ఆహారం దొరక్క ఎలుకలు తింటున్న వరద బాధితులు

ఆహారం దొరక్క ఎలుకలు తింటున్న వరద బాధితులు

బిహార్ లో వరదలు పల్లెవాసుల పొట్టగొట్టాయి. కతిహార్ జిల్లా డంగిటొలా గ్రామం ఇటీవల వర్షాలు, వరదలకు నీట మునిగింది. ఈ ప్రాంతంలోని ఇళ్లను కూడా వరదలు ధ్వంసం చేశాయి. ఆహారం, గొడ్డూ, జంతువులు అన్నీ వరదలో కొట్టుకుపోయాయి. తమకు తినేందుకు ఆహారం కూడా దొరకడం లేదని అంటున్నారు స్థానికులు.

“మాకున్నవన్నీ వరదల్లో కొట్టుకుపోయాయి. చెట్ల కిందే ఉంటున్నాం. నీళ్లు పోయినప్పుడే.. ఇక్కడ మళ్లీ మాకు చిన్న చిన్న గుడిసెలు వేసుకునే అవకాశం ఉంటుంది. ఆహారం అందివ్వడానికి ఎవరూ రావడం లేదు. కానీ… వరదల ప్రాంతాల్లో ఎలుకలు బాగా తిరుగుతున్నాయి. మాకు తినడానికి ఇవే మిగిలాయి. చిట్టెలుకలు, ఎలుకలను తినడం తప్ప మాకు దారిలేదు. ఈ వరద గండాన్ని దాటి.. ఆకలి తీరాలంటే.. మా ఇంట్లో వాళ్లకు ఇంతకంటే శరణ్యం ఏమీ లేదు.” అని ఆ గిరిజన స్థానికులు చెప్పారు.

ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి మీడియా తీసుకెళ్లినప్పుడు.. తమకు అటువంటి సమాచారం ఇంతవరకు రాలేదన్నారు. అవసరమైన వరద సహాయం వెంటనే పంపిస్తున్నామని చెప్పారు. ఎలుకలు తింటున్నామని వారు చెబుతున్నారంటే.. అది వారికి ఇదివరకే అలవాటై ఉంటుందని చెప్పారాయన.