బతుకులు బుగ్గి.. దుబ్బపల్లిని కమ్మేస్తున్న కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు బూడిద

బతుకులు బుగ్గి.. దుబ్బపల్లిని కమ్మేస్తున్న కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు బూడిద
  • పగలంతా సైలోల్లో నిల్వ., రాత్రిళ్లు డంపింగ్​ యార్డుకు..
  • విషపు కోరల్లో మోరంచవాగు
  • నీళ్లుపారి దెబ్బతింటున్న పంటలు
  • రోగాల బారిన జనాలు 
  • మృతిచెందుతున్న మూగజీవాలు
  • పీసీబీ నిబంధనలు బేఖాతర్

జయశంకర్​ భూపాలపల్లి, వెలుగు: కాకతీయ థర్మల్ పవర్​ ప్రాజెక్టు (కేటీపీపీ) నుంచి వెలువడుతున్న బూడిదతో ప్లాంట్ పరిసరాల్లోని ప్రజలకు ఊపిరి సలపడం లేదు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ శివారులోని దుబ్బపల్లి పరిసరాల్లోని 1000 ఎకరాల్లో 1100 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గును బర్న్ చేయడం  వలన గాల్లోకి వస్తున్న బూడిద ప్లాంట్ ను ఆనుకుని ఉన్న దుబ్బపల్లి, చెల్పూర్ బస్టాండ్ పరిసరాలను కమ్మేస్తోంది. దీంతో గ్రామస్తులు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతుండగా, పంట పొలాలపై బూడిద పేరుకుపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పీసీబీ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

పంటలు బూడిద పాలు...

కేటీపీపీ నుంచి వెలువడుతున్న బూడిద రైతుల బతుకులను ఆగం చేస్తుంది. ప్లాంట్ లో కరెంట్ ఉత్పత్తి సమయంలో వెలువడే బూడిదను బయటకు వెళ్లేందుకు దుబ్బపల్లిని ఆనుకుని రెండు సైలోలు ఏర్పాటు చేశారు. అయితే మొదట్లో బూడిదను ఉచితంగా ఇచ్చినప్పటికీ 2019 నుంచి టెండర్ ప్రక్రియ ద్వారా బూడిద విక్రయాలు చేపడుతున్నారు. టన్నుకు రూ.347 ఉండటంతో బూడిద కొనుగోళ్లకు బల్క్​ ఓనర్లు ముందుకు రావడం లేదు. దీంతో పగలంతా రెండు సైలోల్లో డంపు చేస్తున్న కేటీపీపీ యాజమాన్యం రాత్రి వేళల్లో సైలోలు ఓవర్ ఫ్లో కావడంతో దుబ్బపల్లి సమీపంలోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఈక్రమంలో ప్లైయాష్​ పైప్​ లైన్ లీకేజీల నుంచి పక్కనే ఉన్న మోరంచవాగుకు బూడిద వ్యర్థాలు చేరుతున్నాయి. ప్లాంట్ నుంచి వస్తున్న వ్యర్థ జలాలు సైతం మోరంచలో ఒక పాయలాగా పారుతున్నాయి.

నిర్విరామంగా వెలువడుతున్న బూడిద వ్యర్థాలతో మోరంచలో రెండు అడుగుల మేర బూడిద పూడిక మాదిరిగా పేరుకుపోయింది. వానకాలం, యాసంగి సీజన్ లో మోరంచ వాగు పరిధిలో భూపాలపల్లి మండలం మోరంచపల్లి, వజినపల్లి, నేరుడుపల్లి, చిట్యాల మండలం ఒడితల, దూద్ పల్లి, కొత్తపల్లి, అందుకుతండా, పాశిగడ్డతండా, గరిమిళ్లపల్లి గ్రామాల రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఈ గ్రామాల మీదుగా బూడిదతో కలుషితమైన మోరంచవాగు మానేరులో కలుస్తుంది. అయితే, బూడిద వ్యర్థాలతో ఏటా సాగు చేస్తున్న సుమారు 700 ఎకరాల్లో పంటలు నష్టపోతుండగా, వరి దిగుబడి తగ్గిపోతుంది. పొలాలకు నీటిని తరలించే క్రమంలో బూడిద వల్ల కరెంట్ మోటర్ల బుష్ లు దెబ్బతింటున్నాయి.

రిపేర్​ చేసిన మోటర్లు నెల తిరగకుండానే పాడవుతున్నాయి. వరి నారుమడి నుంచి రోగాల బారిన పడి పంట దిగుబడి తగ్గుతుండగా, మిరప చేను ఆకులపై బూడిద పేరుకుపోయి పైరు ఎదుగుదల నిలచిపోతోంది. బూడిద కలిసిన నీరుతాగి మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బూడిదతో ఎండకాలంలోనూ దగ్గుతో పాటు ఊపిరిత్తుల వ్యాధుల బారిన పడుతున్నట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. 

నీటిపై రాతలు పీసీబీ నిబంధనలు..!

కేటీపీపీ పరిసరాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు. బూడిద సమస్యపై గతంలో దుబ్బపల్లి గ్రామస్తులు పీసీబీకి ఫిర్యాదు చేశారు. దీంతో పీసీబీ బృందాలు కాలుష్య తీవ్రతను అంచనా వేసి కేటీపీపీ యాజమాన్యానికి రూ.కోటి జరిమానా విధిస్తూ నోటీసులు అందజేశారు. బూడిద నియంత్రణకు వాటర్ స్ర్పింకర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కానీ, కంటి తుడుపు చర్యగా పగటి వేళల్లో ట్రాక్టర్ల ద్వారా రోడ్ల వెంట వాటర్ క్యూరింగ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప, పూర్తిస్థాయిలో నివారణ చర్యలు చేపట్టడం లేదు. రాత్రి సమయంలో బయటకు వెళ్లలేని స్థితిలో ఊరిని బూడిద కమ్మేస్తోందని గ్రామస్తులు 
పేర్కొంటున్నారు. 

బూడిదతో రోగాలు వస్తున్నాయి.. 

కేటీపీపీ నుంచి వెలువడుతున్న బూడిదతో రోగాలు బారిన పడుతున్నాం. పంట పొలాలనూ బూడిద వదలడం లేదు. నారు మడి నుంచే బూడిదతో పంటలు దెబ్బతింటున్నాయి. పంటలను మందులతో కాపాడుకోవడం ఒక ఎత్తైతే, పంటలకు నీటిని తరలించే మోటర్లను రిపేర్లు చేసేందుకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. మోరంచ వాగులో రెండు అడుడుల మేర ఉన్న బూడిద పూడిక మాదిరిగా కనిపిస్తుంది. - దగ్గు బుచ్చారావు, దుబ్బపల్లి