నెల రోజుల్లో అదానీ ఇన్వెస్టర్లకు రూ.12 లక్షల కోట్ల నష్టం

నెల రోజుల్లో అదానీ ఇన్వెస్టర్లకు రూ.12 లక్షల కోట్ల నష్టం

న్యూఢిల్లీ: గ్లోబల్ రిచ్‌‌‌‌ లిస్టులో 3 వ ప్లేస్‌‌లో గౌతమ్‌‌ అదానీ..మల్టీ బ్యాగర్లుగా మారిన షేర్లు..ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలు....ఈ పరిస్థితులన్నీ  ఒక్క రిపోర్ట్‌‌తో తలకిందులయ్యాయి. యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్‌‌బర్గ్‌‌ చేసిన ఆరోపణలతో గత నెలరోజుల్లోనే అదానీ గ్రూప్ ఇన్వెస్టర్ల సంపద ఏకంగా రూ.12 లక్షల కోట్లు తగ్గింది. చిన్న, పెద్ద..ఇన్వెస్టర్లందరికీ భారీ లాస్‌‌లొచ్చాయి. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు తమ ఆల్‌‌టైమ్ హై నుంచి 84 శాతం మేర క్రాష్ అయ్యాయి. ఈ గ్రూప్ మార్కెట్ క్యాప్‌‌ కిందటేడాది సెప్టెంబర్‌‌‌‌లో రూ.23 లక్షల కోట్లుగా రికార్డవ్వగా,  శుక్రవారం నాటికి ఇది రూ.7.7 లక్షల కోట్లకు పడిపోయింది. గత నెల రోజుల్లోనే ఇన్వెస్టర్లు రూ.12 లక్షల కోట్లు లాస్ అయ్యారు.  హిండెన్‌‌బర్గ్ రిపోర్ట్ వచ్చే ముందు రోజు గ్లోబల్‌‌ రిచ్‌‌లిస్టులో 3 వ ప్లేస్‌‌లో కొనసాగిన గౌతమ్ అదానీ,  ప్రస్తుతం 29 వ స్థానానికి దిగొచ్చారు. ఆయన సంపద 135 బిలియన్ డాలర్ల నుంచి 42 బిలియన్ డాలర్లకు పడిపోయింది. 

ఈ షేర్లు వరెస్ట్‌‌..

అదానీ గ్రూప్ షేర్లలో ఎక్కువగా పతనమైంది అదానీ గ్రీన్ ఎనర్జీనే. తన ఏడాది గరిష్టం నుంచి ఈ కంపెనీ షేరు 84 శాతం పడింది. అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు శుక్రవారం 5 శాతం తగ్గి  రూ.487 వద్ద ఏడాది కనిష్టాన్ని టచ్ చేశాయి. అదేవిధంగా అదానీ ట్రాన్స్‌‌మిషన్‌‌ షేర్లు గత నెల రోజుల్లో 83 శాతం,  అదానీ టోటల్ గ్యాస్ షేర్లు 81 శాతం పతనమయ్యాయి. శుక్రవారం సెషన్‌‌లో కూడా ఈ షేర్లు 5 శాతం లాస్‌‌తో లోవర్ సర్క్యూట్‌‌ను టచ్ చేశాయి. అదానీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్‌‌ షేర్లు తమ ఆల్‌‌టైమ్ హై నుంచి 67 శాతం నష్టపోయాయి.  అదానీ పోర్ట్స్ షేర్లు ఏడాది గరిష్టం నుంచి 43 శాతం తక్కువతో ట్రేడవుతున్నాయి.  ఇన్వెస్టర్లలో నమ్మకం పొందేందుకు అదానీ గ్రూప్ కూడా వివిధ చర్యలు తీసుకుంటోంది. తమ బ్యాలెన్స్‌‌ షీట్‌‌ బలంగా ఉందని, క్యాష్ ఫ్లోస్ బాగున్నాయని చెబుతోంది. అయినప్పటికీ, షేర్ల పతనం ఆగడం లేదు.

ఎల్‌‌ఐసీకి లాస్‌‌..

అదానీ గ్రూప్ షేర్లలో  ఎల్‌‌ఐసీ చేసిన పెట్టుబడులు నెగెటివ్‌‌లోకి జారుకున్నాయి. అదానీ గ్రూప్ షేర్లలో  రూ.30,127 కోట్లను ఇన్వెస్ట్ చేశామని, వీటి విలువ   కిందటేడాది డిసెంబర్ క్వార్టర్ ముగిసే నాటికి రూ.56,142 కోట్లుగా ఉందని ఎల్‌‌ఐసీ గతంలో ప్రకటించింది.  హిండెన్‌‌బర్గ్ దెబ్బకు అదానీ గ్రూప్ షేర్లు భారీగా పడడంతో, ఈ ఇన్వెస్ట్‌‌మెంట్ల విలువ తాజాగా రూ.27  వేల కోట్లకు తగ్గిపోయిందని  ఎనలిస్టులు అంచనావేస్తున్నారు.  ఎల్‌‌ఐసీ ఎటువంటి ప్రాఫిట్స్ బుక్‌‌ చేసుకోలేదనే అంచనాలతో ఈ లెక్కలు వేస్తున్నారు. మొత్తం 10  అదానీ కంపెనీలు మార్కెట్‌‌లో లిస్ట్ అయి ఉన్నాయి.  ఈ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ గత నెల రోజుల్లోనే 146 బిలియన్ డాలర్లు తగ్గింది. ఇది మొత్తం మార్కెట్ క్యాప్‌‌లో 60 శాతానికి సమానం. 

ఫారెక్స్ రిజర్వ్‌‌లు మళ్లీ డౌన్‌‌..

ఈ నెల 17 తో ముగిసిన వారంలో దేశ ఫారెక్స్ నిల్వలు 5.68 బిలియన్ డాలర్లు తగ్గి 561.27 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యాయి.


మార్కెట్‌‌‌‌ కిందకే! 

బెంచ్‌‌మార్క్ ఇండెక్స్‌‌లు శుక్రవారం సెషన్‌‌లోనూ నష్టపోయాయి. సెన్సెక్స్ 142 పాయింట్లు (0.24%) తగ్గి 59,464 వద్ద ముగిసింది. నిఫ్టీ 45 పాయింట్లు నష్టపోయి 17,466 వద్ద క్లోజయ్యింది. గత ఆరు సెషన్లలో  ఇన్వెస్టర్లు  రూ.8.6 లక్షల కోట్లు నష్టపోయారు.  డైలీ చార్ట్‌‌లో పెద్ద రెడ్‌‌ క్యాండిల్‌‌ను  నిఫ్టీ శుక్రవారం  ఏర్పాటు చేసిందని, వీక్లీ చార్ట్‌‌లో నెగెటివ్  ప్యాటర్న్‌‌ను ఏర్పరిచిందని హెచ్‌‌డీఎఫ్‌‌సీ సెక్యూరిటీస్ టెక్నికల్ ఎనలిస్ట్ నాగరాజ్‌‌ శెట్టి పేర్కొన్నారు.  ఈ బెంచ్‌‌మార్క్ ఇండెక్స్ కీలక సపోర్ట్ అయిన 17,450– 17,500 వద్ద ప్రస్తుతం ట్రేడవుతోందని, మార్కెట్ రివర్స్ అయినట్టు సిగ్నల్స్ కనిపించడం లేదని చెప్పారు. షార్ట్ టెర్మ్‌‌లో నిఫ్టీ 17,150 – 17,200 వరకు పడుతుందని, పైన 17,800 కీలక రెసిస్టెన్స్‌‌గా పనిచేస్తుందని అంచనావేశారు.