కొడితే పెళ్లి డప్పు లేదంటే చావు డప్పు

కొడితే పెళ్లి డప్పు లేదంటే చావు డప్పు
  • కేసీఆర్ వ్యాక్సిన్‌ను నమ్ముకోలేదు.. కేవలం రాత్రి వ్యాక్సిన్ నే నమ్ముకున్నారు
  • రాష్ట్రంలో పరిపాలనపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విసుర్లు

ఖమ్మం: కరోనా మహమ్మారి కట్టడి విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క సారి కూడా సమీక్ష చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లాలో పర్యటించిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలన అధ్వాన్నంగా ఉందని విరుచుకుపడ్డారు. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా గురించి అస్సలు సమీక్ష జరపకుండా నిర్లక్ష్యం చేస్తుంటే మరో వైపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కొడితే చావు డప్పు లేకుంటే పెళ్లి డప్పు కొడుతున్నాడని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా వ్యాక్సిన్ ని నమ్ముకోలేదు.. కేవలం రాత్రి వ్యాక్సిన్ ని మాత్రమే నమ్ముకున్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ ఫ్రీ వ్యాక్సిన్ ని ముందే ప్రకటిస్తే తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ సమస్యను సింపుల్ గా తీసుకుంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. 
యాస, భాష మార్చి కేంద్ర పథకాలను కాపీ కొట్టింది
తెలంగాణలో అధికారంలో లేకపోయినా బిజేపి కోట్ల రూపాయల నిధులు ఇచ్చిందని.. తెలంగాణ ప్రభుత్వం యాస, భాష మార్చి కేంద్ర పథకాలను కాపీ కొడుతోందని బండి సంజయ్ ఆరోపించారు. ఉద్యమాల పురిటి గడ్డ అయిన ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లో బీజేపి ఒక్క స్థానం గెలవలేకపోయిందని.. అయితే టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పని చేస్తూ .. అడుగడుగున ప్రశ్నిస్తున్న బీజేపి ఇప్పుడు ఖమ్మం కార్పోరేషన్ లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోబోతోందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేళ్లు కావొస్తున్నా ఖమ్మం కార్పోరేషన్ లో కనీసం అభివృధ్ది చేయలేదని విమర్శించారు. ఖమ్మం కార్పోరేషన్ కు కేంద్రం నుంచి డబ్బులు రాలేదని అంటున్నారు, మరి కేంద్రం డబ్బులు కేసిఆర్ కుటుంబం జేబులోకి వెళ్లాయా..? అని ప్రశ్నించారు.  ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద 3,509 ఇండ్ల కు రూ.189 కోట్ల నిధులు ఇస్తే డబుల్ బెడ్ రూంలుగా మార్చి మాయ చేశారని ఆయన ఆరోపించారు. అలాగే 12,121 వీధి వ్యాపారస్థులకు రూ.12 కోట్లు ఇచ్చింది కేంద్రమేనని, అమృత్ పథకం కింద రూ.104 కోట్లు ఖమ్మం కార్పోరేషన్ కు కేంద్రం ఇచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను తెలంగాణ ప్రభుత్వం పేర్లు మారుస్తు ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని, మిషన్ భగీరథ కు కేంద్రం నిధులే వినియోగించారని, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో వెలిగే బల్బులు కేంద్రానివేనని, ఖమ్మం ఆర్వోబి బ్రిడ్జి కోసం రూ.77 కోట్లు కేంద్రమే అందించిందని బండి సంజయ్ వివరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఇంత వరకు రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. కరోనా విపత్తు నెలకొన్న నేపధ్యంలో కేంద్రం ఒక్కొక్కరికి 5 కేజిల బియ్యం ఇస్తోందన్నారు. మహిళల రుణాలు తెలంగాణ ప్రభుత్వం చెల్లించడం లేదని, అందుకే రుణాలు రావడం లేదన్నారు. నిధులిచ్చే పార్టీకి ఓటెయ్యాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. దొంగలు, కబ్జా దారులు ఖమ్మంలో రాజ్యమేలుతున్నారని, ఖమ్మంలో సమస్యలు గుర్తించే స్థాయిలో స్థానిక టిఆర్ఎస్ కార్పోరేటర్లు లేరన్నారు. మంత్రి కేటిఆర్, సీం కేసిఆర్ లు ఇద్దరూ  ఝూటా బాప్ , ఝూటా బేటా .. అని బండి సంజయ్ విమర్శించారు. 
కేసీఆర్ జైలుకెళితే దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకోవాలి
కేసిఆర్ కుటుంబం జైలుకు పోవడం ఖాయమని.. తెలంగాణ ప్రజలు కేసిఆర్ జైలుకు వెళితే దీపాలు ముట్టించి సంబరాలు చేసుకోవాలని బండి సంజయ్ సూచించారు. అభివృద్ధి చెందింది ఖమ్మం స్థానిక నేతలు మాత్రమేనని, కమ్యునిస్టు పార్టీ కి సిగ్గులేదు కాబట్టి టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాయని ఆయన విమర్శించారు. బీజేపీ కేసులకు భయపడేది లేదన్నారు. మంత్రి శ్రీమతిని ఏకగ్రీవం చేయాలని చూశారని, అయితే బీజేపీ అభ్యర్థిని బరిలో నిలిపి బ్రేక్ వేసిందన్నారు. బెదిరింపులకు భయపడేవారు బీజేపీలో ఉండరని బండి సంజయ్ స్పష్టం చేశారు. మెడికల్ కాలేజి స్థలం కోసం ప్రత్యేక జీఓ తెచ్చి .. ఆ జీవో ద్వారా 2 ఎకరాలు రెగ్యులైజర్ చేయించుకున్నాడని, సొంత ఎజెండా కోసం రౌడీయిజం చేసిన వారు కాలగర్భం లో కలిసిపోయారని బండి సంజయ్ గుర్తు చేశారు. అండర్ బ్రిడ్జ కోసం స్థానిక నేతలు చేసిందేమి లేదన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రజల కోసమే ఉందని ఆయన స్పష్టం చేశారు.