హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో ఐదేండ్ల లా కోర్సు, మూడేండ్ల లా హానర్స్ కోర్సు పరీక్షలు ఇటీవల నిర్వహిస్తే ఒకే రకమైన క్వశ్చన్ పేపర్ ఇచ్చారని బీఆర్ఎస్ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
గత నెల 25న ఒక కోర్సుకు, 27న మరో కోర్సుకు ఎగ్జామ్స్జరిగాయన్నారు. రెండింటి ప్రశ్నాపత్రాలు ఒకేలా ఉన్నాయని, ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలన్నారు. పాలన చేతకాకపోతే దిగిపోవాలని సూచించారు.
గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో బ్లాక్ లిస్ట్ లో ఉన్న కంపెనీలకు ఒకేషనల్ విద్యాసంస్థల టెండర్లు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. గ్రూప్–1లో అనేక తప్పులు జరిగాయని, కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినంత మాత్రాన అదేం కరెక్ట్అయిపోదన్నారు. శారదా పీఠానికి నోటీసులు ఇచ్చి బుల్డోజర్లతో కూలుస్తామని చెప్పారని, హరీశ్‌రావు వెళ్లగానే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని పేర్కొన్నారు. విద్యా కమిషన్రిపోర్టు తప్పులతడకగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
