న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో పాటు నీట్ మృతుల కుటుంబాలకు పరిహారం, నిరసనకారులపై కేసుల ఎత్తివేతకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించడంతో ఆందోళనలు విరమిస్తున్నట్లు సీజేపీ ప్రకటించింది. శనివారం (జులై 25) ఢిల్లీలోని కాన్ట్సిట్యూషన్ క్లబ్లో సీజేపీ ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది.
కేంద్ర ప్రభుత్వం తరుఫున మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. సీజేపీ డిమాండ్లపై సుధీర్ఘంగా చర్చించారు. ఈ భేటీ అనంతరం సీజేపీ ప్రతినిధులు, కేంద్ర మంత్రులు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీజేపీ ప్రతినిధులు మాట్లాడుతూ.. తమ మూడు డిమాండ్లకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న మా ప్రధాన డిమాండ్ ఇప్పటికే నెరవేరిందని చెప్పారు. మిగిలిన రెండు డిమాండ్లపై మంగళవారంలోపు లిఖితపూర్వక హామీ ఇస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు.
ధర్మేంద్ర రాజీనామా మా మొదటి గెలుపని అభివర్ణించారు. నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా పోరాడిన విద్యార్థులపై కేసుల ఎత్తివేతకు కేంద్రం ఒప్పుకుందని.. అలాగే భవిష్యత్‌లో కూడా ఎలాంటి చర్యలు తీసుకోబమని హామీ ఇచ్చిందని తెలిపారు. ఇక, నీట్ పేపర్ లీక్ కారణంగా చనిపోయిన విద్యార్థుల మృతుల కుటుంబాలకు త్వరలో ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు. తమ డిమాండ్లకు అంగీకరించడంతో కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆందోళనను విరమిస్తున్నామని సీజేపీ ప్రకటించింది.
దేశవ్యాప్తంగా విద్యార్థులపై కేసులుఎత్తేస్తాం: జేపీ నడ్డా
సీజేపీ ప్రతినిధులతో భేటీ అనంతరం జేపీ నడ్డా మీడియాతో మాట్లాడుతూ.. సీజేపీ మూడు డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. సీజేపీ ప్రధాన డిమాండ్ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటికే రాజీనామా చేశారని పేర్కొన్నారు. అలాగే, నీట్ పేపర్ లీక్ కారణంగా చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు నష్ట పరిహారంచెల్లిస్తామన్నారు. నిబంధనలకు లోబడే ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని తెలిపారు. అలాగే, నీట్ కు వ్యతిరేకంగా పోరాడిన విద్యార్థులపై దేశవ్యాప్తంగా కేసులు ఎత్తేస్తామని నడ్డా చెప్పారు. విద్యార్థులపై భవిష్యత్‌లో కూడా ఎలాంటి చర్యలు ఉండవని ఆయన హామీ ఇచ్చారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా:
నీట్ పేపర్ లీకేజీ, విద్యా వ్యవస్థలోని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. సీజేపీ నిరసనకు మద్దతుగా ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ ఆమరణ నిరహార దీక్ష చేపట్టారు.
మరోవైపు.. ప్రధాన్ రాజీనామా చేయాలని కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు జులై 20న కాక్రోచ్ పార్టీ పార్లమెంట్ మార్చ్ (చలో సంసద్) కార్యక్రమం చేపట్టింది. ఈ చలో పార్లమెంట్ కార్యక్రమం తీవ్ర హింసాత్మకంగా మారింది. సీజేపీ నిరసనకారులపై పోలీసులు దమనకాండ కొనసాగించారు. విద్యార్థులపై విచక్షణరహితంగా లాఠీచార్జ్ చేయడంతో పాటు టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్ ప్రయోగించారు. పోలీసుల దాడిలో పదుల సంఖ్యలో నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నిరసనకారులపై దాడికి నిరసనగా కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష పార్టీలు రంగంలోకి దిగాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నాలుగు రోజులుగా పార్లమెంట్‌ను స్తంభింపజేశాయి ప్రతిపక్షాలు. ఓ వైపు సీజేపీ.. మరోవైపు ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వం తీవ్ర ఒత్తడి నెలకొంది. దీంతో చేసేదేమి లేక సీజేపీ, ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు.
