Retail Inflation: భారత రిటైల్ ద్రవ్యోల్బణం లెక్కల్లో దశాబ్దం తర్వాత భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఫిబ్రవరి 12న విడుదలైన గణాంకాల ప్రకారం బేస్ సంవత్సరం 2024 కింద జనవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.75 శాతంగా నమోదైంది. పాత పద్ధతిలో ఇది కేవలం 1.33 శాతంగానే ఉండేది. ఇది జస్ట్ లెక్కలు మారడమే కాదు.. సామాన్యుడి మారుతున్న లైఫ్‌స్టైల్‌కి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణం బాస్కెట్ లో కీలక మార్పులు చేసింది.
ఆహారం తగ్గింది.. లగ్జరీలు పెరిగాయి
కొత్త కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్(CPI)లో అతిపెద్ద మార్పు ఏమిటంటే.. ఆహార పదార్థాల ప్రాధాన్యతను తగ్గడం. ఇప్పటివరకు ద్రవ్యోల్బణంలో ఆహార పదార్థాల వాటా దాదాపు 45 శాతంగా ఉండేది. కానీ ఇప్పుడు అది మొదటిసారిగా 40 శాతం కంటే తక్కువకు 37 శాతానికి పడిపోయింది. దీనికి బదులుగా నాన్-ఫుడ్ కేటగిరీల వాటా 60 శాతానికి పైగా పెరిగింది. అంటే ప్రజలు ఇప్పుడు కేవలం తిండి కోసమే కాకుండా హెల్త్, ఎడ్యుకేషన్, లగ్జరీ వస్తువుల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని ఇది స్పష్టం చేస్తోంది.
బాస్కెట్లోకి ఎయిర్‌పాడ్స్.. పెట్ ఫుడ్
మారుతున్న కాలాన్ని ప్రజల అవసరాలను పరిగణలోకి తీసుకుని ద్రవ్యోల్బణ జాబితాలోకి కొత్త వస్తువులు వచ్చి చేరాయి. గతంలో 299 వస్తువులు ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 350కి పెరిగింది. ఈసారి బాస్కెట్‌లో ఎయిర్‌పాడ్స్, పెట్ ఫుడ్, శానిటైజర్లు, ఫిట్‌నెస్ బ్యాండ్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు వంటి ఆధునిక వస్తువులను చేర్చారు. అలాగే OTTలు, పెన్ డ్రైవ్‌లు, బేబీ సిట్టర్లు వంటి సేవలను కూడా లెక్కల్లోకి తీసుకున్నారు. ఇక కాలం చెల్లిన వీసీఆర్, వీసీడీ ప్లేయర్లు, రేడియోలు, టేప్ రికార్డర్లను లిస్ట్ నుంచి కేంద్రం తొలగించింది.
షాక్ ఇచ్చిన టమాటా..
జనవరి గణాంకాల ప్రకారం ఆహార ద్రవ్యోల్బణం 2.13 శాతంగా ఉంది. ఇందులో టమాటా ధరలు ఏకంగా 64.8 శాతం పెరగడం ఆందోళన కలిగించే అంశం. పర్సనల్ కేర్ విభాగంలో ద్రవ్యోల్బణం 19.02 శాతంగా ఉంది. ముఖ్యంగా బంగారం ధర 47 శాతం, వెండి ఆభరణాల ధర 160 శాతం పెరగడం ఈ విభాగంపై భారాన్ని పెంచింది. వీటితో పాటు హెల్త్ 6.1%, ట్రాన్స్ పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ 12.4% బరువును కూడా పెంచారు.
మార్పు వల్ల సామాన్యుడికి దక్కే లాభమేంటి..?
కొత్త లెక్కల వల్ల ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి క్షేత్రస్థాయిలో ధరల పెరుగుదలపై మరింత స్పష్టమైన అవగాహన వస్తుంది. ఆహార పదార్థాల ధరలు అప్పుడప్పుడు పెరిగినా లేదా తగ్గుతున్నా.. ఇకపై మొత్తం ద్రవ్యోల్బణంపై వాటి ప్రభావం గతంలో కంటే తక్కువగా ఉంటుంది. ఫలితంగా వడ్డీ రేట్ల తగ్గింపు లాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆర్‌బీఐకి మరింత మెరుగైన డేటా అందుబాటులో ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే.. ఈ కొత్త సిరీస్ డిజిటలైజేషన్, అర్బనైజేషన్ వైపు మారుతున్న భారతీయుల ఖర్చులను అద్దం పడుతోంది. మెుత్తానికి మారుతున్న ప్రజలు.. వారి అవసరాలకు తగ్గట్టుగ్గానే లెక్కల్లో మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం.
