అసెంబ్లీలో ఐదో రోజు అసలు చర్చ!

అసెంబ్లీలో ఐదో రోజు అసలు చర్చ!


హైదరాబాద్‌‌, వెలుగు: అసెంబ్లీ బడ్జెట్‌‌ సమావేశాల్లో మొదటిసారి ఆసక్తికరమైన చర్చ జరిగింది. సస్పెన్షన్లు, వాకౌట్ల తర్వాత ఐదో రోజున ప్రతిపక్షాలకు మైక్ అందింది. శనివారం ఉదయం స్పీకర్‌‌ చైర్‌‌లో ఉన్న డిప్యూటీ స్పీకర్‌‌ పద్మారావుగౌడ్‌‌.. కాంగ్రెస్‌‌ సభ్యులకు ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీంతో సభలో పలు అంశాలపై అర్థవంతమైన చర్చ సాగింది. పలు అంశాలను సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. వాటికి మంత్రులు సమాధానాలు చెప్పారు. 

తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్‌‌, హరీశ్‌‌రావు.. సభలో ఎలా వ్యవహరించేవారో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వివరించిన తీరుతో సభలో ఉన్నవారంతా పడీపడీ నవ్వారు. టీఆర్‌‌ఎస్‌‌ సభ్యులు, మంత్రులు సెల్ఫ్‌‌ డబ్బా కొడుతుంటే తాము సభలో ఉండి ఏం చేయాలని ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించడం నవ్వులు పూయించింది.  ‘‘సభలో మాట్లాడే చాన్స్‌‌ ఎట్లాగూ ఇవ్వరు.. కనీసం ప్రశ్నలు కూడా అడగనివ్వరా’’ అని డిప్యూటీ స్పీకర్‌‌తో అధికార టీఆర్‌‌ఎస్‌‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌‌ వాగ్వాదానికి దిగారు. ప్రశ్న అడిగివాళ్లే ఆన్సర్‌‌ కూడా చెప్తే ఇక తానేం చెప్పాలని మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు.

ప్రశాంత్‌‌రెడ్డికి సీతక్క కౌంటర్

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, సభలో కాంగ్రెస్‌‌ సభ్యులు అరగంట, ముప్పావు గంట పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారని, తీరా మంత్రులు సమాధానాలు చెప్పే సమయానికి ఒక్క సభ్యుడు కూడా సభలో ఉండటం లేదని విమర్శించారు. అదే సమయానికి సభలోకి ములుగు ఎమ్మెల్యే సీతక్క వచ్చారు. ‘‘ఇప్పుడే సీతక్క సభలోకి వస్తున్నారు’’ అని మంత్రి అనగానే.. సీతక్క జోక్యం చేసుకున్నారు. ‘‘సభలో చర్చ చర్చలా జరగడం లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు సెల్ఫ్‌‌ డబ్బా కొట్టుకుంటుంటే మేం సభలో ఉండి ఏం చేయాలి?’’ అనడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి.

ఉర్దూలో మంత్రి జవాబు.. తప్పులు సరిదిద్దిన ఎంఐఎం సభ్యులు

నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమంపై సభలో ప్రశ్న అడిగిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌.. ప్రభుత్వం వారి కోసం ఏమేం చేస్తుందో కూడా చెప్పారు. సమాధానం చెప్పడానికి లేచి నిల్చున్న మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రశ్న అడిగిన ఎమ్మెల్యేనే ఆన్సర్‌‌ మొత్తం చెప్తే ఇక తానేం చెప్పాలని ప్రశ్నించారు. తర్వాత చందర్‌‌ చెప్పిన వివరాలతో కూడిన ఆన్సరే మంత్రి చదివి వినిపించారు. గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌ పరిధిలో సిటీ బస్సులపై ఎంఐఎం ఎమ్మెల్యేల ప్రశ్నలకు మంత్రి పువ్వాడ అజయ్‌‌ ఉర్దూలో సమాధానం ఇవ్వడానికి ప్రయత్నించారు. తప్పులుంటే క్షమించాలని ముందుగానే చెప్పారు. మంత్రి ఉర్దూ ఆన్సర్‌‌లోని పొరపాట్లను ఎంఐఎం సభ్యులు కరెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇది సభలో నవ్వులు పూయించింది. ఖమ్మంకు మెడికల్‌‌ కాలేజీ, మధిరకు నర్సింగ్‌‌ కాలేజీ, 104 వాహనాల పునరుద్ధరణ, హెల్త్‌‌కు సంబంధించిన ఇతర అంశాలపైనా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంత్రి హరీశ్‌‌రావు మధ్య కాసేపు వాదోపవాదం.. ఇంకాసేపు ఆసక్తికరమైన చర్చ కొనసాగింది. తాము ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్‌‌ సెంటర్లు సమర్థంగా పనిచేస్తున్నాయని, టెస్టులకు శాంపిల్స్‌‌ ఇస్తే సెల్‌‌ఫోన్‌‌కే రిపోర్టులు వస్తున్నాయని మంత్రి తెలిపారు. అట్లాంటప్పుడు 104 వాహనాలతో ఇంకేం పని అని అన్నారు.

డిప్యూటీ స్పీకర్‌‌ వర్సెస్‌‌ రసమయి

తాను మాట్లాడుతుండగా మైక్‌‌ కట్‌‌ చేసిన డిప్యూటీ స్పీకర్‌‌ పద్మారావుగౌడ్‌‌పై మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌‌ అసహనం వ్యక్తం చేశారు. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, కనీసం ప్రశ్న అడిగే చాన్స్‌‌ కూడా ఇవ్వరా, కనీసం అడుక్కోనివ్వరా అని మండిపడ్డారు. అసలు విషయానికి వచ్చేటప్పుడే మైక్ కట్ చేస్తున్నారని, మాట్లాడే అవకాశం ఇవ్వలేనప్పుడు, ప్రశ్న అడిగే అవకాశం ఇవ్వొద్దంటూ సీరియస్ అయ్యారు. మంత్రి ప్రశాంత్‌‌రెడ్డి కలుగజేసుకుని.. నేరుగా ప్రశ్నించాలని సూచించారు. దీంతో రసమయి అసహనానికి గురయ్యారు. ప్రశ్న పూర్తి చేయకుండానే తన సీటులో కూర్చున్నారు. నియోజకవర్గ ప్రజలు తనను ప్రశ్నిస్తారని, ఏం తీసుకోవచ్చావని అడుగుతారన్నారు. గంటన్నరలో పది మంది మాట్లాడాలని, నేరుగా ప్రశ్న అడగకుండా ఏదేదో చెప్తే అందరికీ ఎట్లా అవకాశం వస్తుందని డిప్యూటీ స్పీకర్‌‌ అన్నారు. తమ నియోజకవర్గానికి కోల్డ్​ స్టోరేజీ ఇవ్వాలని, ఫిష్ ప్లాంట్‌‌ ఏర్పాటు చేయాలని, మత్య్సకారులకు వాహనాలు 
ఇవ్వాలని రసమయి అడిగారు.

కార్యకర్తలకే ఇచ్చెటోళ్లు: గంగుల

బడ్జెట్‌‌లో మన ఊరు – మన బడి స్కీం ప్రకటించి నిధులు కేటాయించలేదని, అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (ఏసీడీపీ) నిధులను బడుల కోసం ఇవ్వాలని అంటున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఏసీడీపీ నిధులు రూ.5 కోట్లు ఇస్తున్నామని చెప్తున్నా, ఇన్‌‌చార్జ్ మంత్రి చెప్పకుంటే వాటి బిల్లులు కూడా ఇవ్వడం లేదని కాంగ్రెస్‌‌ ఎమ్మెల్యే శ్రీధర్‌‌ బాబు అన్నారు. మంత్రి గంగుల జోక్యం చేసుకొని.. అసలు ఇన్‌‌చార్జ్‌‌ మంత్రి విధానం తెచ్చిందెవరని ప్రశ్నించారు. తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కరీంనగర్‌‌ జిల్లా మంత్రిగా ఉన్న శ్రీధర్‌‌బాబు.. ఏసీడీపీ నిధుల్లో సగం వాళ్ల పార్టీ కార్యకర్తలకే ఇచ్చేవారన్నారు.  అప్పుడు సీడీపీ నిధులు రూ1.50 కోట్లు ఉంటే అందులో రూ.75 లక్షలు వాళ్ల క్యాడర్‌‌కే పంచేవారని తెలిపారు. శ్రీధర్‌‌బాబు స్పందిస్తూ.. అప్పట్లో గంగుల ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆ విధానం తీసుకువచ్చారని, తాము తెచ్చింది కాదన్నారు. మంత్రి తలసాని జోక్యం చేసుకొని.. దేశంలోనే ఎమ్మెల్యేలకు రూ.5 కోట్ల నిధులు ఇస్తున్నది ఒక్క తెలంగాణలోనే అని చెప్పారు. కాంగ్రెస్‌‌కు ఉన్న ఎమ్మెల్యేందరూ సభలో కలిసి ఉన్న సందర్భమే లేదన్నారు. ఇద్దరు లోపల ఉంటే ఇద్దరు బయటికి పోతారని అన్నారు.

తొలి నాలుగు రోజులూ ఇట్ల

సభలో బడ్జెట్‌‌ ప్రవేశపెట్టిన రోజే వెల్‌‌లోకి వెళ్లారని బీజేపీ ఎమ్మెల్యేలను మొత్తం సెషన్‌‌ నుంచి సస్పెండ్‌‌ చేశారు. గవర్నర్‌‌ ప్రసంగం లేకుండా బడ్జెట్‌‌ ప్రవేశపెట్టి రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌‌ సభ్యులు సభ నుంచి వాకౌట్‌‌ చేశారు. రెండో రోజు సీఎం కేసీఆర్ కొలువుల ప్రకటనతో సభలో అధికార పార్టీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. మూడు, నాలుగో రోజు బడ్జెట్‌‌ పద్దులపై చర్చలోనూ టీఆర్‌‌ఎస్‌‌ డామినేషన్‌‌ కొట్టొచ్చినట్టు కనిపించింది. పద్దులపై చర్చలో ప్రతిపక్ష సభ్యులకు చాన్స్‌‌ ఇచ్చినా మధ్యలో మంత్రులు పదే పదే జోక్యం చేసుకున్నారు. నాలుగు రోజుల తర్వాత ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం వచ్చింది.

ఆ బెంచీ నుంచి ఈ బెంచీ మీదికి వచ్చి..: భట్టి

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌‌ హయాంలో బడ్జెట్‌‌ పద్దులపై ఎన్నడూ అర్థవంతమైన చర్చ జరిగిందే లేదని, పద్దులన్నీ గిలెటిన్‌‌ చేసుకునే వారని మంత్రి ప్రశాంత్‌‌ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వమే పద్దులపై విస్తృతంగా చర్చ జరుపుతూ ప్రతిపక్షాన్ని భాగస్వామ్యం చేస్తోందని పేర్కొన్నారు. దీనికి భట్టి విక్రమార్క బదులిస్తూ.. ఇప్పుడు మున్సిపల్‌‌ మంత్రిగా ఉన్న కేటీఆర్‌‌, ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్‌‌రావు సభ ప్రారంభం కాగానే ఆ బెంచీ నుంచి ఈ బెంచీ మీదికి వచ్చి మైకులు విరిచే వాళ్లని గుర్తు చేశారు. దీంతో సభలో ఉన్న మంత్రి కేటీఆర్‌‌తో పాటు సభ్యులు పడీపడీ నవ్వారు. వాళ్లు అంతగా అడ్డుతగులుతుంటే పద్దులపై ఎలా చర్చ జరుగుతుందని ప్రశ్నించారు. అందుకే పద్దులన్నీ గిలెటిన్‌‌ అయ్యేవని పేర్కొన్నారు. సభా కార్యక్రమాలకు ఎంత అడ్డుతగిలినా ఒక్కరోజు కూడా వారిని సస్పెండ్‌‌ చేయలేదన్నారు.