- బ్యాంకు లోన్లతో విద్యుత్ రంగంలోకి అడుగు
- ప్రభుత్వంపై రూ.6 వేల కోట్ల భారం తగ్గింపు
- పీఎం కుసుమ్ స్కీమ్‌తో పైసా ఖర్చు లేకుండా
- 1,796 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు
- సిరిసిల్లలో 6 మెగావాట్ల జనరేషన్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రైతులు 1,796 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేయడానికి ముందుకొచ్చారు. దీనివల్ల ప్రభుత్వంపై రూ.6 వేల కోట్ల భారం తగ్గింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కుసుమ్ స్కీమ్ ను గత బీఆర్ఎస్ సర్కారు పక్కకు పెట్టింది. 2019 నుంచి 2023 వరకు నాలుగేళ్ల పాటు ఈ స్కీమ్ విధివిధానాలేంటో కనీసం ఒక్క రైతుకు కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు. అదే స్కీమ్‌ను ఇప్పుడు రైతన్నలు తమకు వరంగా మార్చుకున్నారు. బ్యాంకర్ల సహాయంతో తమ వ్యవసాయ భూముల్లో పంటలకు బదులు కరెంట్ పండిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఒక్క పైసా తీసుకోకుండా రూ.వేల కోట్ల పెట్టుబడితో రైతన్నలే రాష్ట్రంలో 1,796 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నారు. చాలా చోట్ల పనులు మొదలయ్యాయి. సిరిసిల్లలో ఇప్పటికే 6 మెగావాట్ల సోలార్ పవర్ జనరేషన్ స్టార్ట్ చేశారు. మరో ఐదారు నెలల్లో ఈ స్కీమ్‌లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానానికి చేరుకోబోతున్నది. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ల దృష్ట్యా ఇదే స్థాయిలో ప్రభుత్వం పవర్ జనరేషన్ చేయాలంటే కనీసం రూ.9 వేల కోట్ల పెట్టుబడి పెట్టాల్సి వచ్చేది. టీజీ రెడ్కో ఆఫీసర్ల పట్టుదల, ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో పీఎం కుసుమ్ ప్రాజెక్టు పట్టాలెక్కడంతో ప్రభుత్వానికి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేకుండా పోయింది.
విద్యుత్ ఉత్పత్తి తక్కువ.. కొనేది ఎక్కువ
రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం ఒక రోజుకు పీక్ డిమాండ్ 17 వేల మెగావాట్లకు దాటిపోయింది. 2028 నాటికి 20 వేల మెగావాట్లు మించిపోతుందని ప్రభుత్వం అంచనావేస్తోంది. అయితే రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి విషయానికి వస్తే, సగం కూడా ప్రభుత్వం ఉత్పత్తి చేయలేకపోతుంది. రోజుకు 50 శాతానికి పైగా కరెంట్‌ను బయట నుంచే కొంటున్నది. దీంతో డిస్కమ్‌లపై భారం పడుతోంది. వ్యవసాయానికి, గృహలక్ష్మికి ఉచిత కరెంట్ సరఫరా వల్ల ఏటా బకాయిలు పెరిగిపోతున్నాయి. గత బీఆర్ఎస్ సర్కారు నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో 4 వేల మెగావాట్ల సామర్థ్యంగల యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) ని ఏర్పాటు చేయడానికి రూ.29 వేల కోట్లు ఖర్చు చేసింది. ప్రాజెక్టుపూర్తయ్యే సరికి మరో ఐదారువేల కోట్ల పెట్టుబడులు పెరిగాయి. ఈ లెక్కల ఒక మెగావాట్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి గత సర్కారు రూ.7 కోట్ల నుంచి 8 కోట్లకు పైగా ఖర్చు చేసింది.
పోర్టల్ రెడీ చేస్తున్న రెడ్కో ఆఫీసర్లు
రాష్ట్రంలో పీఎం కుసుమ్ స్కీమ్‌లో భాగంగా రైతులు ఉత్పత్తి చేసే పవర్‌ను లెక్కించడానికి టీజీ రెడ్కో ఆఫీసర్లు పోర్టల్ రెడీ చేస్తున్నారు. రోజులు, నెలలే కాకుండా గంటలు, నిమిషాల లెక్కన పవర్ జనరేషన్ వివరాలు తెలుసుకోవడానికి ‘సోలార్ ఎనర్జీ డేటా మేనేజ్మెంట్ పోర్టల్’ త్వరలోనే అందుబాటులోకి రానున్నది. రైతులు తమ వ్యవసాయ భూముల వద్ద ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసుకొని వీటి ద్వారా ఉత్పత్తి అయిన కరెంట్ ను సబ్ స్టేషన్‌కు సరఫరా చేస్తారు. దీనికోసం రిమోట్ మానిటరింగ్ సిస్టమ్(ఆర్ఎంఎస్) పనిచేస్తుంది.
ఐదారు నెలల్లో పనులు పూర్తి చేస్తం
పీఎం కుసుమ్ స్కీమ్‌లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,156 మంది రైతులు 1,796.3 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణ పనులను మొదలుపెట్టారు. మరో ఐదారు నెలల్లో పనులన్నీ పూర్తయితే, దేశంలోనే రాష్ట్రం సోలార్ పవర్ ఉత్పత్తిలో నంబర్‌వన్‌గా నిలుస్తుంది. రాష్ట్రంలో ఈ స్కీమ్ ఆలస్యంగా ప్రారంభమైనా ప్రభుత్వం, బ్యాంకర్ల సహకారంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. – అనిలా, వైస్ చైర్మన్ అండ్ ఎండీ, టీజీ రెడ్కో, హైదరాబాద్
రూ.3.25 కోట్లకే ఒక మెగావాట్ సోలార్ పవర్
పీఎం కుసుమ్ స్కీమ్‌లో ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి సుమారు రూ.3.25 కోట్లు మాత్రమే ఖర్చు అవుతున్నది. ఇందులో 70 నుంచి 85 శాతం బ్యాంకులు రుణాలుగా అందిస్తున్నాయి. మిగతావి రైతులే పెట్టుబడిగా పెట్టి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,156 మంది రైతులు 1,796.3 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి డిస్కమ్‌లతో పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు (పీపీఏ) లు చేసుకున్నారు. ఇందులో ఎన్పీడీసీఎల్ పరిధిలో 436 మంది రైతులు 631.9, ఎస్పీడీసీఎల్ పరిధిలో 720 మంది రైతులు 1,164.4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల పనులను మొదలు పెట్టారు.
మొత్తం 33 సర్కిళ్ల పరిధిలో పనులు మొదలయ్యాయి. ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బరోడా, యూనియన్ బ్యాంకుల నుంచి రుణాలు పొందిన రైతన్నలు సోలార్ పవర్ ప్లాంట్ల పనులు మొదలుపెట్టారు. సిరిసిల్లలో ఇప్పటికే ముగ్గురు రైతులకు పనులను కంప్లీట్ చేసి 6 మెగావాట్ల పవర్ జనరేషన్ స్టార్ట్ చేశారు. లోకల్‌గా ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్‌కు సోలార్ పవర్‌ను అందిస్తున్నారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తితో పోలిస్తే ఒక మెగావాట్పై రూ.5 కోట్లకు పైగా ఖర్చు సేవ్ అవుతున్నది. ఈ లెక్కను ప్రభుత్వం మోయాల్సిన రూ.6 వేల కోట్ల భారం తగ్గినట్లు అయ్యింది.
