కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్' రిలీజ్ కు రెడీ అవుతోంది. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. ఈ మూవీ ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ స్పీడప్ చేసింది.
ఈ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి 'ది వెడ్డింగ్ సాంగ్' ను విడుదల చేశారు. విడుదలైన కొద్ది సేపటికే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా ఈ పాటకు సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన మెలోడీ, రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ పాటలో అసలు హైలైట్ ఏమిటంటే.. హీరో సూర్య స్వయంగా ఈ పాటను ఆలపించడం. ఆయన గాత్రం పాటకు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచగా.. లేటెస్ట్ పాటతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. కుటుంబ బంధాలు, తండ్రి-కొడుకుల అనుబంధం, భావోద్వేగాలతో కూడిన కథను వెంకీ అట్లూరి తనదైన శైలిలో ఆవిష్కరించనున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. సూర్య సరసన యువ నటి మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్, ప్రముఖ నటి రాధిక శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ స్థాయిలో నిర్మించింది. భావోద్వేగాలు, సంగీతం, స్టార్ కాస్ట్ కలయికతో తెరకెక్కిన 'విశ్వనాథ్ అండ్ సన్స్' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి మరి.
