సనత్ నగర్ టిమ్స్ లో ప్రైవేట్ ఇన్సూరెన్స్కూ వైద్యం!.. ప్రభుత్వ హాస్పిటల్ లో రాష్ట్రంలోనే తొలిసారి

సనత్ నగర్ టిమ్స్ లో ప్రైవేట్ ఇన్సూరెన్స్కూ వైద్యం!.. ప్రభుత్వ హాస్పిటల్ లో రాష్ట్రంలోనే తొలిసారి
  •     ప్రభుత్వ హాస్పిటల్ లో రాష్ట్రంలోనే తొలిసారి..
  •      70 శాతం బెడ్లు పేదలకే.. 30 శాతం సీట్లలో పెయిడ్, ఇన్సూరెన్స్ సేవలు

సనత్ నగర్ టిమ్స్ లో వినూత్న ప్రయోగానికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే టిమ్స్ హాస్పిటల్​లో ఫ్రీ, పెయిడ్ సర్వీస్​లు అందుబాటులోకి తేవాలని నిర్ణయించిన ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. పెయిడ్ సర్వీస్ లతో పాటు, ప్రైవేట్ ఇన్సూరెన్స్ పాలసీలకు కూడా వైద్య సేవలు అందించాలని భావిస్తున్నది. దీనికి సంబంధించి ఇటీవలే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆరోగ్య శాఖ అధికారులతో చర్చించినట్లు తెలుస్తున్నది.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సనత్ నగర్ టిమ్స్ లో వినూత్న ప్రయోగానికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే టిమ్స్ హాస్పిటల్ లో ఫ్రీ, పెయిడ్ సర్వీస్ లు అందుబాటులోకి తేవాలని నిర్ణయించిన ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. పెయిడ్ సర్వీస్ లతో పాటు, ప్రైవేట్ ఇన్సూరెన్స్ పాలసీలకు కూడా వైద్య సేవలు అందించాలని భావిస్తున్నది. దీనికి సంబంధించి ఇటీవలే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చర్చించినట్లు తెలుస్తున్నది. సాధారణంగా నిమ్స్ వంటి పెద్ద ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఫ్రీ, పెయిడ్ సర్వీసులు ఉన్నప్పటికీ, ప్రైవేట్ ఇన్సూరెన్స్ పాలసీలకు అవకాశం లేదు. కానీ అందుకు భిన్నంగా టిమ్స్‌ లో ప్రైవేట్ ఇన్సూరెన్స్ ద్వారా కూడా వైద్యం పొందేలా రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రభుత్వం వీలు కల్పించనున్నది.

ప్రైవేట్ కు దీటుగా ఆంబియన్స్..

సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ కు ఏమాత్రం తీసిపోని విధంగా అద్భుతమైన ఆంబియన్స్, అత్యాధునిక మౌలిక సదుపాయాలను కలిగి ఉంది. ఏ, బీ, సీ అనే మూడు ప్రధాన బ్లాకులుగా విభజించబడిన ఈ మెగా మెడికల్ హబ్‌ లో మొత్తం వెయ్యి బెడ్లు ఉండగా, అందులో 300 బెడ్లను ఎమర్జెన్సీ వైద్య సేవల కోసమే కేటాయించనున్నారు. కార్డియాలజీ, ఆంకాలజీ, న్యూరో సర్జరీ, నెఫ్రాలజీ వంటి 29 రకాల సూపర్ స్పెషాలిటీ డిపార్ట్‌మెంట్లు ఇక్కడ అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు, టిమ్స్ లో విదేశీ పేషెంట్ల కోసం 8 వీఐపీ సూట్లు, 92 సింగిల్ రూమ్‌ లు, 100 డబుల్ షేరింగ్ రూమ్‌ లను కార్పొరేట్ స్థాయి వసతులతో అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దనున్నారు.

ఈ నెల 11న ప్రారంభం..

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు ప్రారంభించాలని భావించినప్పటికీ, పనులు పూర్తి కానీ కారణంగా ఈ నెల 11న ప్రారంభించే అవకాశం ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని పక్కాగా అమలు చేసేందుకు వీలుగా నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ (ఎన్ఏబీహెచ్) అనుమతులు కూడా తీసుకోవాలని భావిస్తున్నారు. గత ప్రభుత్వం ఈ హాస్పిటల్స్ నిర్మాణానికి చేసిన అప్పులు తీర్చేందుకు మొత్తం పెయిడ్ సర్వీసులు చేయాలని గతంలో భావించినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. 70 శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్ కింద పేదలకు పూర్తి ఉచితంగా అందిస్తూనే, మిగిలిన 30 శాతం బెడ్లను పెయిడ్ సర్వీసులు, ప్రైవేట్ ఇన్సూరెన్స్ సేవలకు కేటాయించాలని భావిస్తున్నది.