రేషన్​ కార్డులో తనపేరు కుత్తా అని వచ్చిందంటూ బాధితుడి నిరసన

రేషన్​ కార్డులో తనపేరు కుత్తా అని వచ్చిందంటూ బాధితుడి నిరసన

బంకుర (బెంగాల్): గవర్నమెంట్ అధికారుల వ్యవహార శైలిపై ఓ బాధితుడు వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. రేషన్​ కార్డులో తన పేరు ‘శ్రీకాంతి కుమార్​ దత్తా’కి బదులు ‘శ్రీకాంతి కుమార్​ కుత్తా’ అని ప్రింట్​ కావడంతో సరి చేసేందుకు అధికారుల చుట్టూ తిరిగాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో జిల్లా స్థాయి అధికారి ముందు భౌ.. భౌ.. భౌ.. అంటూ నిరసన తెలిపాడు. దెబ్బకు అధికారులు దిగొచ్చి పేరులో ఉన్న తప్పును సరిచేశారు. పశ్చిమ బెంగాల్​లోని బంకురా జిల్లాకు చెందిన శ్రీకాంతి కుమార్​ దత్తా రేషన్​ కార్డులో పేరు తప్పుగా ప్రింట్ అయ్యింది. దీంతో దూరే గవర్నమెంట్​ ఆఫీస్​లో దరఖాస్తు చేసుకున్నాడు. ‘శ్రీకాంతి కుమార్ ​మెండల్’ పడిందని ‘శ్రీకాంతి కుమార్​ దత్తా’గా మార్చాలని చెప్పాడు.

అయితే అధికారులు ‘శ్రీకాంతో కుమార్​ దత్తా’గా కరెక్షన్​ చేశారు. మళ్లీ పేరు తప్పు ఉందని, తన పేరు శ్రీకాంతి కుమార్​ దత్తా అని చెప్పి దరఖాస్తు చేసుకున్నాడు. ప్రాసెస్​ పూర్తయ్యాక ప్రింట్​ తీసుకొని చూడగా.. ‘శ్రీకాంతి కుమార్​ కుత్తా’గా వచ్చింది. కుత్తా అంటే హిందీలో కుక్క. అధికారుల వ్యవహార శైలికి విసిగిపోయిన సదరు వ్యక్తి, దూరే గవర్నమెంట్​ ఆఫీస్​లో భౌ.. భౌ.. భౌ అంటూ తన సమస్య వివరించాడు.  ఓ అధికారి అయితే బాధితుడిని చూసి పారిపోయాడు. అంతలోనే జిల్లా స్థాయి అధికారి ఒకరు అటువైపుగా వెళ్లడాన్ని చూసి కారు ఆపాడు. సమస్యేమీ చెప్పకుండా భౌ.. భౌ.. భౌ.. అంటూ అరుస్తూ కాగితాలు చూపించాడు. సదరు వ్యక్తి వ్యవహార శైలిపై కారు నుంచి కిందికి దిగేందుకు అధికారి భయపడ్డాడు. రేషన్​ కార్డు చూసి.. పేరు మార్చాల్సిందిగా అక్కడే ఉన్న అధికారులకు సూచించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​ అయ్యింది. కొన్ని గంటల్లోనే రేషన్​ కార్డుపై పేరు కరెక్షన్​ చేసి అతనికి అందజేశారు. పేరు సరిచేసుకునేందుకు పని మానేసి అధికారుల చుట్టూ తిరిగానని, తన వినూత్న నిరసనతో జిల్లా అధికారి స్పందించి సరి చేశారని శ్రీకాంతి కుమార్​ దత్తా చెప్పాడు.