
కూసుమంచి, వెలుగు : మందు కొట్టిన గడ్డి తినడంతో 80 గొర్రెలు చనిపోయాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాజారంలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన పేర్ల కొమరయ్య, బయన్న, గాలయ్య, లింగయ్య, నరేశ్ తమ గొర్రెలకు గడ్డి మేపేందుకు బుధవారం కూసుమంచి మండలంలో లాల్‌సింగ్ తండాకు తీసుకెళ్లారు. అక్కడ ఓ రైతుకు చెందిన పెసర చేనులో గడ్డి మేసిన అనంతరం రాత్రి తమ కొట్టంలో కట్టేశారు. గురువారం ఉదయం చూసే సరికి 80 గొర్రెలు చనిపోయి కనిపించాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతును ఎంక్వైరీ చేయగా పెసర చేనుకు మందు కొట్టామని చెప్పినట్లు ఎస్సై గిరిధర్‌రెడ్డి చెప్పారు.