- అమాయక రైతులకు అంటగడుతున్నరు: రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
- పార్లమెంట్‌లో కొట్లాడుతా: ఎంపీ కావ్య
- ఐఎంఏ ఆధ్వర్యంలో ‘పారాక్వాట్ ఫ్రీ ఇండియా’ సదస్సు
- ఆ మందును బ్యాన్ చేయాల్సిందేనని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: మన పూర్వీకులు ఎప్పుడూ గడ్డిమందు వాడలేదని, కేవలం మల్టీ నేషనల్ కంపెనీల(ఎంఎన్సీ) కోసమే పారాక్వాట్ మందు తెచ్చారని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆరోపించారు. ఆ గడ్డిమందుతో అమాయక రైతుల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాంతకమైన పారాక్వాట్ను తక్షణమే నిషేధించాలని డిమాండ్ చేశారు. మంగళవారం కోఠిలోని ఐఎంఏ హాల్ లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆధ్వర్యంలో ‘‘పారాక్వాట్ ఫ్రీ ఇండియా’’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం మొత్తం రసాయనాల మయంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ ఎరువులు, ప్రమాదకర మందులు సాగు రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. గడ్డిమందును నిషేధించేలా కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలి. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని, అసెంబ్లీ స్పీకర్ ను కలిసి వినతిపత్రం ఇస్తం’’ అని అన్నారు. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పి.కిషన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీలు కడియం కావ్య, ఈటల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు కె.ఆర్.సురేశ్ రెడ్డి, బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్, ఐఎంఏ గౌరవ కార్యదర్శి డాక్టర్ వి. అశోక్, డాక్టర్ టి. దయాల్ సింగ్, డాక్టర్ గంగాధర్, టీఎంసీ మెంబర్ డాక్టర్ గుండగాని శ్రీనివాస్, డాక్టర్లు, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు.
సైనైడ్ కంటే డేంజర్
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ.. పారాక్వాట్ సైనైడ్ కంటే ప్రమాదకరమని హెచ్చరించారు. ‘‘రెండు, మూడు చుక్కలు శరీరంలోకి వెళ్తే చాలు ప్రాణాలు గాల్లో కలుస్తాయి. ఇంతటి విషాన్ని అమెజాన్ వంటి ఆన్ లైన్ సైట్లలో యథేచ్ఛగా అమ్ముతుండటం బాధాకరం. దీనికి విరుగుడు లేదు.. తాగితే చావు తప్పదు. పారాక్వాట్ బ్యాన్ కోసం ఎంపీలందరినీ కూడగట్టి కేంద్ర మంత్రులపై ఒత్తిడి తెస్తా. పార్లమెంట్ లో ఈ విషయంపై కొట్లాడుతా.” అని అన్నారు.
పారాక్వాట్ ను బ్యాన్ చేయాలని తీర్మానం..
పారాక్వాట్ వల్ల జరుగుతున్న మరణాలను అరికట్టేందుకు తక్షణమే దీనిని నిషేధించాలని కోరుతూ ఐఎంఏ సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. కేరళ, ఒడిశా రాష్ట్రాల తరహాలో రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర పరిధిలోని అధికారాలను ఉపయోగించి పారాక్వాట్ ను బ్యాన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. అలాగే, దేశవ్యాప్తంగా ఈ ప్రమాదకర మందును నిషేధించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ఈ అంశాన్ని రాబోయే పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తుతామని ప్రజా ప్రతినిధులు తీర్మానించారు.
యువతే బలవుతున్నారు..
ప్రమాదకరమైన పారాక్వాట్ మందుకు యువత, ముఖ్యంగా విద్యార్థులు బలవుతున్నారు. గతంలో నిమ్స్ లో నమోదైన 253 పారాక్వాట్ పాయిజనింగ్ కేసులను విశ్లేషిస్తే.. బాధితుల్లో ఎక్కువ మంది 20 నుంచి 30 ఏళ్ల వయసున్న వారే ఉండటం ఆందోళన కలిస్తున్నది. 2022లో రైతులు ఎక్కువగా దీని బారిన పడగా, 2023–-24 నాటికి ఆ స్థానంలోకి విద్యార్థులు, యువత (46.2%) వచ్చారు. క్షణికావేశంలో ఈ పురుగుమందు తాగి హాస్పిటల్కు వస్తున్న వారిలో దాదాపు 86 శాతం మంది మృత్యువాత పడుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.
