వార్ ఎఫెక్ట్.. గుడ్డు రేటు డౌన్.. తెలంగాణలో రూ.4 రూపాయలకు పడిపోయిన ధర

వార్ ఎఫెక్ట్.. గుడ్డు రేటు డౌన్.. తెలంగాణలో రూ.4 రూపాయలకు పడిపోయిన ధర
  • పశ్చిమాసియాకు ఎగుమతులు నిలిచిపోవడం వల్లే 

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో కోడిగుడ్డు ధరలు అమాంతం పడిపోయాయి. రెండు నెలల కింద రిటైల్  మార్కెట్ లో రూ.8 వరకు పలికిన గుడ్డు ధర.. ప్రస్తుతం రూ.4.50, రూ.5 కు పడిపోయింది. నేషనల్  ఎగ్  కో ఆర్డినేషన్  కమిటీ(నెక్) నిర్ణయం ప్రకారం 100 గుడ్ల హోల్  సేల్  ధర రూ.420 మాత్రమే. ఇరాన్, ఇజ్రాయల్  యుద్ధం కారణంగా పశ్చిమాసియా దేశాలకు మన దేశం నుంచి గుడ్ల ఎగుమతులు నిలిచిపోయి డిమాండ్  లేక నాలుగైదు రోజులుగా ధరలు తగ్గిపోయాయి. మరోవైపు ఎండలు పెరగడంతో ప్రజలు గుడ్ల వినియోగాన్ని క్రమంగా తగ్గిస్తుండడం కూడా ధరల తగ్గుదలకు కారణమని మార్కెట్  వర్గాలు చెబుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో షిప్పింగ్ కు అంతరాయం ఏర్పడడంతో దేశం నుంచి గుడ్ల ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో దేశవ్యాప్తంగా గుడ్ల రేట్లు తగ్గిపోయాయి. 

రాష్ట్రంలో రోజుకు 3.50 కోట్ల గుడ్ల ఉత్పత్తి

రాష్ట్రంలో గుడ్ల ఉత్పత్తి కోసం రైతులు 2 వేల లేయర్  పౌల్ట్రీ ఫామ్స్  నిర్వహిస్తున్నారు. వీటిలో సుమారు 7 కోట్ల లేయర్ కోళ్లు ఉండగా, వాటి ద్వారా రోజుకు సుమారు 3.50 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఏటా సుమారు 18,600 కోట్లకు పైగా గుడ్ల ఉత్పత్తితో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉంది. హైదరాబాద్  చుట్టు పక్కనే వందలాదిగా పౌల్ట్రీ ఫామ్స్  ఉన్నాయి. మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, కర్నాటక నుంచి పశ్చిమాసియా, ఆఫ్రికాలోని 40 దేశాలకు గుడ్లు ఎగుమతి అవుతున్నాయి.

పడిపోయిన ధరలతో పౌల్ట్రీ రైతు దిగాలు

ఇరాన్, ఇజ్రాయల్  యుద్ధం ముందు వరకు గుడ్డు ధర స్థిరంగానే ఉంది. ఏడాదిలో ఎక్కువ నెలలు గుడ్డు ధర రూ.6, రూ.7గా ఉండేది. ఎండాకాలం వచ్చిందంటే సాధారణంగానే గుడ్ల వినియోగం తగ్గడం వల్ల ధరలు తగ్గుముఖం పడుతుంటాయి. గత ఏడాది మార్చి నెలలో ఒక్క గుడ్డు ధర హోల్ సేల్ లో రూ.6 పలకగా, ఈ సారి రూ.4.50 పలుకుతోంది. ఏప్రిల్, మే నెల రాక ముందే యుద్ధం కారణంగా పౌల్ట్రీ రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో గుడ్డు ధర రూ.3.50కు పడిపోయే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. లేయర్  ఫామ్ లలో ఒక్కో కోడిని పెంచడానికి రైతుకు రోజుకు రూ.5 ఖర్చు అవుతోంది. గతంలో కిలో రూ.38గా ఉన్న దానా(సోయా) ధర ప్రస్తుతం రూ.43కు పెరిగింది. దీంతో పౌల్ట్రీ రైతులు నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

ఎక్స్‌‌పోర్ట్స్​ తగ్గడం వల్లే..

ఇరాన్, ఇరాక్  ప్రాంతాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితులతో తెలంగాణ నుంచి విదేశాలకు గుడ్ల ఎక్స్‌‌పోర్ట్  గణనీయంగా తగ్గింది. సాధారణంగా ఒక గుడ్డు ధర రూ.5 నుంచి రూ.6 వరకు ఉండేది. కానీ, ప్రస్తుతం మార్కెట్‌‌ లో రూ.3.50 నుంచి రూ.3.80 వరకు పడిపోయింది. దీంతో ఒక్క గుడ్డు మీద రూ.1.50 వరకు నష్టం వస్తోంది. మా ఫారంలో నెలకు 30 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతాయి. ధరలు తగ్గిపోవడంతో రోజుకు రూ.లక్ష నుంచి రూ.లక్షన్నర వరకు నష్ట పోతున్నా. కోళ్ల దానా, మందులు, కూలీ రేట్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రభుత్వం పౌల్ట్రీ రంగానికి తగిన సాయం అందించాలి.
‌‌‌‌ - రవీందర్ రెడ్డి, పౌల్ట్రీ రైతు, మెట్‌‌పల్లి