భారతీ ఎంటర్‌‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్కు అవార్డు

భారతీ ఎంటర్‌‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్కు అవార్డు

హైదరాబాద్, వెలుగు: భారతీ ఎంటర్‌‌ప్రైజెస్ ఫౌండర్​, చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్‌‌కు గ్లోబల్ టెలికం రంగంలో అత్యున్నతమైన జీఎస్ఎంఏ లైఫ్‌‌టైమ్ అచీవ్‌‌మెంట్ అవార్డు లభించింది. ప్రపంచవ్యాప్తంగా టెలికం రంగం అభివృద్ధికి చేసిన కృషికి, కోట్లాది మంది వినియోగదారులకు కనెక్టివిటీని విస్తరించడంలో ఆయన పోషించిన పాత్రకు గుర్తింపుగా ఈ అరుదైన గౌరవం దక్కింది. 

బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌‌లో స్పెయిన్ రాజు ఫెలిపే 6, ఆ దేశ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ సమక్షంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. జీఎస్ఎంఏ చరిత్రలో ఈ గౌరవాన్ని పొందిన అతికొద్ది మందిలో మిట్టల్ ఒకరు.

మిట్టల్ నేతృత్వంలోని భారతీ ఎయిర్‌‌టెల్ ప్రస్తుతం భారత్, ఆఫ్రికా ఖండాల్లో కార్యకలాపాలు సాగిస్తూ ప్రపంచంలోని టాప్–3 మొబైల్ ఆపరేటర్లలో ఒకటిగా నిలిచింది. 50 కోట్లకు పైగా వినియోగదారులకు సేవలందిస్తున్న ఆయన, 2017 నుంచి 2018 వరకు జీఎస్ఎంఏ చైర్మన్‌‌గా కూడా వ్యవహరించారు. ఆ సమయంలో పెట్టుబడులు, ఆవిష్కరణలను ప్రోత్సహించారని, 2008, 2016లోనూ జీఎస్ఎంఏ చైర్మన్ అవార్డులను అందుకున్నారని భారతీ ఎంటర్​ప్రైజెస్​ తెలిపింది.