ఆఫ్ఘనిస్తాన్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 20 మంది మృతి

ఆఫ్ఘనిస్తాన్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. 20 మంది మృతి

ఆప్ఘనిస్తాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆదివారం దేశ రాజధాని కాబూల్ లో జరిగిన ఆత్మహుతి దాడిలో దాదాపు 20 మంది మృతి చెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన ఆప్ఘనిస్తాన్ ఉపాధ్యక్ష రేసులో ఉన్న అర్హులా సాలే కార్యాలయం సమీపంలో జరిగినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో రద్దీగా ఉండే సమయంలో దాడి జరగడం వల్ల మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు పేర్కొన్నారు.

ఈ దాడిలో సాలే కూడా స్వల్పంగా గాయపడినట్టు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన భద్రత బలగాలు సాలే కార్యాలయంలో చోరబడిన ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఆరు గంటలకుపైగా శ్రమించి 150 మందిని భద్రత బలగాలు రక్షించాయి. కాగా, సెప్టెంబర్ 28 న జరిగే ఎన్నికల కోసం ఆప్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ, సాలే వర్గం ప్రచారం ప్రారంభించిన కొద్ది గంటల్లోనే  ఈ దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటివరకు ఈ దాడికి  ఏ ఉగ్ర సంస్థ కూడా బాధ్యత వహించలేదు. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా ఐసిస్, తాలిబన్ ఉగ్రసంస్థల కార్యకలాపాలు పెరిగాయి. ఎన్నికల వేళ ఇలాంటి పరిణామాలు చోటుచేసుకోవడం ఆందోళనకు గురిచేసేలా ఉంది.