మిలటరీ డైట్ మనకి మంచిదేనా?

మిలటరీ డైట్  మనకి మంచిదేనా?

ఒబెసిటీ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. మారిన ఫుడ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్, డిప్రెషన్…  కారణం ఏదైతేనేం ఎన్నో రకాల జబ్బులకు ప్రధాన కారణం మాత్రం ఒబెసిటీ. ఈ ఒక్క పేరు మీద మార్కెట్‌‌లో ఇప్పుడు వందల కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఒబెసిటీ కంట్రోల్ అనగానే మనవాళ్ళు చెప్పే మొదటి మాట అన్నం తగ్గించి చపాతీ తినండి అని. లేదంటే ఒక పూట తిండి మానేయండని.
కానీ ఈ రెండూ సరైన పద్ధతులు కాదు. నిజానికి ఒబెసిటీ కంటే డైటింగే ప్రాణాంతకం అంటున్నారు డాక్టర్లు.ో

రోజూ తీసుకునే ఫుడ్ క్వాంటిటీని ఒక్కసారిగా తగ్గిస్తే  మెటబాలిజం రేట్‌‌లో తేడా వస్తుంది. దీంతో శరీరంలోని అత్యంత కీలకమైన గట్‌‌ బ్యాక్టీరియా పనితీరు దెబ్బతింటుంది. డైటింగ్‌‌ చేసేవారి పొత్తికడుపు భాగంలో నిల్వ అయ్యే కొవ్వు లిమిట్ దాటుతుంది. ఇది గుండెజబ్బు, షుగర్‌‌‌‌కి దారితీస్తుంది. ప్లానింగ్ లేని  డైటింగ్‌‌ వల్ల  మెదడులోని నాడీకణాల్లో సెరటోనిన్‌‌ అనే రసాయనం ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితంగా భావోద్వేగాలు, ఆకలి, నిద్ర వంటి వాటిపై వారు అదుపు కోల్పోయే అవకాశాలు ఉంటాయని న్యూట్రిషనిస్టులు హెచ్చరిస్తున్నారు..

డైటింగ్, ఎక్సర్‌‌సైజ్

చాలా మంది త్వరగా బరువు తగ్గాలనే  ఆలోచనతో. డైటింగ్, ఎక్సర్‌‌సైజ్ రెండూ ఒకేసారి చేస్తుంటారు. ఇది ఎముకలకు ప్రమాదకరం. ఎందుకంటే… డైటింగ్ వల్ల శరీరానికి ఇవ్వాల్సిన ఆహారం తగ్గిపోతుంది. అదే సమయంలో ఎక్సర్‌‌సైజ్ చేస్తే శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. ఫలితంగా  కండరాలతోపాటు ఎముకలకు కూడా కావాల్సినంత ప్రొటీన్స్ అందవు.పెద్ద మొత్తంలో పోషకాలు తగ్గిపోతే ఎముకల్లో పటుత్వం తగ్గిపోతుంది.  ఒకే సమయంలో డైటింగ్, ఎక్సర్‌‌సైజ్ చేస్తున్న వారి ఆరోగ్య పరిస్థితిపై ‘నార్త్ కరొలినా స్కూల్ ఆఫ్ మెడిసిన్ యూనివర్శిటీ’ రీసెర్చర్స్ ఓ అధ్యయనం చేశారు. డైటింగ్, ఎక్సర్‌‌సైజ్ రెండూ ఒకేసారి చేసేవారిలో ఎముకల మధ్యలో ఉండే బోన్ మ్యారో ఫ్యాట్ పెరిగిపోతోంది. సరైన పోషకాలు అందకపోవడంతో ఎముకలు ఫ్యాట్‌‌తో నిండిపోతున్నాయి. ఇది ఎముకల పటిష్టతను దెబ్బతీస్తుంది.  ఎత్తు, బరువు కొలతలను బట్టి  ఆ వ్యక్తి ఎంత ఆరోగ్యంగా లేదా అనారోగ్యంగా ఉన్నాడో తెలుసుకోవచ్చు. ఎవరికైనా ఇరవై ఏళ్లు దాటాక ఎత్తు మారదు. మారేదల్లా బరువు ఒక్కటే. అందుకే దానిపై కంట్రోల్ ఉంటే ఆటోమేటిక్‌‌గా హెల్దీగా ఉన్నట్టే. బరువు.. పెరగటం సులువే.  క్యాలరీలు ఎక్కువగా ఉన్న కార్బోహైడ్రేట్ ఆహారం తింటే సరిపోతుంది. కానీ బరువు  తగ్గడానికే నానా తంటాలు పడాల్సి వస్తుంది. ఉన్నట్టుండి  కార్బోహైడ్రేట్లను తీసుకోవటం మానేయలేం. అలా చేస్తే రక్తపోటు తగ్గిపోవటమే కాదు, చాలా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందుకే బరువు తగ్గాలంటే   సరైన ఆహార నియమాలు పాటించడం ఒక్కటే మార్గం. మరి ఇన్ని సమస్యల మధ్య ఒబెసిటీని తగ్గించుకోవటం ఎలా? అన్న ఆలోచనలే అందరిలోనూ…

మిలిటరీ డైట్

ఈ మధ్య కాలంలో వచ్చిన కొవ్వు పదార్థాల డైట్, చిరుధాన్యాల డైట్, పచ్చి కూరగాయల డైట్ తర్వాత ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న మాట మిలిటరీ డైట్. ఈ డైట్ తో ఒక్క వారంలోనే మూడు నుంచి నాలుగు కిలోల బరువు తగ్గొచ్చు అంటూ ప్రచారం జరుగుతోంది. కానీ డాక్టర్ల సలహా లేకుండా ఈ డైట్ ఫాలో అవటం మంచిది కాదనే అంటున్నారు మన డాక్టర్లు. అమెరికన్ సైనికులు బరువుని మెయింటెయిన్ చెయ్యటానికి వాడే డైట్ ప్లాన్ ని మిలిటరీ డైట్ అంటున్నారు. 3 రోజుల మిలిటరీ డైట్ ప్లాన్ చాలా తక్కువ కేలరీలతో పనిచేస్తుంది. తరువాత నాలుగు రోజులు ఈ కేలరీలని ఎలా తగ్గకుండా చూసుకోవాలో చెప్తుంది. డైట్ ప్లాన్ దాదాపు 100 కిలోల కేలరీలు అందిస్తుంది. మిగిలిన నాలుగు రోజులు తాజా పండ్లు, కూరగాయలు, మనకు సరిపోయేటన్ని ప్రొటీన్లతో తయారు చేసిన ఆరోగ్యకరమైన భోజనం తినడం వల్ల 1200 కిలో కేలరీల నుంచి – 1500 కిలో కేలరీలు మాత్రమే మన శరీరానికి అందుతాయి. ఈ డైట్ వల్ల ఆరోగ్యం మీద ప్రభావం పడకుండా బరువు తగ్గొచ్చు. మామూలు భాషలో చెప్పాలంటే తక్కువ కేలరీల భోజనం ప్లాన్. ఈ డైట్ లో తాజా కూరగాయలు, పండ్లు ఉంటాయి. ఈ డైట్ పిండి పదార్థాలను తగ్గించి  ఫైబర్ ఎక్కువతీసుకోమని చెబుతుంది. డాక్టర్లూ, న్యూట్రిషనిస్టుల సలహా ప్రకారం బ్యాలెన్స్‌‌డ్ డైట్, ఎక్సర్ సైజ్ ఉండే ఈ ప్లాన్ వల్ల ఆరోగ్యం మీద ప్రభావం పడకుండా బరువు తగ్గుతాం. రోజుకు 500 కిలో కేలరీలు తగ్గించడం వల్ల వారానికి  అరకిలో నుండి ఒక కిలో బరువు తగ్గవచ్చు. ఇది ఆరోగ్యకరమైన పద్ధతి అనే చెబుతున్నా అన్ని ప్రాంతాల ప్రజలకు ఇది సరిపడదనీ. ప్రపంచమంతా ఒకే రకమైన అలవాట్లు లేకపోవటం, వాతావరణ పరిస్థితులని బట్టి కూడా ఈ డైట్ డాక్టర్ల సలహా లేకుండా పాటించవద్దని మన న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.

డాక్టర్ లేని డైట్ వద్దు

అట్కిన్స్‌‌ అనే డైట్‌‌  కొలెస్ట్రాల్‌‌ సమస్య ఉన్నవారికి పనికిరాదు. ఈ విధానంలో కార్బోహైడ్రేట్లు తక్కువగానూ, ప్రొటీన్లు, ఫ్యాట్‌‌ ఎక్కువగానూ ఉన్న ఫుడ్‌‌ని తినమని చెబుతారు. కానీ ఇది కొలెస్ట్రాల్‌‌ ఉన్నవారికి మంచిది కాదు. ఈ విధానం అమెరికాలో చాలా పాపులర్. వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్‌‌కి ఈ డైట్ సరిపోతుంది.  కానీ ఇండియన్స్ మక్కీ కి మక్కీ ఈ డైట్ ని ఫాలో అయితే మాత్రం కిడ్నీ సమస్యలు రావచ్చు. ఎందుకంటే మన ఆహారపు అలవాట్లూ, మన దగ్గర ఉండే వాతావరణం, మనం చేసే శారీరక కష్టం అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తూ మన డైట్ ప్లాన్ ఉండాలి.
మనదేశంలో అన్నం, రోటీలు ఎక్కువ మంది తింటారు. ఈ రెండింటిలో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి. అందుకే చాలామంది ఎంత ట్రై  చేసినా బరువు తగ్గలేరు. ఈ డైట్  స్పెషలిస్టుల ఆధ్వర్యంలోనే పాటించాలి. ఎలాంటి మార్పులొచ్చినా వాళ్లు చూస్తారు. కాబట్టి సేఫ్టీ విషయంలో ఎలాంటి భయం అవసరం లేదని డైటీషియన్లు చెప్తున్నారు. మిలటరీ డైట్ చేయడానికి ముందు ప్రతీ ఒక్కరూ మీ డైటీషియన్‌‌ను కలిసి సలహాలు, సూచనలు తీసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే అందరికీ అన్ని విధాలైన డైట్స్ సరిపడవు. కాబట్టి.. కచ్చితంగా మీ ఫ్యామిలీ డాక్టర్ సలహాలు, సూచనలు తీసుకోవడం మరిచిపోవద్దు.