పార్థీ గ్యాంగ్ ముఠా సభ్యుల అరెస్ట్

పార్థీ గ్యాంగ్ ముఠా సభ్యుల అరెస్ట్

బోపాల్ నుంచి వచ్చి సిటీలో దొంగతనాలు  మొత్తం 12 చోరీలు
ప్రధాన నిందితురాలు డిస్కో మనీషాతో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్,వెలుగు: మోస్ట్ వాంటెడ్ పార్థీ గ్యాంగ్ గుట్టురట్టైంది. వరుస చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాలో ప్రధాన నిందితురాలు సహా మరో ఇద్దరిని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ సభ్యుల నుంచి రూ.22 లక్షల విలువ చేసే 60 తులాల బంగారు ఆభరణాలు,డైమండ్ రింగ్,2 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12 దోపిడీలు చేసిన పార్థీ ముఠా వివరాలను హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ శనివారం వెల్లడించారు.

గత నెల 26న తార్నాకలో

ఓయూ పీఎస్ పరిధిలో జరిగిన దోపిడీ కేసును ఈస్ట్ జోన్ పోలీసులు ఛేదించారు. గత నెల 26న తార్నాకలోని పి.సతీష్ రెడ్డి పట్టపగలే జరిగిన చోరీ కేసులో బాధితుడి కంప్లయింట్ తో  పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేశారు. డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ రమేశ్ నాయక్ టీమ్ సీన్ ఆఫ్ అఫెన్స్ నుంచి సీసీ కెమెరాల ఫుటేజ్ ను స్వాధీనం చేసుకుంది. ఫింగర్ ప్రింట్స్,సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా చోరీ చేసింది మధ్యప్రదేశ్ కి చెందిన పార్థీ గ్యాంగ్ గా గుర్తించారు.  ఇన్ స్పెక్టర్ రమేశ్ నాయక్ తో పాటు డీఎస్సై గంగాధర్ రెడ్డి  ఈనెల 1న మధ్యప్రదేశ్ లోని బోపాల్ వెళ్లారు.

ఫోర్డ్ కారు పట్టించింది

తార్నాకలో దోపిడీ చేసేందుకు వచ్చిన పార్థీ గ్యాంగ్ వాడిన ఫోర్డ్ కారు నంబర్ ఆధారంగా స్పెషల్ టీమ్ బోపాల్ వెళ్లింది. స్థానిక పోలీసులు, ఆర్టీఏ అధికారుల సహకారంతో  దొంగల ముఠా కోసం గాలించింది.  కారులో పారిపోతున్న ముగ్గురు సభ్యులను ఈ నెల 4న రమేశ్ నాయక్ టీమ్ అరెస్ట్ చేసి హైదరాబాద్ కి తరలించింది. ఆరుగురు సభ్యుల ముఠాలో ప్రధాన నిందితురాలైన మనీషా డిస్కో అలియాస్ రుఖాయియ(35), ఆమె భర్త అలీ రజాఖాన్(33),రూపా భాయ్(45)ని అరెస్ట్ చేశారు.  మనీషా పార్థీ గ్యాంగ్  రాష్ట్ర వ్యాప్తంగా 12 చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. మనీషా డిస్కో  ట్రైన్ లో సిటీకి వచ్చి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోని ఇండ్లల్లో చోరీలు చేసినట్లు విచారణలో తేలింది.

మధ్యప్రదేశ్ లోని  బోపాల్ ఈద్గా హిల్స్ కు చెందిన మనీషాడిస్కో  లేబర్ గా పనిచేసేది. ఈ క్రమంలో ఒనిదా గ్రామానికి చెందిన మరో మహిళ రూపా భాయ్ తో ఆమెకి పరిచయం ఏర్పడింది. ఈ ఇద్దరు కలిసి రైళ్లలో వస్తూ చోరీలు చేసే వారు. 2004 నుంచి మనీషా భర్త అలీ రజాఖాన్, రూపా భాయ్ కి తెలిసిన భీమ్ లేశ్,టిమ్ టిమ్,మౌఖమ్ లతో ఓ గ్యాంగ్ ను ఏర్పాటు చేసింది.  రైళ్లలో ప్రయాణం చేస్తూ మనీషా గ్యాంగ్ వరుస చోరీలకు పాల్పడేది. ఇలా 2011 నుంచి  హైదరాబాద్ లో 5 చోరీలు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2,రాచకొండలో 1,వరంగల్ లో 3,ఏపీ రేణిగుంటలో  ఓ చోరీ చేశారు. 12 కేసుల్లో మొత్తం 103 తులాల బంగారు ఆభరణాలు, 7.3 కిలోల వెండి, రూ.8వేల నగదు దోపిడీ చేశారు. ఇలా చోరీలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న మనీషా డీస్కో ముఠాను ఓయూ పోలీసులు టెక్నికల్ ఆధారాలతో అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 60 తులాల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి,చోరికి ఉపయోగించిన ఫోర్ట్ కారును స్వాధీనం చేసుకున్నారు.