ప్రైవేటు కంపెనీలకు మరో 28 రైళ్లు?

ప్రైవేటు కంపెనీలకు మరో 28 రైళ్లు?

ప్రైవేటు కంపెనీలకు మరిన్ని రైళ్ల నిర్వహణ బాధ్యతను అప్పగించాలని రైల్వేశాఖ ఆలోచిస్తోంది. కొన్ని ముఖ్యమైన రైల్వేరూట్లను ప్రైవేటు ప్లేయర్లకు అప్పగించడం వల్ల ప్రయాణికులకు మరిన్ని సేవలు, సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని భావిస్తోంది. వివిధ రూట్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించడానికి రైల్వేశాఖ చేపట్టిన100 రోజుల యాక్షన్‌‌ప్లాన్‌‌లో భాగంగా ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇది వరకే రెండు తేజస్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌ల నిర్వహణను ఇండియన్‌‌ రైల్‌‌ కేటరింగ్‌‌ అండ్‌‌ టూరిజం కార్పొరేషన్‌‌ (ఐఆర్‌‌సీటీసీ)కి అప్పగించారు. ఇవి లక్నో–న్యూఢిల్లీ, ముంబై–అహ్మదాబాద్‌‌ రూట్లలో నడుస్తాయి. ప్యాసింజర్‌‌ రైళ్లను ప్రైవేటు కంపెనీలకు అప్పగించడంపై చర్చించడానికి ఈ నెల 27న రైల్వేశాఖ సీనియర్‌‌ ఆఫీసర్లు ఢిల్లీలో భేటీ అవుతున్నారు.   ప్రయాణికులకు ప్రపంచస్థాయి సేవలను అందించడానికి ప్యాసింజర్‌‌ రైళ్ల నిర్వహణ బాధ్యతను కూడా ప్రైవేటు కంపెనీలకు ఇవ్వాలని రైల్వేమంత్రిత్వశాఖ ప్రతిపాదించిందని కోచింగ్‌‌ ఆఫ్‌‌ ది రైల్వే బోర్డ్‌‌ చైర్మన్‌‌ మధుసూదన్‌‌ రెడ్డి సీనియర్‌‌ ఆఫీసర్లకు లెటర్‌‌   రాశారు. ముఖ్యమైన సిటీలను కలుపుకుంటూ వెళ్లే రైళ్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేటుకు అప్పగించడానికి పార్టిసిపేటివ్ బిడ్‌‌ నిర్వహిస్తామని తెలిపారు. ‘‘ఇలా చేయడం వల్ల ప్యాసింజర్లకు ఆధునిక రైళ్లు అందుబాటులోకి వస్తాయి.  ఆపరేటర్లకు రైల్వేశాఖ హాలేజ్‌‌ చార్జీలు చెల్లిస్తుంది. ఇందుకోసం ఆర్‌‌ఎఫ్‌‌క్యూను (రెక్వెస్ట్‌‌ ఫర్‌‌ కోట్), కన్సెషన్‌‌ డాక్యుమెంట్లను తయారు చేయడానికి రూట్లను, సర్వీసుల సంఖ్యను గుర్తించాలి’’ అని ఈ లెటర్‌‌ పేర్కొంది.

ప్రైవేటీకరించబోయే ట్రైన్లు ఇవే…

వివిధ నగరాలను కలుపుతూ 14 రూట్లలో ప్రయాణించే ఇంటర్‌‌ సిటీ ఎక్స్‌‌ప్రెస్‌‌లు, 10 ఓవర్‌‌నైట్‌‌, లాంగ్ డిస్టెన్స్‌‌ సర్వీసులను, నాలుగు సబర్బన్‌‌ సర్వీసులను ప్రైవేటుకు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. వీటిలో ఢిల్లీ–ముంబై, ఢిల్లీ–లక్నో, ఢిల్లీ–జమ్మూ/కాట్రా, ఢిల్లీ–హౌరా,  సికింద్రాబాద్‌‌–ఢిల్లీ, ఢిల్లీ–చెన్నై, ముంబై–చెన్నై, హౌరా–చెన్నై, హౌరా–ముంబై రైళ్లు ఉన్నాయి. వీటితోపాటు ముంబై–అహ్మదాబాద్‌‌, ముంబై–పుణే, ముంబై–ఔరంగాబాద్‌‌, ముంబై–మడ్‌‌గావ్‌‌, ఢిల్లీ–చండీగఢ్‌‌/అమృత్‌‌సర్‌‌, ఢిల్లీ–జైపూర్‌‌/ఆజ్మీర్‌‌, హౌరా–పూరి, హౌరా–టాటా, హౌరా–పట్నా, సికింద్రాబాద్‌‌–విజయవాడ, చెన్నై–బెంగళూరు, చెన్నై–కోయంబత్తూరు, చెన్నై–మదురై, ఎర్నాకుళం–త్రివేంద్రం తదితర ఇంటర్‌‌సిటీ ఎక్స్‌‌ప్రెస్‌‌లూ ఉన్నాయి. ముంబై, కోల్‌‌కతా, చెన్నై, సికింద్రాబాద్‌‌లోని సబర్బన్‌‌ రైళ్లను సైతం ప్రైవేటీకరించే ఆలోచన ఉంది.  రైలు సర్వీసులను ప్రైవేటు కంపెనీలకు అప్పగించే ముందు ట్రేడ్‌‌ యూనియన్లను, ఇతర భాగస్వాములను సంప్రదిస్తామని రైల్వేశాఖ ఇది వరకే ప్రకటించింది. ఐఆర్‌‌సీటీసీ వచ్చే నెల నుంచి తేజస్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌లలో ప్రయాణానికి టికెట్లు ఇవ్వడం మొదలుపెడుతుంది. లక్నో–ఢిల్లీ ఎక్స్‌‌ప్రెస్‌‌ ఏసీ చైర్‌‌కార్‌‌ కనీస చార్జీ రూ.1,125 కాగా, ఢిల్లీ–లక్నో ఎక్స్‌‌ప్రెస్‌‌కు రూ.1,280 వసూలు చేస్తారు. ఎగ్జిక్యూటివ్‌‌ చైర్‌‌కార్‌‌ చార్జీ రూ.2,450 ఉంటుంది. లక్నో–ఢిల్లీ తేజస్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌ ఎగ్జిక్యూటివ్‌‌ చైర్‌‌కార్‌‌ చార్జీగా రూ.2,310 వసూలు చేస్తారు. అయితే విమాన కంపెనీల మాదిరే వీటికి డైనమిక్‌‌ చార్జీలు వర్తిస్తాయి కాబట్టి ధరల్లో కొన్ని మార్పులు ఉంటాయని ఒక ఆఫీసర్​ తెలిపారు.

ఈ నెల 30న ఐఆర్‌‌‌‌సీటీసీ ఐపీఓ

ఇటీవల మార్కెట్లు భారీగా పెరగడంతో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌‌‌‌సీటీసీ) ఐపీఓకు సిద్ధమయింది. ఐపీఓ ముసాయిదాను సెబీ వద్ద  ఇది వరకే దాఖలు చేసింది. అయితే ఇందులో ఆఫర్‌‌ సైజును తెలియజేయలేదు. ఇది రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా.  ఒక్కో షేరు ఫేస్ వాల్యూ రూ.10 కాగా 2 కోట్ల ఈక్విటీ షేర్లను  జారీ చేస్తారు. వీటిలో 50 శాతం షేర్లను క్వాలిఫైడ్ ఇన్‌‌స్టిట్యూషనల్ బయర్లకు కేటాయిస్తారు.  మరో 15 శాతం షేర్లు నాన్‌‌ ఇన్‌‌స్టిట్యూషనల్ బిడ్డర్లకు అందుబాటులో ఉంటాయి. కనీసం 35 శాతం వాటాను రిటైల్‌‌ ఇన్‌‌డివిడ్యువల్ బిడ్డర్లకు ఆఫర్ చేస్తుంది.  ఐఆర్‌‌సీటీసీ ఇండియన్ రైల్వే విభాగమనే విషయం తెలిసిందే.   రైల్వే స్టేషన్లలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌‌‌‌ను, రైల్వేకి కేటరింగ్ సర్వీస్‌‌లను, ఆన్‌‌లైన్ ర్వైలే టిక్కెట్లను ఇది ఆఫర్ చేస్తోంది. ఈ ఐపీఓ వల్ల ఐఆర్‌‌సీటీసీలో ప్రభుత్వవాటా 12.5 శాతానికి తగ్గుతుంది. ఐపీఓకు బుక్‌‌రన్నింగ్‌‌ లీడ్ మేనేజర్లుగా ఐడీబీఐ క్యాపిటల్‌‌ మార్కెట్‌‌ అండ్‌‌ సెక్యూరిటీస్ లిమిటెడ్‌‌, ఎస్‌‌బీఐ క్యాపిటల్‌‌ మార్కెట్స్‌‌, యెస్‌‌ సెక్యూరిటీస్‌‌ పనిచేయనున్నాయి.