దేశంలో మధ్యతరగతి,పేద వర్గాలకు వరుసగా అందుతున్న కేంద్ర ప్రభుత్వ ‘కానుకలు’ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసినరోజు మొదలు, బెంగాల్లో బీజేపీ సంబురాల్లో పూలు వాడిపోకముందే ప్రజలకు వికసిత భారత ఫలితాలు అందడం మొదలైంది. బెంగాల్ చివరిదశ ఎన్నిక ముగిసిన తెల్లారే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఏకంగా రూ.994 పెరిగింది. దీంతో ఆ సిలిండర్ రేటు రూ.3 వేలు దాటిపోయి కొత్త రికార్డులు సాధించింది.
ఆ తర్వాత రెండు మూడు రోజులకోసారి పెంపులతో పెట్రోలు, డీజిల్ మీద లీటరుకు మొత్తం రూ.8 పైగా చమురు కంపెనీలు రేట్లు బాదేశాయి. సీఎన్జీ మీదా అదేస్థాయిలో రేట్లు పెరిగాయి. ఇంక ఎందాకా పెంచుతారో చూడాలి. కేంద్ర మంత్రులు, అధికారుల లీకులను బట్టి రూ.25 వరకు పెంచుతారని సంకేతాలిస్తున్నారు. అంతర్జాతీయంగా బ్యారెల్ రేట్లు పెరిగాయి కాబట్టి, ఆయిల్ కంపెనీలు నష్టపోతున్నాయనే పేరుతో పెంచక తప్పదని ప్రభుత్వం చెబుతోంది.
ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల క్రూడాయిల్ రేట్లు పెరిగాయి కాబట్టి మన దగ్గర కూడా పెంపు న్యాయమేనని కొందరు సర్దిచెప్పుకుంటున్నారు. నిజంగానే దేశానికి ఆర్థికంగా సంక్షోభ పరిస్థితి వస్తే ప్రజల మీద భారం అనివార్యం కావచ్చు. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసేవరకు దాదాపు రెండు నెలలపాటు మనకేం ఇబ్బంది లేదని ప్రధాని మోదీ నుంచి బీజేపీ గల్లీ లీడర్ల వరకు ధీమాగా చెప్పింది అబద్ధాలేనా?
ఎక్సైజ్ డ్యూటీ ఎత్తేసి ప్రజల మీద భారం తగ్గించామన్న నిర్మలా సీతారామన్ మాటల వెనుక నిజానిజాలు చూద్దాం. అసలు పెట్రోలు మీద ఎక్సైజ్ డ్యూటీ ఎందుకు ఉందన్నది అసలు ప్రశ్న. గతంలో దశాబ్దాలుగా ప్రభుత్వాలు పెట్రో ఉత్పత్తుల మీద సబ్సిడీలు ఇచ్చి అంతర్జాతీయ రేట్ల ప్రభావం జనంమీద పడకుండా చూశాయి.
వాజ్ పేయి ప్రధానిగా ఉన్నకాలంలో 2002లోనే సబ్సిడీ భారానికి బదులుగా ఆయిల్ కంపెనీలకు బాండ్లు జారీచేశారు. యూపీఏ పాలనలో మన్మోహన్ సింగ్ ప్రధానిగా పెట్రో సబ్సిడీల భారం తగ్గించుకోవడానికి 2010 జూన్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ రేట్ల ప్రకారం దేశంలో పెట్రో రేట్లు సమానం అయ్యేంతవరకు లీటరుపై నెలకు 50 పైసల చొప్పున పెంపును అమలుచేశారు. దీనిపైనే అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి.
అంతర్జాతీయ రేట్లకు సమానమయ్యాక హెచ్చుతగ్గుల మేరకు పెంపు, తగ్గింపు ఉంటాయని మన్మోహన్ సర్కారు చెప్పింది. నాలుగేళ్ల తర్వాత 2014లో ప్రభుత్వం మారింది. కేంద్రంలో మోదీ సర్కార్ వచ్చాక 2014 అక్టోబర్ వరకు పెంపు కొనసాగింది. అప్పటికే అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు భారీగా పడిపోయాయి. దీంతో ప్రజలకు భారం తగ్గుతుందని ఆశించినవారికి నిరాశే ఎదురైంది. అంతర్జాతీయ రేట్ల తగ్గుదలను మోదీ సర్కార్ కొత్త ఆదాయ వనరుగా మార్చుకుంది.
జనం నెత్తినే భారం
ముడి చమురు రేట్లు తగ్గిన ప్రతిసారి పెట్రోలు, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ కేంద్రం పెంచుతూ వచ్చింది. ఆ భారం జనం నెత్తినే పడింది. బ్యారెల్ రేట్లు తగ్గడం వల్ల మనదేశంలో లీటర్ పెట్రోలు మీద భారీగా రేటు తగ్గించాల్సి ఉన్నప్పుడు కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ పెంచేసేది. దీంతో ఆ మేరకు రేటు తగ్గించకుండా ఆయిల్ కంపెనీలు కాస్త తగ్గింపుతో సరిపెట్టేవి. ఆ కాస్త తగ్గింపు మా ఘనతేనని రాజకీయ ప్రచారం జరిగింది. ఇట్లా పదేపదే ఎక్సైజ్ డ్యూటీ పెంచుతూ జనానికి అసలైన రేట్ల తగ్గింపు అందనివ్వలేదు.
ప్రజలకు అందాల్సిన లక్షల కోట్ల ప్రయోజనం కేంద్రం ఖజానాలోకి మళ్లించుకుంది. బడ్జెట్లో కేంద్ర పెట్రోలియం శాఖ ఆదాయ లెక్కల్లో అధికారికంగానే ఈ విషయం తెలుసుకోవచ్చు. మన్మోహన్ హయాంలో బ్యారెల్ రేటు 120 డాలర్ల పైన ఉన్నప్పుడు కూడా దేశంలో లీటర్ పెట్రోలు రూ.80 లోపు ఉంటే, మోదీ హయాంలో బ్యారెల్ రేటు 60 డాలర్ల కంటే తక్కువ ఉన్నా లీటర్ రేటు రూ.100కు తగ్గకుండా చేశారు. మరోవైపు క్రమంగా పెంచుతూ వచ్చిన ఎక్సైజ్ డ్యూటీ పెట్రోలుపై లీటరుకు రూ.13కు చేరింది. డీజిల్‌పై రూ.10 వరకు అదనంగా పిండుకున్నారు.
రష్యా ఆయిల్ పై మిగులు ఏమైంది?
నాలుగేళ్ల కింద ఉక్రెయిన్ మీద రష్యా మొదలుపెట్టిన యుద్ధం మరోలా మన దేశానికి కలిసొచ్చింది. రష్యా తీరును ప్రపంచ దేశాలన్నీ తప్పుబట్టినా మన దేశం భిన్నమైన వైఖరి తీసుకుంది. ఓవైపు రష్యాపై అమెరికా ఆంక్షలు విధించినా దేశ ప్రయోజనం అంటూ రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను కొనసాగించింది.
భారీగా డిస్కౌంట్ రేట్లకు రష్యా ఆయిల్ దొరికింది. అంతర్జాతీయగా బ్యారెల్ రేట్లు 90 డాలర్ల దగ్గర ఉన్న సమయంలోనూ రష్యా నుంచి ఇండియాకు 60 డాలర్ల దగ్గరే కారుచౌకగా క్రూడాయిల్ చేరింది. ఇంధన భద్రత, విదేశీ మారకాన్ని కాపాడుకునే విషయంలో ఇది దేశానికి ఉపయోగపడింది. అదే సమయంలో ఇంత చౌకగా పెట్రోలియం దొరుకుతున్నా దేశ ప్రజలకు మాత్రం ఒక్క పైసా ప్రయోజనాన్ని కేంద్రం ఇవ్వలేదు.
చౌక ఇథనాల్ ఎవరికి మిగులు?
కాలుష్యాన్ని తగ్గించే పేరుతో బయో ఇంధనం ఇథనాల్‌ను పెట్రోల్‌లో కొంత కలపాలని కొన్నేళ్ల కిందే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కేంద్ర రోడ్లుశాఖ మంత్రి నితిన్ గడ్కరీ బ్రాండ్ అంబాసిడర్ లా మారారు. దీనివల్ల కాలుష్యం తగ్గడంతోపాటు ఇటు ఇథనాల ఉత్పత్తి వల్ల రైతులకు అదనపు ఆదాయం, అటు పెట్రో రేట్లు కూడా తగ్గుతాయని ఆయన బలంగా చెప్పుకొచ్చారు.
దేశంలో టూవీలర్ల నుంచి భారీ వెహికల్స్ వరకు ఇంజిన్ల అప్ గ్రేడ్ సరిగా కాకుండానే పెట్రోల్‌లో కలిపే ఇథనాల్ శాతాన్ని వేగంగా 20 శాతానికి పెంచేశారు. దీనివల్ల కనిపించకుండా కోట్లాదిమంది ప్రజలకు రిపేర్ల రూపంలో భారీనష్టం జరిగింది. అది అట్లా ఉంచితే, ఇథనాల్ 20 శాతం కలపడం వల్ల అంతమేర పెట్రో దిగుమతుల ఖర్చు తగ్గాలి. ఇథనాల్ కలపడం వల్ల దేశ ప్రజలకు పెట్రో రేట్లలో ఒక్క రూపాయి తగ్గింపు కూడా జరగలేదు. ఇట్లా అటు చౌక బ్యారెల్ రేట్లు, ఇటు ఎక్సైజ్ ఆదాయం, ఇథనాల్ బ్లెండింగ్ లాంటి చర్యలతో తగ్గిన ఖర్చు, మిగిలిన లాభాలు ఎవరి జేబుల్లోకి పోయాయన్నది మిస్టరీ కాదు. కానీ ఆ అదనపు లాభాలన్నీ కోట్లమంది ప్రజలకు జరిగిన భారీ నష్టం.
మన్మోహనే కారణమా?
యూపీఏ హయాంలో పెట్రోలియం కంపెనీలకు లక్షల కోట్లు అప్పులు పెట్టిపోయారనీ, దాన్నే ఇప్పుడు కేంద్రం భరిస్తోందంటూ మరో ప్రచారం చాలాకాలంగా జరుగుతోంది. 2005 నుంచి 2010 వరకు ప్రజలకు పెట్రో సబ్సిడీల వల్ల పడే భారాన్ని భరిస్తూ మన్మోహన్ సర్కారు ఆయిల్ కంపెనీలకు బాండ్లు జారీచేసింది. వీటిని 15-–20 ఏళ్ల కాలంలో వడ్డీతో చెల్లిస్తారు. మన్మోహన్ సర్కారు రెండో టర్మ్‌లోనే ఈ బాండ్ల మీద వడ్డీగా ఐదేళ్లలో రూ.53వేల కోట్లు చెల్లించారు.
మోదీ సర్కార్ వచ్చేనాటికి పెండింగ్ ఉన్న బాండ్ల విలువ అధికారిక లెక్కల ప్రకారం రూ.1.34 లక్షల కోట్లు. మోదీ సర్కార్ మొదటి టర్మ్‌లో మెచ్యూర్ అయి, చెల్లించిన బాండ్ల అసలు రూ.3,500 కోట్లు మాత్రమే. ఇది కాకుండా బాండ్ల వడ్డీల రూపంలో మోదీ సర్కార్ మొదటి ఐదేళ్లలో దాదాపు రూ.50వేలకోట్లు వడ్డీ చెల్లించింది. 2021 నుంచి 2026 వరకు మిగిలిన రూ.1.30 లక్షల కోట్ల బాండ్లు దశలవారీగా మెచ్యూర్ అవుతూ వచ్చాయి. ఏటా దాదాపు 10వేలకోట్ల వడ్డీ చెల్లిస్తూ వచ్చారు.
ఈ ఏడాదితో ఆయిల్ బాండ్ల అసలు, వడ్డీ బకాయిలన్నీ తీరిపోతున్నాయి. అంటే 12 ఏళ్ల కాలంలో వడ్డీ, అసలు కలిపి మోదీ సర్కార్ చెల్లించిన మొత్తం కలిపినా రెండున్నర లక్షల కోట్లు మాత్రమే. అయితే మోదీ పాలన మొదటి మూడేళ్లలోనే ఎక్సైజ్ డ్యూటీ రూపంలో అంతకు మించిన ఆదాయన్ని అదనంగా తీసుకుంది. అంటే మన్మోహన్ సర్కార్ బాండ్ల బకాయిలు వడ్డీ సహా పదేండ్ల కిందే జనం నుంచి వసూలైపోయింది. దశాబ్ద కాలంలో వచ్చిన లక్షల కోట్ల ఎక్సైజ్ డ్యూటీ ఆదాయానికి, బాండ్ల బాకీలకు ఏ సంబంధం లేదని అర్థం చేసుకోవచ్చు.
కేంద్రం చేయాల్సిందేంటి?
పెట్రో రేట్లపై ఏళ్ల తరబడి అదనపు ఆదాయం తీసుకున్న కేంద్రం ఇప్పుడయినా ప్రజల మీద భారం లేకుండా చూసే బాధ్యత తీసుకోవాలి. పెట్రోలు, డీజిల్ రేట్లను తగ్గించి, ఆ భారాన్ని ప్రభుత్వమే ఆయిల్ కంపెనీలకు చెల్లించాలి. పెట్రోలియం ఎగుమతుల ద్వారా భారీ ఆదాయం తెచ్చుకుంటున్న కార్పొరేట్ కంపెనీల నుంచి అదనపు పన్నుల ద్వారా అవసరమైన నిధులు సమకూర్చుకోవచ్చు. విదేశాల నుంచి పామాయిల్ దిగుమతులపై భారీగా సుంకం వేస్తే మరింత ఆదాయం వస్తుంది.
గతంలో పెంచిన సుంకాన్ని కార్పొరేట్ల ఒత్తిడితో కేంద్రం వెంటనే తగ్గించింది. దేశంలో రైతులే పామాయిల్ భారీగా సాగు చేస్తున్నారు కాబట్టి, దిగుమతులపై సుంకం భారీగా పెంచినా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇట్లా వచ్చే ఆదాయంతో పెట్రో నష్టాలను భర్తీ చేసుకోవచ్చు. దిగుమతుల నియంత్రణతో విదేశీమారకం కాపాడుకోవచ్చు. పెట్రో రేట్లు సాధారణ స్థాయికి చేరాక అప్పుడు అంతర్జాతీయ క్రూడాయిల్ రేట్ల ప్రకారం దేశీ రేట్లను నిర్ణయించుకునే వీలుంటుంది.
చివరిగా జనానికి పొదుపు పాఠాలు చెప్పేముందు తాము ఆచరించడం నేర్చుకోవాలి. ఎన్నికల ర్యాలీలు, వందలాది కార్లతో రోడ్డుషోలు, డ్రామాలు అన్నీ పూర్తయ్యాక ప్రజలకు నీతులు చెబితే ఉపయోగం లేదు. ఇప్పటికే పెరిగిన రేట్ల భారంతో జనం పడుతున్న తిప్పలు దాచలేని వాస్తవం. పెరుగుతున్న ఖర్చులు, పెరగని ఆదాయాలు కుటుంబాలను కుంగదీస్తున్నాయి.
రేట్లపై నియంత్రణ కోల్పోయిన ప్రభుత్వం ద్రవ్యోల్బణం లెక్కలు చూపిస్తూ ఆటలాడుతోంది. రేట్లు తక్కువగానే ఉన్నాయని ఎన్ని చెప్పినా ప్రతినెలా కేంద్రం ప్రభుత్వం విడుదల చేసే జీఎస్టీ ఆదాయం పెరుగుదలే వాస్తవ పరిస్థితిని చెబుతున్నాయి.
ఎవరికి నష్టం? ఎవరికి లాభం?
దేశ అవసరాల కోసం దాదాపు 88 శాతం పెట్రోలియంను మన దేశం దిగుమతి చేసుకుంటోంది. విదేశాల మీద ఆధారపడ్డాం కాబట్టి రేట్లు పెంచడానికి కేంద్రం దీన్నొక సాకుగా ఉపయోగించుకుంటోంది. 2025లో మన దేశం రోజుకు సగటున 5 మిలియన్ బారెళ్ల పెట్రోలియం దిగమతి చేసుకుంది. అదే సమయంలో మన దేశం నుంచి పెట్రోలియం ఎగుమతుల రూపంలో రోజుకు సగటున 1.28 మిలియన్ బారెళ్లు విదేశాలకు పోయాయి.
మనదేశం నుంచి ఎగుమతి అయిన రిఫైన్ చేసిన చమురులో 70 శాతం వాటా రిలయన్స్ కంపెనీదే. మిగతా 30 శాతం ఎగుమతులను ఇతర ప్రైవేటు, ప్రభుత్వరంగ కంపెనీలు చేస్తున్నాయి. మనకే లేక విదేశాల నుంచి తెచ్చుకుంటుంటే, దిగుమతుల్లో 20 శాతానికిపైగా పెట్రోలియం విదేశాలకు ఎందుకుపోతోంది? ఈ వ్యాపారం వల్ల లాభాలు, ప్రయోజనం పొందుతున్నది ఎవరు? ఇంత వ్యాపార ప్రయోజనం ఉన్నప్పుడు ప్రజల మీద కాస్త భారం తగ్గించడానికి ప్రభుత్వానికి బాధేంది? నిజానికి రష్యా నుంచి కారుచౌకగా భారీ ఆయిల్ దిగుమతులు చేసినకాలంలోనూ ఎక్కువ భాగం ప్రైవేటు ఆయిల్ కంపెనీలదే. దిగుమతులైనా, ఎగుమతులైనా ఎక్కువ లాభాలు, ప్రయోజనం తీసుకుంటున్న ప్రైవేటు కంపెనీల నుంచి కేంద్రం అదనంగా ఆదాయం తీసుకునే అవకాశం ఉంది. లేకుంటే ప్రైవేటు కంపెనీల లాభాలు తగ్గకుండా ఉండడానికే రేట్లు పెంచి ప్రజల నెత్తిన భారం వేస్తున్నారా?
ఎక్సైజ్ పేరుతో భారీ వసూల్
ఎక్సైజ్ పేరుతో కేంద్రం ఆదాయం లెక్కలే అసలు పరిస్థితిని చెబుతాయి. (వివరాలు బాక్స్‌లో చూడండి) ఇట్లా 12 ఏళ్ల కాలంలో పెట్రోలియం మీద ఒక్క ఎక్సైజ్ రూపంలోనే దాదాపు 30 లక్షల కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఇదంతా కేంద్రానికి పెట్రోలియంపై రెగ్యులర్ గా వచ్చే పన్నులు, సెస్ లు, జీఎస్టీలు కాకుండా అదనపు ఆదాయమే. పైగా ఆయిల్ కంపెనీల లాభాల నుంచి వచ్చే డివిడెండ్ మరింత అదనం. ప్రజలకు అందాల్సిన లక్షల కోట్లను ఆదాయంగా మార్చుకున్న ప్రభుత్వం కేవలం రెండు మూడు నెలల ఇబ్బందికే లక్షకోట్ల నష్టమంటూ చెప్పుకోవడమే పెద్ద విడ్డూరం.
పెట్రోపై అదనపు ఆదాయం
(సెస్, రాయల్టీ, కస్టమ్స్, జీఎస్టీ కలపకుండా కేవలం అదనపు ఎక్సైజ్ ఆదాయం)
ఏడాది ఆదాయం (రూ.కోట్లల్లో)
2020-21 3,72,970
2021-22 3,63,305
2022-23 2,87,575
2023-24 2,73,684
2024-25 2,71,529
(2025 డిసెంబర్ 15న
రాజ్యసభలో కేంద్ర పెట్రోలియం శాఖ ఇచ్చిన అధికారిక డేటా)
కే.మురళీకృష్ణ, జర్నలిస్ట్
