ఏటా 1,100 కోట్ల ఆదాయం.. 24  మందే పర్మినెంట్ ఉద్యోగులు... నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహణ తీరిది..

ఏటా 1,100 కోట్ల ఆదాయం.. 24  మందే పర్మినెంట్ ఉద్యోగులు... నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహణ తీరిది..
  • రాజ్యసభలో వివరాలు వెల్లడించిన కేంద్ర విద్యాశాఖ 
  • 73 మంది కాంట్రాక్ట్, 124 మంది అవుట్‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్ ఉద్యోగులు
  • విద్యార్థుల ఫీజులతో నిర్వహణ ఖర్చులు పోగా ఆదాయం మిగుల్చుకుంటున్న ఎన్​టీఏ

హైదరాబాద్, వెలుగు: వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నీట్​సహా జేఈఈ మెయిన్​లాంటి పోటీ పరీక్షలు నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్​టీఏ) విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో ఏటా రూ.1,100 కోట్ల ఆదాయం సమకూర్చుకుంటున్నది. అయితే, అందులో మొత్తం పర్మినెంట్ పోస్టులు 39 కాగా, ప్రస్తుతం 24 మందే పనిచేస్తున్నారు. వీళ్లంతా కూడా డిప్యుటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై వచ్చినవారే. మరో 197 మంది కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ సిబ్బంది ఉన్నారు. 

వీళ్లతోనే దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణ కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో శుక్రవారం రాజ్యసభలో ఎంపీ వి.శివదాసన్ అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ రాతపూర్వక సమాధానమిచ్చారు. ఇందులో అనేక ఆసక్తికర విష యాలు వెల్లడయ్యాయి.

కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్​ సిబ్బందే ఎక్కువ

నీట్ యూజీ, జేఈఈ మెయిన్స్ వంటి ఎంట్రెన్స్ టెస్టుల నిర్వహణ, ఫెలోషిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కోసం స్వయంప్రతి పత్తి సంస్థగా ఏర్పాటైన ఎన్​టీఏలో కేవలం 39 మంది పర్మినెంట్ ఉద్యోగులు ఉండగా, వారిని సైతం డిప్యూటేషన్ పద్ధతిలోనే భర్తీ చేసినట్టు కేంద్రం వెల్లడిం చింది. ఇందులో లెవల్స్ వారీగా డైరెక్టర్ జనరల్, జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్లు, రీసెర్చ్ సైంటిస్టులు ఉన్నారు. 

సంస్థ కార్యకలాపాల కోసం మరో 73 మందిని కాంట్రాక్ట్ పద్ధతిలో, వీరికి  తోడు డేటా అనలిస్టులు, లీగల్ అసోసియేట్లు, హౌస్ కీపింగ్ తదితర విధుల్లో మరో 124 మందిని అవుట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోర్సింగ్ ద్వారా తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. పరీక్షల నిర్వహణ సమయంలో అదనంగా అబ్జర్వర్లు, సిటీ కోఆర్డినేటర్లను తాత్కాలికంగా ఉపయోగిస్తున్నట్టు పేర్కొంది. కాగా, కీలకమైన పరీక్షల నిర్వహణ కోసం 80% మంది కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్​ సిబ్బందిని వాడుకుంటున్న తీరుపై తీవ్ర విమ ర్శలు వస్తున్నాయి. ఎన్​టీఏను మరింత బలోపేతం చేసేందుకు సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద కొత్తగా 16 పోస్టులను మంజూరు చేసినట్టు కేంద్రం తెలిపింది.

270కి పైగా పరీక్షల నిర్వహణ

ఎన్టీఏ 2018లో ప్రారంభం కాగా, అప్పటి నుంచి ఇప్పటివరకు 270కి పైగా పరీక్షలను నిర్వహించిందని, 6.6 కోట్లకు పైగా అభ్యర్థులు నమోదు చేసుకున్నారని కేంద్రం తెలిపింది. 2026లో ఇప్పటివరకు 12 పరీక్షలు పూర్తి కాగా, 65 లక్షల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. ఈ ఏడాది మే 3న జరిగిన నీట్ (యూజీ) పరీక్షను 565 సిటీల్లో 5,432 సెంటర్లలో 13 భాషల్లో నిర్వహించినట్లు చెప్పిన కేంద్రం.. జూన్ 21న  నీట్ రీ ఎగ్జామ్ ను పూర్తి చేసి జులై 16న రిజల్ట్​ను సైతం విడుదల చేసినట్లు స్పష్టం చేసింది. 

ఏటా పెరుగుతున్న రాబడి

ఎన్​టీఏ ఆదాయం ఏటా భారీగా పెరుగుతున్నది. 2019-–20 ఆర్థిక సంవత్సరంలో ఫీజుల రూపంలో రూ.504 కోట్ల ఆదాయం రాగా.. రూ.440 కోట్ల ఖర్చు చేశారు. 2023–--24 నాటికి రాబడి రూ.1,116 కోట్లకు చేరగా,  ఖర్చు రూ.1,040 కోట్లుగా నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. గత ఐదేండ్లుగా ఫీజుల రూపంలో రూ.3,543 కోట్లు వసూలు కాగా, పరీక్షల నిర్వహణ, ఉద్యోగుల జీతభత్యాలకు రూ.3,023 కోట్లు ఖర్చు చేసింది. మొత్తంగా ఖర్చులు పోగా, ఇంకా రూ.520 కోట్లు మిగుల్చుకుంది.