తెలంగాణ, ఏపీ యువతకు గుడ్ న్యూస్..భారత వైమానిక దళంలోకి చేరేందుకు గొప్ప అవకాశం.. ఇంటర్, పాలిటెక్నికల్ డిప్లామా అర్హతతో ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు పొందవచ్చు. మార్చి 8నుంచి అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్.
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల యువతకోసం మార్చి 8నుంచి 18 వరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అగ్నీవీర్ ఓపెన్ రిక్రూట్ మెంట్ ర్యాలీని నిర్వహిస్తోంది. 12వ ఎయిర్‌మెన్ సెలక్షన్ సెంటర్ ద్వారా అగ్నివీర్ నియామకానికి ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. అర్హత కలిగిన యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సెంటర్ కమాండింగ్ ఆఫీసర్ వింగ్ కమాండర్ షేక్ యాకుబ్ అలీ కోరారు. రెండు తెలుగు రాష్ట్రాల యువత భారత వైమానిక దళంలో చేరడానికి ఇది అవకాశమని అన్నారు.
మార్చి 9 ,10 తేదీలలో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ నుంచి మహిళా అభ్యర్థులకు, మార్చి 12 మరియు 13 తేదీలలో ఆంధ్రప్రదేశ్ నుంచి పురుష అభ్యర్థులకు, మార్చి 15 మరియు 16 తేదీలలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల మధ్య హాజరు కావాలి. తెలంగాణ నుంచి పురుష అభ్యర్థులకు ఈ ర్యాలీ నిర్వహించనున్నారు.
17 ½ నుండి 21 సంవత్సరాల వయస్సు గల జూలై 2, 2005 ,జనవరి 2, 2009 మధ్య జన్మించిన పెళ్లికాని యువతీ యువకులు అర్హులు. కనీస ఎత్తు 152 సెం.మీ. ఉండాలి. అర్హత గల అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమానం, మూడేళ్ల పాలిటెక్నిక్ డిప్లొమా లేదా రెండేళ్ల ఒకేషనల్ కోర్సు (ఐటీఐ) పూర్తి చేసి ఉండాలి. విద్యా అర్హతలు ,ఇంగ్లీషులో కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి.
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవలసిన అవసరం లేదు కానీ ఒరిజినల్ లేదా డిజిలాకర్ సర్టిఫైడ్ సర్టిఫికెట్లు, నివాసం, NCC సర్టిఫికెట్లు (ఏదైనా ఉంటే), ఆధార్ కార్డ్, 10 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ప్రతి డాక్యుమెంట్ ఆరు జిరాక్స్ కాపీలను తీసుకురావాలి. శారీరక పరీక్షలలో భాగంగా 1.6 కి.మీ పరుగు ఉంటుంది ,శారీరక ,మానసిక పరీక్షలలో ఉత్తీర్ణులైన వారికి రాత పరీక్ష నిర్వహించనున్నారు.
అభ్యర్థులు తమ అర్హతలు, వయోపరిమితి, విద్యార్హతలు ,అవసరమైన డాక్యుమెంట్ వివరాల కోసం భారత వైమానిక దళం అధికారిక వెబ్‌సైట్ https://agnipathvayu.cdac.in ను సందర్శించాలి.
