రాజకీయ నాయకులు సాధారణంగా ఏసీ గదుల్లో కూర్చుని విధానాలు రూపొందిస్తుంటారు. కానీ సామాన్యుడి కష్టాన్ని అర్థం చేసుకోవాలంటే వారి స్థానంలో నిలబడాలని నిరూపించారు రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా. కేవలం మాటలతో కాకుండా.. ఒక డెలివరీ బాయ్‌గా మారి వారి రోజువారీ జీవితంలోని సవాళ్లను స్వయంగా అనుభవించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
పార్లమెంట్ మెట్ల నుండి వీధుల్లోకి..
ఈ మధ్యే సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియోలో రాఘవ్ చద్దా తన ఖరీదైన దుస్తులను పక్కనపెట్టి.. బ్లింకిట్ సంస్థకు చెందిన టీ షర్ట్, జాకెట్ ధరించి కనిపించారు. భుజాన భారీ డెలివరీ బ్యాగ్ తగిలించుకుని.. ఒక డెలివరీ పార్టనర్‌తో కలిసి స్కూటర్ వెనుక సీటుపై కూర్చుని రోడ్ల వెంట తిరిగారు. గమ్యస్థానానికి చేరుకోవాలనే ఆత్రుత, ట్రాఫిక్ ఇబ్బందులు, ఆకలి, ఎండ ఇలా వీటన్నింటి మధ్య ఆ డెలివరీ బాయ్స్ జీవనం కోసం పడే వేదనను కళ్లారా చూశారు చద్దా.
గుండెల్ని పిండేసే వాస్తవాలు..
ఒక చిన్న ఆర్డర్ కోసం డెలివరీ బాయ్స్ నిమిషాల వ్యవధిలోనే స్టోర్ నుండి కస్టమర్ ఇంటికి చేరుకోవాలి. లేదంటే కస్టమర్ రేటింగ్ పడిపోతుంది లేదా పెనాల్టీ పడుతుంది. అపార్ట్‌మెంట్ లిఫ్ట్ ఎక్కి, డోర్ బెల్ కొట్టి, వినయంగా ఆహారం లేదా సరుకులను అందించే ఆ కొద్ది నిమిషాల వెనుక గంటల తరబడి శ్రమ దాగి ఉంది. "నేను వారి రోజును జీవించాను" అంటూ రాఘవ్ చద్దా షేర్ చేసిన టీజర్ వీడియో ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది.
Away from boardrooms, at the grassroots. I lived their day.
— Raghav Chadha (@raghav_chadha) January 12, 2026
Stay tuned! pic.twitter.com/exGBNFGD3T
గత డిసెంబర్‌లో ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక డెలివరీ బాయ్ తన ఆదాయం, కష్టాల గురించి కన్నీళ్లు పెట్టుకున్న వీడియో వైరల్ అయ్యింది. ఆ సమయంలోనే రాఘవ్ చద్దా సదరు యువకుడిని తన ఇంటికి పిలిపించి భోజనం పెట్టి.. వారి సమస్యలను పార్లమెంట్‌లో వినిపించారు. సోషల్ సెక్యూరిటీ, హెల్త్ ఇన్సూరెన్స్, సరిగ్గా నిద్ర కూడా లేదు.. అయినా కడుపు నింపుకోవడానికి నిత్యం రోడ్లపై యుద్ధం చేసే గిగ్ వర్కర్ల కోసం తానే స్వయంగా రంగంలోకి దిగి సమస్యలను గమనించారు.
►ALSO READ | సెర్గియో గోర్ కామెంట్స్: గంటలోనే లాభాల్లోకి దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్స్.. 6 రోజుల నష్టాలకు బ్రేక్
కేవలం ఎన్నికల ప్రచారం కోసం కాకుండా.. నిజంగా వారి కష్టాల్లో భాగస్వామి కావాలనుకున్న ఎంపీ ప్రయత్నాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. దీనిపై ఒక నెటిజెన్ కామెంట్ చేస్తూ.. క్షేత్ర స్థాయిలోని సమస్యలను గమనిస్తున్న నిజమైన పొలిటీషియన్ మీరంటూ ప్రశంసలు కురిపించారు. మరొకరు ఇలాంటి చర్యలు ప్రస్తుతం అత్యవసరమని.. ఇతర నేతలు కూడా ఇలా వాస్తవికతను గమనించే ప్రయత్నం చేయాలని కోరుకున్నారు. అప్పుడే ప్రజల జీవితాలు బాగుపడతాయని అన్నారు.
