త్వరలో స్థానిక ఎన్నికలు

త్వరలో స్థానిక ఎన్నికలు

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై బీసీ కమిషన్ కసరత్తు చేస్తోంది. లోకల్ బాడీల్లో బీసీల రిజర్వేషన్ల అంశాన్ని బీసీ కమిషన్ లెక్కల ద్వారా తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశించటంతో అందుకు తగ్గట్టు కమిషన్ చైర్మన్, మెంబర్లు పనిచేస్తున్నారు. ఈ అంశంపై రాష్ట్రంలో గత 3 లోకల్ బాడీస్ ఎన్నికలు, రిజర్వేషన్లు, జనాభా, ఓటర్ లిస్ట్ తదితర వివరాలు అందజేయాలని ఇటీవల పంచాయతీ రాజ్ శాఖను బీసీ కమిషన్ ఆదేశించింది.

త్వరలో ‘స్థానిక’ ఎన్నికలు 

లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇదే విషయం స్పష్టం చేశారు. జూన్​లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అయితే, బీసీ రిజర్వేషన్ల లెక్క తేలకపోవటంతో ఈ అంశంపై ప్రభుత్వ నిర్ణయంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో కులగణన చేపట్టాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకొని ఇందుకు రూ. 150 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఎన్నికల తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 

2014లో అప్పటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను ఒక్క రోజులోనే పూర్తి చేసింది. ఇపుడు అలాగే చేసే అవకాశం ఉన్నా.. కులగణనకు ముందు జరగాల్సిన ప్రాసెస్ కు నెల రోజుల టైమ్ పడుతుందని బీసీ వెల్ఫేర్ అధికారులు చెబుతున్నారు. కులగణనకు నోడల్ ఏజెన్సీ ఎంపిక, జిల్లా కలెక్టర్లతో మీటింగ్, కులగణన ఎలా చేయాలి, ఆల్ పార్టీ మీటింగ్, వివిధ కుల సంఘాలు, ప్రజా సంఘాలు, మేధావులు, ప్రొఫెసర్ల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈ ప్రాసెస్ కు నెల రోజుల టైం పడుతుందని భావిస్తున్నారు.