బెంగుళూరు: కర్నాటకలో భారీ పేలుడు సంభవించింది. గురువారం (డిసెంబర్ 25) రాత్రి చారిత్రాత్మక మైసూర్ ప్యాలెస్ సమీపంలో బెలూన్ గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను చికిత్స కోసం దగ్గర్లోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
మైసూరు పోలీస్ కమిషనర్ సీమా లట్కర్ మాట్లాడుతూ.. గురువారం (డిసెంబర్ 25) రాత్రి 8:30 గంటల ప్రాంతంలో మైసూర్ ప్యాలెస్‌లోని జయమార్తాండ గేట్ సమీపంలో పేలుడు సంభవించిందని తెలిపారు. సైకిల్‌పై హీలియం బెలూన్లు అమ్ముతున్న ఒక వ్యక్తి బెలూన్లలో గాలి నింపుతుండగా అకస్మాత్తుగా సిలిండర్ పేలిందని చెప్పారు.
►ALSO READ | అసలేం జరుగుతోంది..? బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడిని కొట్టి చంపిన దుండగులు
ఈ ఘటనలో బెలూన్ విక్రేత అక్కడికక్కడే మరణించాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. గాయపడిన నలుగురినీ వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. క్రిస్మస్ సెలవుల కారణంగా మైసూర్ ప్యాలెస్ ప్రదర్శన కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు పేలుడి ధాటికి తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
