ఢాకా: భారత పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల పర్వం కొనసాగుతోంది. దీపు చంద్ర దాస్ దారుణ హత్యను మరువకముందే తాజాగా బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడు హత్యకు గురయ్యాడు. దొంగతనం ఆరోపణలపై అమృత్ మండల్ (30) అనే యువకుడిని అల్లరిమూకలు కొట్టి చంపారు. రాజ్ బరి జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసులు మాత్రం ఈ ఘటనను దోపిడీ కుట్రతో ముడిపెట్టారు. బంగ్లాలో హిందువులే లక్ష్యంగా జరుగుతోన్న వరుస హత్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం (డిసెంబర్ 24) రాత్రి 11 గంటల ప్రాంతంలో రాజ్‌బరి జిల్లాలో దొంగతనం ఆరోపణలపై గ్రామస్తులు ఒక యువకుడిపై దాడి చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం పంగ్షా జిల్లా హెల్త్ కాంప్లెక్స్‌కు తరలించారు. ఆరోగ్యం విషమించి తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో యువకుడు మరణించాడని పోలీసులు తెలిపారు.
మృతుడిని అదే గ్రామానికి చెందిన అమృత్‌గా గుర్తించారు. ఈ ఘటనపై రెండు కేసులు నమోదు అయ్యాయని.. దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. మహ్మద్ సెలిమ్‌ను అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుండి రెండు తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అమృత్ స్థానికంగా ఒక గ్రూపును ఏర్పాటు చేసుకుని స్థానిక ప్రజలను బెదిరించి డబ్బు వసూలు చేసేవాడని పోలీసులు ఆరోపించారు. మూక దాడిలో అమృత్ మరణించడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
►ALSO READ | బంగ్లా రాజకీయాల్లో సంచలనం: షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీపై నిషేధం
దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. కాగా, స్టూడెంట్ లీడర్ ఉస్మాన్ హాదీ హత్య తర్వాత బంగ్లాదేశ్ లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మైమెన్సింగ్ సిటీలోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న దీపూ చంద్ర దాస్ మహ్మద్ ప్రవక్తను దూషించాడంటూ అల్లరిమూక కొట్టి చంపి, తగులబెట్టిన ఘటన బంగ్లాదేశ్‌లో సంచలనం రేపింది. ఈ ఘటనను మురువకముందే మరో హిందూ యువకుడిని దుండగులు కొట్టి చంపడం ఆందోళన రేకెత్తిస్తోంది.
