న్యూఢిల్లీ: మన దేశ టెలికాం రంగం 2025 డిసెంబరు క్వార్టర్ ముగిసే సమయానికి భారీ వృద్ధి సాధించింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 102 కోట్లు దాటింది.
గత సెప్టెంబరులో 101.78 కోట్లుగా ఉన్న ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య డిసెంబరు నాటికి 102.86 కోట్లకు చేరింది. ఇది 1.06 శాతం క్వార్టర్లీ వృద్ధిని సూచిస్తోంది. బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు కూడా 100 కోట్లు దాటి 100.73 కోట్లుగా నమోదయ్యారు. మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య 122.89 కోట్ల నుంచి 130.61 కోట్లకు పెరిగింది. ఇది వార్షిక ప్రాతిపదికన 9.77 శాతం వృద్ధిని నమోదు చేసింది.
దేశవ్యాప్త టెలి డెన్సిటీ 86.65 శాతం నుంచి 91.74 శాతానికి మెరుగుపడింది. వైర్‌లెస్ యూజర్లు 7.64 కోట్ల మేర పెరిగి 125.87 కోట్లకు చేరుకున్నారు. టెలికాం కంపెనీల ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. డిసెంబరు క్వార్టర్ లో మొత్తం రాబడి రూ.1,02,475 కోట్లు కాగా, సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) రూ.84,270 కోట్లుగా నమోదైంది. నెలవారీ సగటు ఆదాయం (ఏఆర్పీయూ) రూ.190.99 నుంచి రూ.194.57కు పెరిగింది.
ఇదిలా ఉంటే, ప్రభుత్వం ఈ క్వార్టర్లో 920 ప్రైవేట్ శాటిలైట్ టీవీ ఛానళ్లకు అనుమతి ఇచ్చింది. అందులో 335 పే ఛానళ్లు ఉండగా మిగిలినవి ఉచిత ఛానళ్లు. డేటా సేవలకు పెరిగిన డిమాండ్ కారణంగా టెలికం కంపెనీల ఆదాయం గణనీయంగా మెరుగుపడింది.
