బీసీలకు 60 సీట్లు.. అన్ని పార్టీలూ ఇవ్వాల్సిందే

బీసీలకు 60 సీట్లు.. అన్ని పార్టీలూ ఇవ్వాల్సిందే
  • అన్ని పార్టీలూ ఇవ్వాల్సిందే.. బీసీల రాజకీయ ప్లీనరీలో నేతల అల్టిమేటం
  • లేదంటే ఆగస్టులో 5 లక్షల మందితో చలో అసెంబ్లీ..
  • పరేడ్ గ్రౌండ్స్​లో సింహగర్జన సభ నిర్వహిస్తం
  • రాజకీయ యుద్ధం మొదలు పెడుతున్నం: జాజుల  
  • ఫోన్​లోనే ప్రచారం చేసేలా ప్రత్యేక యాప్: బూర నర్సయ్య గౌడ్​
  • సీఎం పీఠం ఎందుకు ఎక్కలేకపోతున్నం?: చెరుకు సుధాకర్​
  • ప్రతిదాడి చేసే శక్తి ఉంటేనే బీసీలు రాజులయ్యేది: విశారదన్​
  • ప్రైవేటులోనూ రిజర్వేషన్లుండాలె: జస్టిస్ ఈశ్వరయ్య

హైదరాబాద్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 60 చొప్పున సీట్లు ఇచ్చి తీరాల్సిందేనని బీసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ నెలాఖరులోపు అన్ని పార్టీలూ దీనిపై నిర్ణయం ప్రకటించాలని అల్టిమేటం జారీ చేశారు. లేదంటే ఆగస్టు మూడో వారంలో 5 లక్షల మందితో చలో అసెంబ్లీ చేపడతామని, పరేడ్ గ్రౌండ్స్​లో బీసీల సింహగర్జన సభ పెడతామని తేల్చిచెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 60 సీట్లు సాధించాలన్న ‘మిషన్ 60’ టార్గెట్​లో భాగంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్​లో బీసీల రాజకీయ ప్లీనరీ నిర్వహించారు. 

సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఇది రాయితీల పోరాటం కాదని, రాజకీయ పోరాటమని అన్నారు. బీసీల్లో136 కులాలకు గాను అసెంబ్లీలో కేవలం 23 మంది ఎమ్మెల్యేలే ఉన్నారన్నారు. రాష్ట్రంలో బీసీలకు ఎప్పుడూ రాజకీయాల్లో తగిన ప్రాధాన్యం లభించలేదన్నారు. కేబినెట్ లోని17 మంది మంత్రుల్లో 9 మంది బీసీలు ఉండాలని.. కానీ కేవలం ముగ్గురే ఉన్నారన్నారు.  ఇప్పటివరకు ఒక్క బీసీ కూడా సీఎం కాలేదన్నారు. బీసీలకు ప్రాధాన్యంపై అన్ని పార్టీలను కలుస్తామని చెప్పారు. 

ఇటీవల ఓ హోటల్ లో సీక్రెట్ గా మీటింగ్ పెట్టుకున్నామని, దీనికి అన్ని పార్టీల నేతలూ వచ్చారని వెల్లడించారు. బీసీలంతా ఐక్యంగా ఉండి టికెట్లు సాధించాలని తీర్మానం చేశామని తెలిపారు. ఇప్పుడు ఈ ప్లీనరీతో రాజకీయ యుద్ధం, ఓటు యుద్ధం మొదలు పెడుతున్నామని ప్రకటించారు. బీసీలకు రాజ్యాధికారం కోసం బీసీల పార్టీ ఉండాలని, అన్ని పార్టీల్లో ఎక్కువ టికెట్లు దక్కేలా పోరాటం చేయాలని నిర్ణయించామన్నారు. ప్లీనరీలో హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య, కాంగ్రెస్ నేత చెరుకు సుధాకర్, బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మలిదశ ఉద్యమం తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, ఎంఆర్​పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ, దళిత ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహారాజ్, బీసీ కమిషన్ సభ్యుడు ఉపేందర్, వివిధ పార్టీల నేతలు, బీసీ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బీసీ నేతలు, విద్యార్థులు ప్లీనరీకి భారీగా హాజరయ్యారు.  

ఇవి తెగులు రాష్ట్రాలు: బూర నర్సయ్య గౌడ్​ 

దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ బీసీలు సీఎంలుగా ఎన్నికయ్యారని, ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే సాధ్యం కాలేదని బూర నర్సయ్యగౌడ్ అన్నారు. వీటిని తెలుగు రాష్ట్రాలు అనే కన్నా తెగులు రాష్ట్రాలంటే బాగుంటుందన్నారు. బీసీల పిల్లలకు ఫీజు రీయింబర్స్​మెంట్​లో11 శాతమే ఇస్తున్నారన్నారు. మిగతా కులాలకు రూ.10 లక్షల మేర ఆర్థిక సాయం అందించి.. బీసీలకు మాత్రం భిక్షలాగా రూ.లక్ష ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. అది కూడా ఎన్నికలు వస్తున్నందుకే ఇస్తున్నారన్నారు. అయితే, పార్టీలను విమర్శించినంత మాత్రాన లాభం లేదన్నారు. ఓటును అమ్ముకున్నోళ్లు బానిసలవుతారని, ఓటును నమ్ముకున్నోళ్లు బాస్ లు అవుతారన్నారు. బీసీలంతా బంధువులకు ఫోన్ చేసి ఎన్నికలప్పుడు బీసీలకే ఓటేయాలంటూ ప్రచారం చేయాలన్నారు. బయటకెళ్లాల్సిన అవసరం లేకుండా ఫోన్ ద్వారానే ప్రచారం చేసుకోవచ్చన్నారు. త్వరలోనే కోటి ఓట్లు అనే యాప్​ను తయారు చేస్తున్నామని, కోటి ఓట్లను ఆ యాప్​లో నమోదు చేయించాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. ఆ కోటి మందిలో సగం మంది ఓట్లు బీసీలకు వేసినా అన్ని పార్టీలు బీసీలకు గౌరవం ఇస్తాయన్నారు. రాబోయే రోజుల్లో బీసీ సీఎం కచ్చితంగా అవుతారన్నారు.

సీఎం కుర్చీ ఎందుకు దక్కట్లే?: చెరుకు సుధాకర్​ 

రాష్ట్రంలోని119 నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్​డ్ నియోజకవర్గాల్లో మినహా జనరల్ స్థానాల్లో ఒక్కసారి కూడా బీసీలు ఎమ్మెల్యేలుగా లేని నియోజకవర్గాలకు బ్లాక్ మార్క్ చేసుకుని గుర్తుంచుకోవాలని, ఆయా నియోజకవర్గాల్లో బీసీలను గెలిపించుకోవాలని చెరుకు సుధాకర్ పిలుపునిచ్చారు. ఆయా నియోజకవర్గాల్లో బీసీలకు టికెట్ ఇవ్వకపోతే పార్టీలు మిగలవన్న హెచ్చరికలు పంపాలన్నారు. ఇప్పుడు మూడో ప్రమాద హెచ్చరిక వస్తున్నదన్నారు. 30 అడుగులు ఎత్తున్న తాటి చెట్టెక్కగలిగే వ్యక్తి.. రెండున్నర అడుగులుండే సీఎం పీఠం ఎందుకు ఎక్కలేకపోతున్నాడని ప్రశ్నించారు.

మహిళలకూ ప్రాధాన్యం ఇవ్వాలి: మంద కృష్ణ

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కలిసి పోరాడితే రాజ్యాధికారం సాధ్యమవుతుందని మంద కృష్ణ మాదిగ అన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రతి కులమూ తమ అస్తిత్వాన్ని చాటుకునే ప్రయత్నం జరుగుతున్నదన్నారు. రాష్ట్రంలో బీసీల జనాభా 50 శాతానికిపైగా ఉందని, కాబట్టి రాజకీయాలు సహా అన్ని రంగాల్లోనూ దానికి తగ్గట్టు వాటా దక్కాల్సిందేనన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు సీఎంలు అయితే కుటుంబ పాలన ఉండదని, ప్రజల కోసమే ఉంటుందని స్పష్టం చేశారు. చిన్న, పెద్ద కులాలనే తేడాను మరిచిపోవాలని, లేదంటే అణగారిన వర్గాలుగానే ఉండిపోతామన్నారు. 

సామాజిక న్యాయం పాటించాలి: జస్టిస్ ఈశ్వరయ్య

చిన్న చిన్న కులవృత్తుల మీద ఆధారపడడం, చదువు లేకపోవడం, రాజకీయ అవకాశాలు లేకపోవడం వల్ల బీసీలు వెనుకబడిన వర్గాలుగానే ఉండిపోతున్నారని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. అసమానతలను రూపుమాపకపోతే దేశం బాగుపడదని అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు. ప్రతి కులం అస్తిత్వాన్ని కాపాడుతూనే రిజర్వేషన్లను కల్పించారన్నారు. ఎవరు సీఎం అయినా.. పీఎం అయినా.. పాలన చేసిన కుటుంబాలే బాగుపడ్డాయన్నారు. విద్య, వైద్యం వంటి సదుపాయాలు కల్పిస్తే బీసీలు ఎదుగుతారన్నారు. రాజకీయ రిప్రెజెంటేషన్ కూడా ఉండాలన్నారు. కార్పొరేట్స్ రావడం వల్ల అన్ని వృత్తులూ ఆగమైపోతున్నాయన్నారు. ప్రైవేటులోనూ రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అది భిక్ష కాదని, హక్కని స్పష్టం చేశారు. సామాజిక న్యాయం పాటించకపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ అంతమయ్యే స్టేజీకి వచ్చిందని, సమానత్వాన్ని పాటించకుంటే మిగతా పార్టీలకూ అదే గతి పడుతుందని హెచ్చరించారు.

ప్రతిదాడి చేసే శక్తి లేకనే: విశారదన్​ 

బీసీలు ఇంకా బానిస వ్యవస్థలోనే ఉన్నారని, దాడి జరిగితే ప్రతిదాడి చేయకుండా ఉండిపోతున్నామని విశారదన్ మహరాజ్ అన్నారు. బీహార్ లో నితీశ్ కుమార్, యూపీలో ములాయం సింగ్ ప్రతిదాడి చేయబట్టే సీఎంలు అయ్యారన్నారు. తమిళనాడులో అన్నాదురై, కరుణానిధి, స్టాలిన్​లు ఎదురుదాడి చేసి రాజులయ్యారన్నారు. ప్రతిదాడి చేసే శక్తి ఉంది కాబట్టే రాజులయ్యి రాజ్యాలు నిర్మించారన్నారు. కానీ, తెలంగాణలో మాత్రం ఆ ప్రతిదాడి శక్తిలేకనే ఇలా ఉండిపోతున్నామన్నారు. ఆత్మగౌరవానికి ప్రతిరూపం రాజ్యమేనని స్పష్టం చేశారు. దేశ స్వాతంత్ర్యోద్యమం, తెలంగాణ ఉద్యమం, సాయుధ పోరాటంలో పాల్గొన్నది 90 శాతం మంది బీసీలేనన్నారు. అశోక చక్రవర్తి, సమ్మక్క సారక్క, సర్వాయిపాపన్న లాంటి వ్యక్తుల నుంచి స్ఫూర్తి పొంది పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.