సిల్వర్ స్టార్…ఫైనల్లో ఓడిన అమిత్ పంగల్

సిల్వర్ స్టార్…ఫైనల్లో ఓడిన అమిత్ పంగల్

అమిత్‌‌ పంగల్‌‌. ఇండియా బాక్సింగ్‌‌లో ఓ మెరుపు. ఏషియన్‌‌ గేమ్స్‌‌, ఆసియా చాంపియన్‌‌షిప్స్‌‌లో గోల్డ్‌‌ కొట్టి ఔరా అనిపించిన ఈ హర్యానా యంగ్‌‌స్టర్‌‌ నాలుగున్నర దశాబ్దాల చరిత్ర ఉన్న ప్రపంచ పురుషుల బాక్సింగ్‌‌లో ఫైనల్‌‌ చేరి  ఇండియా తరఫున మరెవరికీ సాధ్యం కాని ఘనతను అందుకున్నాడు. అయితే, ఇంకొక్క పంచ్‌‌ విసిరితే బాక్సింగ్‌‌ ప్రపంచాన్ని జయించిన తొలి ఇండియన్‌‌గా తన ఖ్యాతిని మరింత పెంచుకునే సందర్భంలో అతను తడబడ్డాడు. తుదిపోరులో ఒలింపిక్‌‌ చాంపియన్‌‌ చేతిలో ఓడి సిల్వర్‌‌కే పరిమితమయ్యాడు. అయినా ఈ మెగా టోర్నీలో రజతం గెలిచిన ఇండియా తొలి బాక్సర్‌‌గా నిలిచాడు.

ఎకతరీన్‌‌బర్గ్‌‌ (రష్యా): వరల్డ్‌‌ బాక్సింగ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా స్టార్‌‌ అమిత్‌‌ పంగల్‌‌ ప్రయాణం పసిడి వరకు చేరలేదు. అంచనాలను తలకిందలు చేస్తూ.. తన పంచ్‌‌ పవర్‌‌తో ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తూ.. ఫైనల్‌‌కు దూసుకొచ్చిన అమిత్‌‌  గోల్డెన్‌‌ పంచ్‌‌ విసరలేకపోయాడు. శనివారం జరిగిన 52కేజీల ఫైనల్‌‌ బౌట్‌‌లో రెండో సీడ్‌‌ అమిత్‌‌ 0–5తో ఉజ్బెకిస్థాన్‌‌కు చెందిన అన్‌‌సీడెడ్‌‌ షఖొబిదిన్‌‌ జోరోవ్‌‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఐదుగురు జడ్జీలు జోరోవ్‌‌నే విజేతగా తేల్చినా.. ఈ పోరులో పంగల్‌‌ అతనికి అంత తేలిగ్గా తలొగ్గలేదు. మరోసారి తనకంటే ఎక్కువ హైట్‌‌, బలంగా ఉన్న ప్రత్యర్థిని ఎదుర్కొన్న అమిత్‌‌ చివరి వరకూ గట్టి పోటీ ఇచ్చాడు. అతను చాలా పంచ్‌‌లు కొట్టినప్పటికీ అవి సరిగ్గా కనెక్ట్‌‌ కాలేకపోయాయి.

పూర్తి కౌంటర్‌‌-అటాకింగ్‌‌తో సాగిన ఫైనల్‌‌ బౌట్‌‌లో ఫస్ట్‌‌ రౌండ్‌‌లో అమిత్‌‌, షఖొబిదిన్‌‌ ఇద్దరూ పరిస్థితులను అంచనా వేసుకున్నారు. రెండో రౌండ్‌‌ నుంచే అసలు ఆట మొదలైంది. ప్రత్యర్థి లోగార్డ్‌‌ను సద్వినియోగం చేసుకొని ఎదురుదాడి చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ, రింగ్‌‌లో వేగంగా కదిలిన జోరోవ్‌‌.. ఇండియా బాక్సర్‌‌ దాడి నుంచి తప్పించుకున్నాడు. ఇక, చివరి రౌండ్‌‌లో ఇద్దరూ పూర్తిగా అటాకింగ్‌‌కే మొగ్గు చూపారు. పంగల్​   ప్రత్యర్థి బాడీపై పంచ్‌‌లు ఇచ్చాడు. ఇదే టైమ్‌‌లో కాస్త తెలివిగా వ్యవహరించిన జోరోవ్‌‌ ఎక్కువ స్కోరింగ్‌‌ పంచ్‌‌లు కొట్టి గోల్డ్‌‌ మెడల్‌‌ కైవసం చేసుకున్నాడు. అమిత్‌‌ సిల్వర్‌‌తోనే సంతృప్తి చెందినా ఈ మెగా టోర్నీలో ఇండియాకు ఇదే అతి పెద్ద మెడల్‌‌ కావడం విశేషం. అతనితోపాటు మనీశ్‌‌ కౌశిక్‌‌ (63 కేజీ) కాంస్యం నెగ్గడంతో ఒక వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియా తొలిసారి రెండు మెడల్స్‌‌ గెలిచింది. ఇంతకుముందు విజేందర్‌‌ సింగ్‌‌ (2009), వికాస్‌‌ క్రిషన్‌‌ (2011), శివ థాపా (2015), గౌరవ్‌‌ బిధూరి (2017) కాంస్య పతకాలు సాధించారు.