- 3,397 టీఎంసీల్లో రాష్ట్ర వాటా 968 టీఎంసీలు
- తేల్చిచెప్పిన సెంట్రల్ వాటర్ కమిషన్.. తాజాగా ప్రజెంటేషన్
- తెలంగాణకు ప్రాణహిత నుంచి అత్యధికంగా 313 టీఎంసీల లభ్యత
- అప్పర్ గోదావరిలో 187, లోయర్ గోదావరిలో 159 టీఎంసీలు
- మిడిల్ గోదావరిలో 152 టీఎంసీల జలాలు ఉన్నట్లు వెల్లడి
- సీడబ్ల్యూసీ స్టడీనే తప్పంటూ ఏపీ వితండవాదన
- తెలంగాణకు అన్ని జలాలు లేవంటూ బుకాయించే యత్నం
- శాస్త్రీయంగా స్టడీ చేశామని సీడబ్ల్యూసీ క్లారిటీ
- నీళ్లున్నయ్ కనుకే టెక్నికల్ క్లియరెన్సులు ఇచ్చారన్న తెలంగాణ
హైదరాబాద్, వెలుగు: గోదావరి బేసిన్లో తెలంగాణ నీళ్ల పక్కా లెక్కను సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) తేల్చేసింది. గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ/బచావత్) అవార్డు ప్రకారం మన రాష్ట్రానికి సరిపడా జలాలున్నట్టు స్పష్టం చేసింది. గోదావరి బేసిన్ (సబ్బేసిన్లు కలిపి)లో నీటి లభ్యతపై మంగళవారం సీడబ్ల్యూసీ రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశమైంది. జీఆర్ఎంబీ చైర్మన్ పద్మ దోర్జీ విజ్ఞప్తితో సీడబ్ల్యూసీ ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 2023లో గోదావరి నది నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ చేసిన స్టడీని రెండు రాష్ట్రాలకు వివరించింది. సీడబ్ల్యూసీలోని హైడ్రాలజీ వింగ్ సీఈ సంజయ్ కుమార్ గంగ్వార్.. గోదావరి నదిలో ఎన్ని నీళ్లున్నయ్, ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు అన్న అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు. మొత్తంగా గోదావరిలో 3397 టీఎంసీల జలాలున్నాయని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. ఇందులో ఉమ్మడి ఏపీకి 1435 టీఎంసీల జలాలున్నాయని పేర్కొంది. కాగా పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్‌కు ఏపీ మళ్లిస్తున్న 45 టీఎంసీలు కూడా కలిపితే 1,480 టీఎంసీల వరకు నీళ్లుంటాయి. డైవర్షన్ సహా మనకు గోదావరిలో 968 టీఎంసీల జలాలు హక్కుగానే వస్తాయని సీడబ్ల్యూసీ ప్రెజెంటేషన్ ద్వారా తేలింది.
ప్రాణహితలో 313 టీఎంసీలు..
వాస్తవానికి గోదావరి బేసిన్లో తెలంగాణకు అధిక మొత్తంలో ప్రాణహిత నది నుంచే నీళ్లొస్తున్నాయి. సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం మనకు మొత్తంగా గోదావరిలో 918 టీఎంసీలు లభిస్తుండగా.. అందులో ప్రాణహిత నది (జీ9 బేసిన్) నుంచే 313.82 టీఎంసీల లభ్యత ఉన్నట్టు సీడబ్ల్యూసీ లెక్కల్లో తేలింది. అంటే దాదాపు 35 శాతం నీళ్లు ప్రాణహిత సబ్‌బేసిన్ నుంచే మనకు అందుతున్నాయి. ఇక, ఆ తర్వాత జీ5 బేసిన్‌లోని మధ్య గోదావరి నుంచి 152 టీఎంసీలు, లోయర్ గోదావరి (జీ10)లో 159.50 టీంఎసీల జలాలు లభిస్తున్నాయి. జీ4 బేసిన్‌లోని మంజీరా నుంచి 187.60 టీఎంసీలు వస్తున్నాయి. మానేరు (జీ6) నుంచి 45.90, పెన్‌గంగ (జీ7) నుంచి 39.12, వార్ధా (జీ8) నుంచి 20.88 టీఎంసీల జలాలు మనకు హక్కుగానే వస్తున్నాయి. వాస్తవానికి శబరి (జీ12) జలాలు కూడా మనకే దక్కాల్సి ఉన్నా కూడా రాష్ట్ర విభజనతో ఆ నీళ్లన్నీ ఏపీకి కుట్రపూరితంగా మళ్లాయి. ఏపీ విభజన సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను ఏపీలో కలిపేశారు. ఆ ఏడు మండలాల పరిధిలోనే శబరి సబ్ బేసిన్ ఉన్నది. దీంతో అక్కడ లభించాల్సిన 158.18 టీఎంసీల జలాలు వట్టి పుణ్యానికి ఏపీకి కేంద్రం ఇచ్చేసినట్టయింది. ఆ ఏడు మండలాలను ఏపీలో కలపకుండా ఉండి ఉంటే.. ఆ జలాలపైనా మనకు హక్కులు వచ్చి ఉండేవి.
నీళ్లున్నయ్ కనుకే కేటాయింపులు..
ఏపీ కొర్రీలకు తెలంగాణ అధికారులు కౌంటర్ ఇచ్చారు. నీళ్లు లేవనే సమస్యే లేదని, పుష్కలంగా నీళ్లున్నాయని తేల్చి చెప్పారు. జీ7 నుంచి జీ10 వరకు నీళ్లు మెండుగా ఉన్నాయని, మిగులు కూడా ఉంటాయని తేల్చి చెప్పారు. బచావత్ అవార్డు 968 టీఎంసీల మేరకే అన్ని ప్రాజెక్టులకు టెక్నికల్ క్లియరెన్సులు ఇచ్చారని స్పష్టం చేశారు. కనుక తెలంగాణకు నీళ్లు లేవనే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. అయితే, రెండు రాష్ట్రాల వాదనలు విన్న సీడబ్ల్యూసీ.. ఈ స్టడీపై మరోసారి రెండు రాష్ట్రాలతో కలిసి రెక్టిఫై చేయించేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది. త్వరలోనే దీనిపై సమావేశం ఏర్పాటు చేసుకుందామని చెప్పినట్టు తెలిసింది. కాగా, వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ నుంచి ఇంటర్ స్టేట్, హైడ్రాలజీ అధికారులు పాల్గొన్నారు.
ఏపీ వితండ వాదన..
సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం ఏపీకి 516 టీఎంసీల లభ్యతే ఉన్నది. ఇంద్రావతి (జీ10)లో 358.10 టీఎంసీలు, శబరి (జీ11)లో 158.18 టీఎంసీలు వస్తున్నాయి. కాగా, మీటింగ్‌లో ఏపీ మాత్రం నీటి లెక్కలపై కొర్రీలు పెట్టింది. అవన్నీ తప్పుడు లెక్కలంటూ తొండికి దిగింది. అసలు తెలంగాణకు నీళ్లే లేవనే వాదన ఎత్తుకున్నది. తెలంగాణకు అన్ని నీళ్లున్నాయనే వాదన కరెక్ట్కాదని, కేటాయింపులు ఎట్ల చేస్తరని అక్కసు వెళ్లగక్కింది. సీతారామ వంటి ప్రాజెక్టులకు స్టడీ చేయకుండానే క్లియరెన్సులు ఇచ్చారని వాదించింది. తెలంగాణ డేటా తీసుకుని ఇష్టమొచ్చినట్టు స్టడీలు చేసి అవే లెక్కలు చూపిస్తున్నారని పేర్కొంది. మామూలుగా 40 ఏండ్ల లెక్కల ఆధారంగా నీటి లభ్యతపై స్టడీ చేయాల్సి ఉంటుందని, కానీ, ఇక్కడ మాత్రం కేవలం 38 ఏండ్ల డేటాను ప్రామాణికంగా తీసుకున్నారని పేర్కొంది. అయితే, సీడబ్ల్యూసీ మాత్రం.. ఈ లెక్కలన్నీ శాస్త్రీయంగా చేశామని, ప్రామాణిక సూత్రాలను పరిగణనలోకి తీసుకుని స్టడీ చేశామని తెలిపింది. జీఆర్ఎంబీ విజ్ఞప్తి మేరకే ఈ స్టడీని చేసినట్టు పేర్కొంది.
