- లా కోర్సుల పరీక్షల్లో సేమ్ పేపర్ కు బాధ్యుడైన లెక్చరర్ పై చర్యలు
హైదరాబాద్, వెలుగు: గత నెల 27న నిర్వహించిన లా హానర్స్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్ మొలుగరం స్పష్టం చేశారు. ఆ పరీక్ష రాసిన 350మంది విద్యార్థులకు మళ్లీ ఫ్రెష్ గా ఎగ్జామ్ నిర్వహించాలని ఓయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ను ఆదేశించారు. లా కోర్సుల పరీక్షల్లో వేర్వేరు సబ్జెక్టులకు ఒకే ప్రశ్నపత్రం ఇచ్చిన ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆయన.. బాధ్యుడైన లెక్చరర్‌పై ఐదేండ్ల పాటు ఓయూ పరీక్షల నిర్వహణ, పేపర్ సెట్టింగ్ నుంచి డిబార్ చేశారు. అలాగే, సదరు లెక్చరర్ పై భారీగా జరిమానా విధించాలని నిర్ణయించారు.
అసలేం జరిగిందంటే..!
గత నెల 25న ఐదేండ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ, మూడేండ్ల బీకామ్ ఎల్‌ఎల్‌బీ ఫస్ట్ సెమిస్టర్ విద్యార్థులకు 'హిస్టరీ ఆఫ్ కోర్ట్స్, లెజిస్లేచర్స్ అండ్ లీగల్ ప్రొఫెషన్ ఇన్ ఇండియా' పరీక్ష నిర్వహించారు. అయితే, రెండు రోజుల తర్వాత (ఫిబ్రవరి 27న) మూడేండ్ల ఎల్‌ఎల్‌బీ హానర్స్ ఫస్ట్ సెమిస్టర్ విద్యార్థులకు నిర్వహించిన 'లీగల్ అండ్ కానిస్ట్యూషనల్ హిస్టరీ ఆఫ్ ఇండియా' పరీక్షలో కూడా అదే ప్రశ్నపత్రాన్ని యథాతథంగా ఇచ్చారు.
ఈ విషయాన్ని పరీక్ష రాసిన తర్వాత విద్యార్థులు గుర్తించి అవాక్కయ్యారు. దీన్ని సదరు లెక్చరర్లు 'టెక్నికల్ ఇష్యూ'గా కవర్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ.. వీసీ ప్రొఫెసర్ కుమార్ తీవ్ర నిర్లక్ష్యంగా పరిగణించారు. బాధ్యుడైన పేపర్ సెట్టర్‌పై చర్యలు తీసుకున్నారు. లా హానర్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
