- కర్నాటక లోక్‌భవన్‌లో సింపుల్‌గా కార్యక్రమం
- పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు
- కేబినెట్ కూర్పుపై హైకమాండ్‌తో డీకే, సిద్ధూ భేటీ
న్యూఢిల్లీ: కర్నాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. బెంగళూరులోని లోక్ భవన్ లో గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమాన్ని సింపుల్ గా నిర్వహించాలని, ఆడంబరాలకు తావివ్వొద్దని నిర్ణయించుకున్నట్లు డీకే శివకుమార్ పేర్కొన్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి సుమారు 2 వేల మంది హాజరు కానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బెంగళూరు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
మరోవైపు, మంత్రివర్గ కూర్పుపై కసరత్తులో భాగంగా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న డీకే, సిద్ధరామయ్య.. మంగళవారం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తో చర్చలు జరిపారు. డీకే శివకుమార్‌తోపాటు తొలుత 10 నుంచి 20 మందితో చిన్న మంత్రివర్గం మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తుందని, ఆ తర్వాతే పూర్తిస్థాయి విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ వేడుకకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీతో డీకే శివకుమార్, సిద్ధరామయ్య విడివిడిగా సమావేశమై.. కొత్త కేబినెట్ కూర్పుపై చర్చించారు. ఈ చర్చల్లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, కర్నాటక ఇన్‌చార్జి రణదీప్ సింగ్ సూర్జేవాలా కూడా పాల్గొన్నారు.
మంత్రి పదవుల కోసం భారీగా పోటీ!
ముఖ్యమంత్రితో కలిపి గరిష్టంగా 34 మందికి మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. అయితే ఆశావహుల సంఖ్య భారీగా ఉండటంతో, తొలి పరీక్షలోనే డీకే శివకుమార్‌కు గట్టి సవాలు ఎదురవుతోంది. కుల సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత, సిద్ధరామయ్య వర్గానికి చెందిన నేతలకు సమన్యాయం జరిగేలా అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈసారి ప్రభుత్వంలో ఒకటి కంటే ఎక్కువ డిప్యూటీ సీఎం పదవులు ఉండే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తన ప్రయాణంలో గాంధీ కుటుంబం చూపిన నమ్మకానికి డీకే శివకుమార్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
బెంగళూరులో కట్టుదిట్టమైన భద్రత
ప్రమాణ స్వీకార వేడుకకు భారీగా తరలివచ్చే వీఐపీలు, అభిమానులను దృష్టిలో ఉంచుకొని బెంగళూరు పోలీసులు నగరాన్ని హై-సెక్యూరిటీ జోన్‌గా మార్చారు. లోక్‌భవన్ లాన్- బీలో ప్రత్యేక ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసి.. కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత లోక్‌భవన్ బ్యాంక్వెట్ హాల్‌లో సీఎం, మంత్రులు, గవర్నర్, ఇతర ప్రముఖులకు టీ పార్టీ ఉంటుంది. అనంతరం లోక్‌భవన్ నుంచి విధాన సౌధ వరకు డీకే శివకుమార్ ఓపెన్ జీప్ ద్వారా భారీ రోడ్‌షో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ మార్గమంతా ప్రత్యేక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు.
