‘ప్రాంతేతరుడు మోసం చేస్తే.. ప్రాంతం పొలిమేరల వరకు తరిమికొడుతం..ప్రాంతం వాడే మోసం చేస్తే .. ప్రాంతం లోపల పాతి పెడతం’..అన్నాడు కాళోజీ. బరాబర్ ఇది జరగాల్సిందే. పార్టీ కోసమో, పదవుల కోసమో, పతార కోసమో, పనుల కోసమో.. ఏరేటోళ్లతోటి చేతులు కలిపి పుట్టిన గడ్డకు ద్రోహం జేస్తే అస్సలు ఊకోద్దు. ఈ ఆరం, పది రోజులకాంచి బగ్గ ఇనవడ్తాంది గూడ ఇదే. హైద్రాబాద్‌లో సర్కారోళ్లు ఎన్టీఆర్ బొమ్మ పెడితే... మన పెద్దలు లేరా? మనోళ్ల ఇగ్రాలు పెట్టకుంట పక్క రాష్ట్రం పెద్ద మనిషిది అవసరమా? అని.
పవన్ కల్యాణ్ హైద్రాబాద్ల తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ అనంగనే... మా రాష్ట్రమోస్తే పదకొండొద్దులు ఉపాసం ఉన్నాయినెకు ఈడేం పని... ముందుగాల మీ రాష్ట్రానికో రాజధాని కట్టుకో అనేటోళ్లు పెరిగిండ్రు. డిక్షనరీల తెలంగాణ పదమే లేదన్నందుకు ఓ లీడర్ను ఆర్పార్ అర్సుకుంటాండ్రు. ప్రొ. నాగేశ్వర్ మాటల మీద పెద్ద రచ్చే నడ్శింది. అరెస్టులు జేస్తరనే దాన్కవోయింది.
ఇగ లాభం లేదు... తెలంగాణ అస్తిత్వం కోసం కొట్లాడుతం... తెలంగాణ ఆత్మగౌరవం కోసం లడాయి జేద్దాం అనే మాటలు గట్టిగనే ఇనవడుతున్నయిగ. మాట్లాడాల్సిందే... ఏలేటోళ్ల తప్పులు సూపిచ్చుడేగద మేధావులు, రచయితలు, కవులు, కళాకారుల పని. ఇప్పుడు నడుస్తుంది గూడ అదే. ఐతే కొందరికి ఈ సోయి తెలంగాణ రాష్ట్రం వచ్చిన కాంచి ఎందుకు లేదు అన్నదే ప్రశ్న? తెలంగాణ కోసమే పుట్టిందని చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర సమితిల తెలంగాణ పేరు తీశేశిన్నాడు గప్‌చుప్ ఉన్నోళ్లంత ఇయ్యాల గయ్యిన లేస్తున్నరు. 12 వందల మంది అమరులైతే సగం మందిని గూడ గుర్తించలే... ఆ అమరుల పేరుతోటి హైదరాబాద్ నడిబొడ్డన బంగ్లా కట్టిస్తే.. దాని కాంట్రాక్టర్ గారిది ఆంధ్రా.
తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జలదీక్ష జేశిన జగన్ సారుతోటి.. మన కాళేశ్వరం ప్రాజెక్టుకు కొబ్బరి కాయలు కొట్టిచ్చిన గొప్పగ చరిత్ర మనది. తెలంగాణ వచ్చినందుకు ఉపాసం ఉన్న లీడర్ను ప్రగతి భవన్కు పిల్సుకోని పంచభక్ష్య పరమన్నాలు తినవెట్టిన మాగొప్ప మర్యాద పాత పాలకులది. మా నీళ్లు మాకేనని గర్జించినోళ్లం... దక్షిణ తెలంగాణను ఎడారిని జేస్తానికి పక్క రాష్ట్రం సర్కార్ సంగమేశ్వరం కడుతుంటే సప్పుడు జెయ్యక.. మీదికెల్లి రాయలసీమను రతనాల సీమ జేస్కొమన్న దిల్ దారోళ్లం. ఉద్యమ యాల్ల మోత మోగిన జయజయహే తెలంగాణ పాటను పదేండ్లు పక్కకు పెడితే.. ఎందుకో అడిగే ధైర్నం లేకపాయే. TG అని బండ్ల మీద గొప్పగా రాస్కుంటే... రాష్ట్రం రాంగనే TS ఎట్లయిందో ఎవలకాడ సమాధానముంది?
ఎట్టికైన మట్టికైన మనోడే ఉండాలన్న మాట యాదిలేకుండెనా?
గోశివెట్టి, గొంగడేశి తెలంగాణ కోసం గర్జించిన గద్దరన్నను ప్రగతిభవన్ గేట్ కాడ ఆపిన్నాడన్న మనం మాట్లాడాల్సుండే. ఉద్యమకారులను పట్టించుకోకుంట.. ఎన్నడు జై తెలంగాణ అననోళ్లు మంత్రు లైతుంటే మౌనంగ నిలవడ్డది మనమేగదా. ఉద్యమాలకు పురుడువోశిన ధర్నాచౌక్ ఎత్తేస్తే... జేఏసీని నడిపిన కోదండరామ్‌ను అరెస్ట్ జేస్తే ఖండిస్తానికే నోరు రానోళ్లం శానమందిమి. మన రైతులు తిప్పలవడుతుంటే మన పైకం పంజాబ్ రైతులకు పంచుతుంటే ఇదేందని అడిగితే బాగుండే. తెలంగాణల పార్టీకి పతార పెంచుకుంటమని పవన్ కల్యాణో, లోకేశో అనంగనే మా రాష్ట్రంల మీకేం పని అంటున్నం.
మరి మన టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయి... పక్క రాష్ట్రంల పార్టీ బ్రాంచ్ పెట్టి... దానికో అధ్యక్షుడ్ని పెట్టిన్నాడు మన మాటేంది? మహారాష్ట్రలకు ఆరొందల కార్లు ఏస్కోని అప్ అండ్ డౌన్ జేస్తుంటే... అంత అవసరం మనకెందుకు మనది మనం సూస్కుందామని ఒక్కలన్న అనకపోయిరి. ఎట్టికైన మట్టికైన మనోడే ఉండాలన్న మాట యాదిలేకుండెనా? తెలంగాణ ఇయ్యెద్దంటే ఇయ్యెద్దని రాజ్యసభల రచ్చజేశిన నందమూరి హరిక్రిష్ణ కాలం జేస్తే... మన సీఎం, మంత్రులు పోవుడేగాదు... అధికార లాంఛనాలతో ఆఖరి కార్యం జేశిండ్రు.
అయ్యోనివా నువ్వు అవ్వోనివా అని పాడిన గూడ అంజన్న కాలం జేస్తే.. పట్టించుకున్నోళ్లు లేరు. శిన్మ హీరోలు ఆళ్లే, డైరెక్టర్లు ఆళ్లే.. పెత్తనమంత ఆళ్లదే. పలుక రాకున్నా మన యాస, భాషలు పలికించి.. మనోళ్లకు రావాల్సిన పాత్రలు కొట్టేయవట్టిరి. ఇవ్వేవి గూడ తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి సంబంధించినయిగావా? పదవుల్లుండి పెదవులు మూసుకున్నోళ్ల నోటి నుంచి మల్లా ఉద్యమకాలం నాటి మాటలు రావడం వింతేంగాదు, కొంత అవసరం.
జయ జయహే తెలంగాణ పతొక్క మీటింగుల మోగుతాంది వాజీవే. తెలంగాణ తల్లి చేతిలకెల్లి బతుకమ్మ వోయింది. వందల కోట్లు పెట్టి కొత్త సచివాలయం కట్టిన్నాడు ముంగట ఆ తల్లినే నిలవెట్టి కొల్సుకుంటే ఇయ్యాల ఉంకో తల్లీ రాకపోవేమో. అప్పుడు పాయిరంగ బండ్ల నెంబర్ల మీద రాసుకున్న TG ఇప్పుడు పతొక్కలకు రూలైంది. మనందరం కల్శి పాడుకున్న జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతమే పతొక్క మీటింగుల మోగుతాంది. ఉద్యమకారుల గుర్తింపు కోసం ఓ కమిటీ వచ్చింది... ఎందర్ని గుర్తిస్తరో ఎట్ల గుర్తిస్తరో రేపురేపు తెలుస్తది. గీ పని రాష్ట్రం వచ్చినప్పుడే జేశి మనిషికో గుర్తింపు కారటిచ్చినా ఎందరో తుర్తివడేటోళ్లు.
అమీర్ పేటల ఎన్టీఆర్ ఇగ్రం ఇప్పుడు పెట్టిండ్రుగని... ఖమ్మంల కారు గౌర్మెంట్ ఎన్నడో పెట్టింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బీఆర్ఎస్ గెల్శినా రామారావు బొమ్మ పెట్టేటోళ్లు. ఎందుకంటే ఈళ్లు గూడ ఒక్కటికి పది మాట్ల మాటిచ్చిండ్రు. ఎవలు ఏలువడిలున్నా... ఏ పార్టీ పవర్లున్నా తెలంగాణకు నష్టమైతుంటే బరాబర్ ప్రశ్నించాల్సిందే. అంతేగని ప్రశ్నించేటోళ్లు, రాశేటోళ్లు, ఆడేటోళ్లు, పాడేటోళ్లు గూడ తలో పార్టీకి లైన్ తీస్కుంటే ఇగ పబ్లిక్ లైన్ల ఎట్లున్నట్టు..? పదవులకు పెదవులు మూస్కునోళ్లు కొందరైతే... కోటి రూపాయలకు నోటి మాట రానోళ్లు కొందరు. అప్పుడు మాట్లాడనోళ్లు ఇప్పుడు గర్జిస్తుండ్రు.. ఇప్పుడు సప్పుడు జెయ్యనోళ్లు అప్పుడు శితం ఎగిరిండ్రు. కొందరంటే కొందరే జనం దిక్కు నిలవడి మాట్లాడుతుండ్రు. గాళ్లే రాజకీయాల తోటి, పదవుల తోటి, పైరోవులతోటి పనిలేనోళ్లు నిఖార్సైనోళ్లు. ఆ సర్కారైనా.. ఈ సర్కారైనా కొంత మంచి జేశ్నయి... కొంత చెడు జేశ్నయి. పార్టీల కండ్లద్దాలు తీశినప్పుడే ఉన్నది ఉన్నట్టు... జరిగింది జరిగినట్టు అగువడ్తది.
తెర్లు జేస్తనే ఉన్నరు
మన యాసల మాట్లాడాలంటే నాదాన్... మన పాటలంటే నాదాన్. మన యాస, బాషలు ఇయ్యాల్టికి సుత బడి వొయ్యిలకు ఎక్కకనేవాయే. మన బతుకమ్మను దాండియా మింగేస్తుంది.. దసరా జమ్మి అలై బలైకి దూరమైతున్నం. ఏ ఊర్ల.. ఏ చౌరస్తాల మన పెద్దల బొమ్మలే పెట్టకవోతిమి. రేపటి పోరలకు ఎట్ల తెల్వాలే మన చరిత్ర. ఇంత పోరాటం జరిగినా... ఇన్నెండ్లైనా తెలంగాణ జాతిపిత ఎవలంటే.. అదో పెద్ద ప్రశ్నయింది. ఎన్నటికైనా జయశంకర్ సారుకే గా గౌరవం ఉంటదన్కుంటే.. లేలే మా కేసీఆర్ సారే అని ఒగలు.. ఇంకొందరి పేర్లు గూడ ముంగటికి తెచ్చిరి. రాజకీయాల కోసం, అధికారం కోసం ఎవలెంత తెర్లు జెయ్యాల్నో అంత జేస్తనే ఉన్నరు. అక్కెరున్నప్పుడే అస్తిత్వం, ఆత్మగౌరవం అనడమంటే... పండుగొచ్చినప్పుడే కొత్త బట్టలేస్కున్నట్టు.
తెలంగాణొస్తే ఏం జరుగుతదని జెప్పిండ్రు.. ఏం జరిగింది?
మన రాష్ట్రం మనం తెచ్చుకొని 12 ఏండ్లాయే. పదేండ్లు ఒగ పార్టీ... రెండున్నరేండ్లకాంచి ఒగ పార్టీ పవర్లుంది. తెలంగాణొస్తే ఏం జరుగుతదని జెప్పిండ్రు.. ఏం జరిగింది? వస్తయన్న కొలువులొచ్చినయా? కట్టిస్తమన్న ఇండ్లు కట్టిచ్చిండ్రా? మన భూముల దూప తీరిందా? సర్కార్ బడులు సక్కగైనయా? సర్కారు దవ్కాన్ల మంచి వైద్యం దొర్కుతుందా? మల్లన్న సాగర్ కట్టినా.. ఫ్యూచర్ సిటీ కడుతున్నా... కొత్త రింగ్ రోడ్ ఏస్తున్నా పోతున్న భూములు మనయే తప్పితే... ఏ లీడరువో, బిజినెస్ మ్యానువోగావు. ఇవ్వన్ని ఎల్లకాలం ఉండేటియే. కనీసం మన అస్తిత్వం, ఆత్మగౌరవమన్న నిలవెట్టుకున్నమాంటే... నవ్వేటోని ముంగట జారివడే కథైతుంది. తెలంగాణ పుట్టుకను పార్లమెంట్ సాక్షిగా పాకిస్తాన్ తోటి పోలిస్తే... ప్రకటనల్లో ఖండించినోళ్లు కొందరు.. మా పార్టీ ఎంపీగదాని కవర్ జేస్కున్నోళ్లు కొందరు. ఇదే మాట తమిళ్నాడు గురించి అనుంటేనా.. పార్టీలు, జెండాలు పక్కకు పడేశి ద్రవిడుల రోషమేందో సూపిచ్చేటోళ్లు.
రఘు భువనగిరి
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
