- సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం
- రైతును పారిశ్రామికవేత్తగా మార్చడమే లక్ష్యం
- తుమ్మిడిహెట్టి పునర్నిర్మాణానికి మళ్లీ పాటుపడుతున్నం
- ఉచిత బస్సుతో మహిళలకు రూ.10 వేల కోట్లు ఆదా
- పేదలను అద్దె ఇండ్ల బాధల నుంచి విముక్తి చేస్తం
- సెప్టెంబర్ 17 నాటికి ఇంకో లక్ష ఇండ్లు పూర్తి చేస్తం
- మూసీ పునరుజ్జీవంతో పర్యావరణహిత హైదరాబాద్
- మెట్రో రెండో దశ విస్తరణ, వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుల నిర్మాణం వేగవంతం
- పరిపాలనలో జవాబుదారీతనం పెంచుతామని వెల్లడి
- పరేడ్ గ్రౌండ్లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
హైదరాబాద్, వెలుగు: సంక్షేమం, అభివృద్ధికి తమ ప్రభుత్వం సమ ప్రాధాన్యం ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల జారీ నిరంతర ప్రక్రియ అని.. ఈ నెలలోనే 1,800 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు. మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ నెలలోనే టీజీపీఎస్సీ నుంచి ఇంజినీరింగ్, పీసీబీ, అటవీ శాఖ, టౌన్ ప్లానింగ్, విద్యాశాఖలో ఉద్యోగాల నోటిఫికేషన్లు రానున్నట్టు తెలిపారు.
ఇప్పటికే న్యాయపరమైన సమస్యలు లేకుండా 67 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. రాచరికాన్ని, పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదని, ప్రభుత్వం అంటే నలుగురి చేతిలో ఉండే పెత్తనం కాదని స్పష్టం చేశారు. తమది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రజా ప్రభుత్వమన్న సీఎం.. గత 30 నెలల్లో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విజయవంతం అయ్యామన్నారు. రైతులను వ్యవసాయ పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పేలా ఎదగాలని ‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ డాక్యుమెంట్‌తో సరికొత్త మాస్టర్ ప్లాన్ అమలు చేయబోతున్నామన్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం తెలిపారు. జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టులు పదేండ్లకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి మళ్లీ కృషి చేస్తున్నామని చెప్పారు. రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేండ్లకే కూలిందని సీఎం చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. మూసీ పునరుజ్జీవం ద్వారా హైదరాబాద్ నగరాన్ని పర్యావరణ హితంగా మార్చడమే తమ తదుపరి ప్రధాన లక్ష్యమని సీఎం తెలిపారు.
మెట్రో రెండో దశ విస్తరణతో పాటు వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుల నిర్మాణం వేగవంతం చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత విద్యుత్, సన్న బియ్యం నిరంతరాయంగా అందిస్తామని స్పష్టం చేశారు. గిగ్ వర్కర్ల చట్టం అమల్లోకి తీసుకువచ్చామన్నారు.
పారిశ్రామికవేత్తలుగా రైతులు
వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా గ్రామీణ వ్యవసాయ ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తున్నట్టు సీఎం తెలిపారు. రైతులను కేవలం పంటలు పండించే వారిగానే కాకుండా వ్యవసాయ ఆధారిత పారిశ్రామికవేత్తలుగా మార్చడమే తమ సంకల్పమన్నారు. 2025–26 అంచనాల ప్రకారం రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో 236.87 లక్షల మెట్రిక్ టన్నులుగా నమోదైందని వివరించారు. రైతులపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించేందుకు ఒకేసారి రూ. 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేశామని గుర్తుచేశారు. దీనికోసం రూ. 20,616 కోట్లు వెచ్చించి 25 లక్షల మంది రైతులకు రుణ విముక్తి కల్పించినట్టు ప్రకటించారు. రైతు భరోసా పెట్టుబడి సాయం కింద ఇప్పటివరకు రూ. 27,529 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. యాసంగి సీజన్‌లో దేశంలోనే రికార్డు స్థాయిలో 60 శాతం ధాన్య సేకరణ తెలంగాణ నుంచే జరిగిందని తెలిపారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తం
రాష్ట్రంలో మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్టు సీఎం వెల్లడించారు. బ్యాంక్ లింకేజీ, స్త్రీ నిధి ద్వారా మహిళా సంఘాలకు రూ. లక్ష కోట్ల రుణాలు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే రూ. 60 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేసి, రుణ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచామన్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లు, సౌర విద్యుత్ ప్లాంట్లు, పెట్రోల్ బంకుల నిర్వహణలో మహిళలను యజమానులుగా మారుస్తున్నట్టు వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించడంతో వారు రూ. 10 వేల కోట్లు ఆదా చేసుకోగలిగారన్నారు. రూ. 500కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి కింద 200ల యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో 53 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుతోందన్నారు .
యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీలో838 మందికి ఉద్యోగాలు
విద్య ఒక్కటే పేదరికాన్ని రూపుమాపగలదనే నమ్మకంతోనే విద్యాశాఖను తన వద్దే ఉంచుకుని విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టానన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఇప్పటికే 1,190 మంది విద్యార్థులు శిక్షణ పూర్తి చేసుకోగా, అందులో 838 మందికి ప్రముఖ అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలు లభించాయన్నారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్‌ను అమలు చేస్తూ మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీలకు విస్తరిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్టల్స్ విద్యార్థుల డైట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలను 212 శాతానికి పెంచినట్లు తెలిపారు.
రేషన్ కార్డులు.. గిగ్ వర్కర్ల చట్టం అమలు చేస్తున్నం
పేదలకు సొంతిళ్లు సాకారం అనేది మాటల్లో చెప్పలేనిదని సీఎం అన్నారు. అద్దె ఇండ్ల బాధల నుంచి పేదలను విముక్తి చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. పేదల సొంతింటి కల నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మొదటి ఏడాదిలోనే రూ. 22,500 కోట్లు కేటాయించి 4.50 లక్షల ఇండ్లను మంజూరు చేసినట్టు తెలిపారు. కేవలం 13 నెలల కాలంలోనే లక్ష ఇండ్ల నిర్మాణం పూర్తి కాగా, సెప్టెంబర్ 17 ప్రజా పాలన దినోత్సవం నాటికి మిగిలిన ఇండ్లు పూర్తి చేస్తామన్నారు. ఆహార భద్రతలో భాగంగా కొత్తగా 15.12 లక్షల రేషన్ కార్డులు జారీ చేసి, 3.38 కోట్ల మందికి సన్నబియ్యం భోజనం అందించే ఏర్పాట్లు చేశామన్నారు. వృద్ధుల సామాజిక భద్రత కోసం కఠినమైన చట్టాన్ని తెచ్చి, అందులో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులను బాధ్యులను చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలోని 4 లక్షల మంది గిగ్ వర్కర్ల ఉద్యోగ భద్రత కోసం ప్రత్యేక చట్టం తెచ్చి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామన్నారు. దేశంలోనే తొలిసారిగా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల గణన సర్వేను విజయవంతంగా పూర్తి చేశామన్నారు.
ప్రసంగాన్ని ముందే ముగించిన సీఎం
సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం పూర్తి చేయకముందే ముగించారు. ఎండ తీవ్రత ఎక్కవ కావడంతో కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు ఇబ్బంది కావద్దని, ముందుగానే ముగిస్తున్నట్టు తెలిపారు. ఎండలు ఎక్కువగా ఉండడంతోనే 9 గంటలకు ప్రారంభం కావాల్సిన కార్యక్రమాన్ని కూడా 8.30 గంటలకే మార్చారు. పోలీసులకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలను కూడా రద్దు చేశారు. పరేడ్ గ్రౌండ్ కంటే ముందు సీఎం రేవంత్ రెడ్డి గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.
తెలంగాణను ప్రపంచానికే గేట్‌వేగా మారుస్తం
పరిపాలనలో జవాబుదారీతనం పెంచేందుకు తమ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను ప్రతి నెలా మొదటి తేదీనే చెల్లించేలా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని, పెండింగ్ బిల్లుల కోసం అదనంగా వెయ్యి కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం రూ. ఒక కోటి ప్రత్యేక బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం తమ ప్రభుత్వ బాధ్యతకు నిదర్శనమన్నారు. అలాగే, డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో భాగంగా ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. రాబోయే వందేండ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మేధావుల మథనంతో సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ ద్వారా తెలంగాణను ప్రపంచానికే గేట్‌వేగా మారుస్తామన్నారు.
