుదల చేశారు. రవాణా, రోడ్లు, భవనాల శాఖ (ఆర్ అండ్ బీ)లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్, ఎలక్ట్రికల్) పోస్టులతో పాటు, తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అన్ని పోస్టులకు గరిష్ట వయోపరిమితిలో ప్రభుత్వం 10 ఏండ్ల సడలింపు ఇచ్చిందని, 18 నుంచి 44 ఏండ్ల మధ్య వయసున్న వారు ఈ పోస్టులకు అర్హులని కమిషన్ తెలిపింది. అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.tgpsc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అప్లికేషన్ ఫీజు రూ.వెయ్యి, ఎగ్జామినేషన్ ఫీజు రూ.120 (నిరుద్యోగులకు మినహాయింపు)గా నిర్ణయించారు. అయితే, అభ్యర్థులు తప్పనిసరిగా టీజీపీఎస్సీ వెబ్ సైట్లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్(ఓటీపీ) చేసుకోవాలని సూచించారు.
ఆర్ అండ్ బీలో 222 ఏఈఈ పోస్టులు
నోటిఫికేషన్లో ముఖ్యంగా రవాణా, రోడ్లు, భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు ఉన్నాయి. సివిల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు జూన్ 6 నుంచి జులై 13 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి అక్టోబర్ నెలలో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఎంపికైన వారికి రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు వేతనం లభిస్తుంది. అయితే, మల్టీజోన్ 1లో 112 ఉండగా, వీటిలో ఓపెన్ కేటగిరీలో 34 కొత్త పోస్టులతో పాటు ఒక క్యారీ ఫార్వర్డ్ పోస్టు ఉంది. ఎస్సీలకు 17, ఎస్టీలకు 2 పోస్టులున్నాయి. బీసీలకు 31, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 11, సోర్ట్స్ కేటగిరీలో రెండు పోస్టులున్నాయి. మల్టీజోన్ 2లో 110 పోస్టులున్నాయి. దీంట్లో 32 కొత్త పోస్టులతో పాటు రెండు క్యారీ ఫార్వర్డ్ పోస్టులున్నాయి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 10, బీసీలకు 33, ఎస్సీలకు 16, ఎస్టీలకు పది, స్పోర్ట్స్ కేటగిరీలో రెండు పోస్టులున్నాయి.
ఏఈఈ (ఎలక్ట్రికల్) పోస్టులు 49
ఆర్ అండ్ బీ శాఖలోనే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) విభాగంలో 49 ఖాళీల భర్తీకి కమిషన్ మరో నోటిఫికేషన్ ఇచ్చింది. ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. జూన్ 8 నుంచి జులై 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ పోస్టులకూ అక్టోబర్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. ఇవన్నీ స్టేట్ లెవెల్ పోస్టులు. మొత్తం 49 పోస్టుల్లో ఓపెన్ కేటగిరీలో 15 ఉండగా, ఈడబ్ల్యూఎస్ లో ఐదు, ఎస్టీలకు ఐదు, స్పోర్ట్స్ కేటగిరీలో ఒక పోస్టు ఉంది. బీసీలకు 13, ఎస్సీలకు 8 పోస్టులున్నాయి.
19 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులు
తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 19 అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. సివిల్, మెకానికల్, కెమికల్, బయో-టెక్నాలజీ, మైనింగ్ లేదా ఎన్విరాన్మెంట్ఇంజినీరింగ్లో డిగ్రీ ఉన్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ జూన్ 10న ప్రారంభమై జులై 17న ముగుస్తుంది. సెప్టెంబర్‌లో పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని కమిషన్ తెలిపింది. ఇవి కూడా స్టేట్ లెవెల్ పోస్టులు. దీనిలో ఓపెన్ కేటగిరీలో 8 (రెండు క్యారీ ఫార్వర్డ్ ) పోస్టులుండగా, రెండు ఈడబ్ల్యూఎస్, బీసీ ఏలో రెండు, బీసీ బీలో ఒకటి, బీసీడీలో ఒకటి, ఎస్సీ 2, 3 కేటగిరీల్లో ఒక్కోటి చొప్పున ఖాళీలున్నాయి. ఎస్టీ కేటగిరీలో ఒకటి, వీహెచ్ కేటగిరీలో ఒకటి, హెచ్‌హెచ్ లో ఒక పోస్టు ఉంది.
