ఇషాన్, తిలక్ విధ్వంసం.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్

ఇషాన్, తిలక్ విధ్వంసం.. జింబాబ్వే ముందు భారీ టార్గెట్

IND vs ZIM: హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో భారత బ్యాటర్లు బౌండరీల వర్షం కురిపించారు. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ విధ్వంసకర అర్థ సెంచరీలతో చెలరేగడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. 

ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ భాగస్వామ్యం: 
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు యంగ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. వైభవ్ ఎదుర్కొన్న 9 బంతుల్లోనే 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 20 పరుగులు చేసి మంచి ఊపులో కనిపించినప్పటికీ, ఆ ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేక అవుట్ అయ్యాడు. వికెట్లు పడిన దశలో ఇషాన్ కిషన్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌లు కలిసి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లారు. మూడో వికెట్‌కు వీరిద్దరూ కలిసి 66 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌పై భారత్ పట్టు సాధించేలా చేసింది. అయ్యర్ 25 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ కేవలం 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో విరుచుకుపడి 81 పరుగులు సాధించాడు.

తిలక్ వర్మ విధ్వంసం.. 200 మార్క్ దాటిన స్కోరు: 
ఇన్నింగ్స్ చివర్లో వైస్ కెప్టెన్ తిలక్ వర్మ జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 29 బంతుల్లోనే 60 పరుగులతో నాటౌట్‌గా నిలిచి ఆకట్టుకున్నాడు. తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్ పుణ్యమా అని భారత స్కోరు 219 పరుగుల చేసింది. ఇక జింబాబ్వే బౌలర్లలో బ్రియాన్ బెన్నెట్, బ్లెస్సింగ్ ముజారబానీ, రిచర్డ్ నగరవ, బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్‌హురి తలో వికెట్ తీసుకున్నారు.