డ్యామేజ్ రోడ్లను పట్టించుకోని బల్దియా

డ్యామేజ్ రోడ్లను పట్టించుకోని బల్దియా
  • సిటీలో గుంతలు పడిన రోడ్లతో ప్రమాదాలు
  • బాచుపల్లి, బోయిన్​పల్లి ఘటనల్లో ఇద్దరు మృతి- 
  • ఈ ఏడాది రోడ్లకు రూ.567 కోట్లనిధులు మంజూరు
  • 30 చోట్ల మాత్రమే పనులు పూర్తి 

హైదరాబాద్, వెలుగు: సిటీ రోడ్లు ప్రాణాలను తీస్తున్నాయి. రోడ్లపై ఫీట్లలోతు గుంతలు పడిన కూడా అధికారులు వాటిని బాగు చేయడం లేదు. దీంతో  మెయిన్ రోడ్ నుంచి కాలనీల వరకు ఎక్కడ చూసినా రోడ్లు పూర్తిగా ఖరాబ్ అయ్యాయి. వాహనదారులు సాఫీగా ప్రయాణించలేని పరిస్థితి నెలకొంది. గుంతలు ఎక్కువగా ఉండగా.. వెహికల్స్  మూవ్​మెంట్​స్లోగా ఉంటోంది. దీంతో జర్నీకి ఆలస్యమవుతుంది. బల్దియా ఏదో నామ్ కే వాస్తేగా రోడ్లను వేస్తుంది. రోడ్ల డ్యామేజ్ పైనే బల్దియాకు కంప్లయింట్స్​ఎక్కువగా వస్తున్నా.. రిపేర్లపై అధికారులు దృష్టి పెట్టడం లేదు. 

 ఏవైనా పనులతో తవ్విన రోడ్లను కూడా అలాగే వదిలేస్తుండగా.. రాత్రిపూట తెలియక స్పీడ్​గా వెళ్లేవారు గుంతల్లో పడుతూ ఆస్పత్రుల పాలైన ఘటనలు లేకపోలేదు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు మరింతగా ఖరాబ్ అయ్యాయి. బల్దియా వాటికి ప్యాచ్ వర్కులను కూడా చేస్తున్నట్టు కనిపించడం లేదు.  రూ.567 కోట్ల నిధులున్నా.. గ్రేటర్​లో 9,013 కిలోమీటర్ల మేర  రోడ్లు ఉండగా.. ప్రతి ఏటా రిపేర్లకు నిధులు మంజూరవుతున్నా.. పనులను చేయడంలో బల్దియా నిర్లక్ష్యంగా ఉంటోంది. గత ఆర్థిక ఏడాదిలో రూ.1,274 కోట్లతో 4,790 రోడ్ల  పనులు చేపట్టారు. అందులో రూ.697 కోట్లతో  2,480 పనులు మాత్రమే పూర్తి చేశారు. 

ప్రస్తుత  ఆర్థిక ఏడాదిలో రూ.567 కోట్లను 2,162 పనులకు మంజూరు చేయగా.. ఇప్పటి వరకు సుమారు 30కిపైగా పనులను మాత్రమే పూర్తి చేసింది. ఇలా నిధులు మంజూరు చేసినా  పనులు చేయడంలో బల్దియా నిర్లక్ష్యం కనిపిస్తోంది.  ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీల ఆడియోతో పాడైన రోడ్ల వీడియోలు మిక్స్​ చేసినవి సోషల్​మీడియాలో కొద్దిరోజుల నుంచి వైరల్​గా మారాయి.  డల్లాస్, ఇస్తాంబుల్​ సిటీల తరహాలో హైదరాబాద్ రోడ్లను చేస్తామని చెప్పిన మాటలతో కూడిన వీడియోలు వాట్సాప్ గ్రూపులు, ఫేస్​ బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియాలో పలువురు షేర్ చేస్తున్నారు.  క్వాలిటీ లేదు.. కంట్రోల్ దృష్టి పెట్టట్లేదు..

సిటీలో కొత్తగా వేసే రోడ్లలో నాణ్యత ఉండటంలేదు. బల్దియా క్వాలిటీ కంట్రోల్   అధికారులు ఫోకస్ చేయట్లేదు. కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా రోడ్లను వేసి పనులు కానిచ్చేస్తున్నారు.  నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా నాణ్యతలో బల్దియా ఫెయిలైందనే ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. గ్రేటర్​లో రోడ్ల పరిస్థితి చూస్తే ఇదే స్పష్టమైతుంది. దీనికి క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులపై బాధ్యత ఉంది. నెల, రెండు నెలల కింద రిపేర్లు చేసినా చాలా ప్రాంతాల్లో ఇదే సమస్య నెలకొంది. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు ఇవ్వకపోతుండడం కూడా రోడ్ల క్వాలిటీపై ప్రభావం చూపుతోంది. ఇదే కారణంతో అధికారులు కూడా కాంట్రాక్టర్లను ఏం అనలేకపోతుండటం గమనార్హం. 

 “బాచుపల్లిలోని ఇంద్రప్రస్థ అపార్ట్​మెంట్​లో ఉండే కిశోర్ పెద్ద కూతురు దీక్షిత(8) బౌరంపేట్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్​లో థర్డ్​ క్లాస్ ​చదువుతుంది. బుధవారం ఉదయం దీక్షతను స్కూల్​లో దించేందుకు తండ్రి స్కూటీపై తీసుకెళ్తుండగా.. రెడ్డీస్ ల్యాబ్​ సమీపంలో గుంతల కారణంగా స్కిడ్ ​అయింది. దీంతో స్కూటీపై నుంచి తండ్రీకూతురు కింద పడిపోయారు. అదే టైమ్​లో వెనక నుంచి వచ్చిన ఓ ప్రైవేటు స్కూల్ బస్సు చిన్నారి మీది నుంచి దూసుకెళ్లింది. దీక్షిత  స్పాట్​లోనే చనిపోయింది. రోడ్లు ఖరాబైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గుంతల రోడ్డుతోనే చిన్నారి బలైందని ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.’’

 “అల్వాల్​లోని కానాజీగూడలో ఉండే విజయ్​కుమార్ కూతురు వైష్ణవి(17) కూకట్​పల్లిలోని ఓ డిగ్రీ కాలేజీలో చదువుతుంది. బుధవారం ఉదయం స్కూటీపై  వైష్ణవిని బోయిన్ పల్లి బస్టాప్​వద్ద దించేందుకు తండ్రి తీసుకెళ్తున్నాడు. ఎంఎంఆర్ గార్డెన్ వద్ద రోడ్డుపై ముందు గుంత ఉండగా తప్పించబోయాడు. స్కూటీ అదుపుతప్పి గుంతలో పడింది. విజయ్ కుమార్ రోడ్డు పక్కకు, అతని కుమార్తె రోడ్డుపై పడిపోయింది. అదే టైమ్​లో సుచిత్ర సర్కిల్ నుంచి ఓవర్ స్పీడ్​తో వచ్చిన డీసీఎం వైష్ణవిపై నుంచి వెళ్లింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా కోమాలోకి వెళ్లింది. చికిత్స పొందుతూ  వైష్ణవి గురువారం చనిపోయింది.’’

వీఐపీ ప్రాంతాల్లోనే బాగుంటే సరిపోదు
సిటీలో రోడ్లు వేసిన కొన్నాళ్లకే డ్యామేజ్ అవుతుండగా బల్దియా అధికారులు దృష్టి పెట్టడం లేదు. క్వాలిటీని పట్టించుకోకపోవడంతోనే సమస్య వస్తోంది. ప్రజాధనం వృథాతో పాటు జనానికి ఇబ్బందులు తప్పట్లేదు. సీఆర్ఎంపీ రోడ్ల మాదిరిగా అన్నిరోడ్లు ఎందుకు ఉండటం లేదు.  వీఐపీలు తిరిగే ప్రాంతాల్లోనే రోడ్లు బాగుంటే సరిపోదు. అన్నిచోట్ల రోడ్లను మంచిగా వేయాలి. 
– అబ్దుల్ రెహమాన్, సోషల్ యాక్టివిస్ట్