- పవన్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్.. ఆయన ఇక్కడికి వచ్చి చేసేదేమిటి?
- నా దగ్గర డబ్బులు ఉంటే నేను కూడా పవన్‌తో ఓ క్యారెక్టర్ చేయిస్తా
- సినిమా నటుడిగా ఆయన ఎక్కడ తిరిగినా మాకేం ఇబ్బంది లేదు
- కానీ పేమెంట్ తీసుకొని రాజకీయాలు మాట్లాడితే ఊరుకోం
- గద్దర్‌కు కారు కొనిచ్చిన అన్నందుకు ముందు క్షమాపణ చెప్పాలి
- పవన్‌తో బీజేపే ఈ మాటలు మాట్లాడిస్తున్నదని ఫైర్
హైదరాబాద్, వెలుగు: ‘‘మిస్టర్ పవన్ కల్యాణ్.. బరాబర్ తెలంగాణ మా అయ్య జాగీరే.. ఇది నీ అయ్య జాగీరు కాదు.. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల జాగీరు’’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. పవన్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్ అని.. ఆయన ఇక్కడికి వచ్చి చేసేదేంటి? అని మండిపడ్డారు. ‘తెలంగాణ మీ అయ్య జాగీరా?’ అంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. మంగళవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘పవన్ నువ్వో పెయిడ్ ఆర్టిస్ట్. నవ నిర్మాణ సభ పేరుతో ఇక్కడికి వచ్చి ఏం చేస్తావ్? ఏపీలోనే ఏం చేయలేకపోతున్నావ్. నా దగ్గర డబ్బులు ఉంటే నేను కూడా పవన్‌తో ఓ క్యారెక్టర్ చేయిస్తా. సినిమా నటుడిగా ఆయన ఎక్కడ తిరిగినా మాకేం అభ్యంతరం లేదు. కానీ గద్దర్‌కు కారు కొనిచ్చానని చెప్పినందుకు ముందు ఆయన క్షమాపణలు చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.
చనిపోయిన గద్దర్ గురించి పవన్ మాట్లాడిన తీరులో ఆయన అహంకారాన్ని తెలంగాణలోని దళిత వర్గాలు గుర్తించాలన్నారు. గద్దర్‌పై చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ‘‘మేం ఏ అహంకారానికి వ్యతిరేకంగా పోరాడామో, మా మీద ఏ దురహంకార ఆధిపత్యం ఉండకూడదని కోరుకున్నామో.. పవన్ అదే మాట్లాడాడు. ఆర్టిస్టులను మేం గౌరవిస్తాం. కానీ పేమెంట్ తీసుకొని రాజకీయాలు మాట్లాడితే ఊరుకోం. తెలంగాణ ప్రజలను వేర్పాటువాదులుగా చిత్రీకరిస్తే చూస్తూ ఊరుకునేది లేదు’’ అని హెచ్చరించారు.
పవన్ మాటల వెనుక బీజేపీ..
పవన్ మాటల వెనుక బీజేపీ ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ‘‘పవన్ మాట్లాడేందుకు ఇస్తున్న చిట్టీలు బీజేపీ నుంచి వస్తున్నాయో, బీఆర్ఎస్ నుంచి వస్తున్నాయో తెలియడం లేదు. బీజేపీ లేదా బీఆర్ఎస్‌లో ఎవరో ఒకరు పవన్‌ను ఆర్టిస్టుగా ఎంగేజ్ చేసుకుని ఉండొచ్చు” అని అన్నారు. ఇక్కడ పవన్ కల్యాణ్ కూడా కాంట్రాక్టులు చేసుకోవచ్చని, తమకేం అభ్యంతరం లేదని అన్నారు. ‘‘కొండగట్టు ఆలయానికి ఇచ్చిన డబ్బులు మీ అయ్య జాగీరా? అక్కడికి వచ్చినప్పుడు మేం అతిథిగా ప్రొటోకాల్ ఇచ్చాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ సమావేశం పెట్టడం, ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టడం కాదా? ఏపీలోనే గతంలో ఒక్క సీటు రాలేదు. డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. ఈసారి టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేయడం వల్లే జనసేన గెలిచింది. ఆంధ్రాలోనే దిక్కులేదు.. ఇక్కడ ముఖ్యమంత్రి అవుతానా అని ఆయనే చెప్పుకుంటున్నారు’’ అని ఎద్దేవా చేశారు.
ముందు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు..
తెలంగాణ ప్రజలకు పవన్ కల్యాణ్ ముందు క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ‘‘తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తి పవన్. తెలంగాణ ఉద్యమ సమయంలో మేం ఆంధ్రా ప్రజలను ఎప్పుడూ అవమానించలేదు. విడిపోయి కలిసుందాం అనేదే మా నినాదం. ఆంధ్రా వాళ్లను తాము ఏదో అన్నట్టుగా పవన్ అబద్ధాలు చెబుతున్నారు” అని మండిపడ్డారు. పవన్ పార్లమెంట్ గురించి అవగాహన లేదని అన్నారు. ‘‘తెలంగాణ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరిగిన సమయంలో నేను ప్రత్యక్ష సాక్షిని. తలుపులు మూసి తెలంగాణ బిల్లును పాస్ చేశారంటూ ఈ రాష్ట్రంపై పవన్ విషం కక్కుతున్నారు. తెలంగాణ అమరవీరులు ప్రాణాలు కోల్పోయినప్పుడు ఎప్పుడైనా సంఘీభావం తెలిపారా? తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజులు అన్నం తినలేదని చెప్పింది మీరే. రాష్ట్ర ఏర్పాటును అవమానించిన వ్యక్తి మీరు. అలాంటి మీరు తెలంగాణ గురించి మాట్లాడితే ఎలా?’’ అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో అన్ని భాషలు మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారని, ఇదే ఫెడరల్ విధానమని చెప్పారు. ‘‘నీ పార్టీని గుజరాత్‌లో పెట్టుకో పవన్’’ అని పొన్నం ప్రభాకర్ చురకలంటించారు.
