మోడీ, అమిత్​షాలను గద్దెదించే దాకా పోరాటం కొనసాగిద్దాం: మాజీ ఎంపీ అంజన్ కుమార్

మోడీ, అమిత్​షాలను గద్దెదించే దాకా పోరాటం కొనసాగిద్దాం: మాజీ ఎంపీ అంజన్ కుమార్

హైదరాబాద్​(ముషీరాబాద్) వెలుగు: ఎన్​ఆర్​సీని ఉపసంహరించుకోకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని సికింద్రాబాద్​ మాజీ ఎంపీ అంజన్​కుమార్​ యాదవ్​ హెచ్చరించారు. బీజేపీ దేశంలోని పౌరులను విభజించి ఓట్ల రాజకీయాలు చేయాలని చూస్తోందన్నారు. శనివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద టీపీసీసీ మైనారిటీ కమిటీ ఆధ్వర్యంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి,  మర్రి శశిధర్ రెడ్డి, నిరంజన్ తదితరులు హాజరయ్యారు. అంజన్​కుమార్​ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలందరూ ఆందోళనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మోడీ, అమిత్​షాలను గద్దెదించేదాకా పోరాటం కొనసాగించాలన్నారు దేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో బిల్లును వ్యతిరేకిస్తూ నిరసనలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం వేడుక చూస్తోందన్నారు. ఆలస్యం చేయకుండా బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

అసెంబ్లీలో తీర్మానం చేయాలె : షబ్బీర్​ అలీ

టీఆర్ఎస్​ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి, కేంద్రం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఈనెల 28న గాంధీ భవన్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు భారత్ బచావో పేరిట ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం బిల్లు కేవలం ముస్లిం లకు మాత్రమే వ్యతిరేకం కాదని, హిందువులు కూడా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఈ బిల్లు వల్ల భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు తన పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందన్నారు.