బనారస్, కాంచీపురం వంటి బ్రాండ్లు సాధించిన విజయాన్ని మన గద్వాల్, ధర్మవరం, మంగళగిరి, పోచంపల్లి ఎందుకు అందుకోలేకపోతున్నాయి ?

బనారస్, కాంచీపురం వంటి బ్రాండ్లు సాధించిన విజయాన్ని మన  గద్వాల్,  ధర్మవరం, మంగళగిరి, పోచంపల్లి ఎందుకు అందుకోలేకపోతున్నాయి ?

శతాబ్దాల కాలంగా మగ్గం సవ్వడితో, రంగుల అల్లికలతో  ప్రపంచాన్ని మురిపించిన ఘనచరిత్ర మనది. ఈ అద్భుత కళకు పునాది పద్మశాలి సమాజం. పద్మశాలి అంటే పద్మం వంటి నూలు నుంచి వస్త్రాన్ని సృష్టించేవారని అర్థం. మార్కండేయ మహర్షి వారసులుగా, శ్రమనే నమ్ముకున్న ఈ శ్రామిక వర్గం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించింది.

నేడు జాతీయ, అంతర్జాతీయ విపణిలో బనారస్, కాంచీపురం వంటి బ్రాండ్లు సాధించిన విజయాన్ని మన  గద్వాల్,  ధర్మవరం, మంగళగిరి, పోచంపల్లి ఎందుకు అందుకోలేకపోతున్నాయి ? అత్యున్నత  నైపుణ్యం ఉన్నప్పటికీ ప్రపంచ విపణిలో తెలుగు ప్రాంతాల  చీరలు వెనుకబడటానికి గల కారణాలను విశ్లేషించాల్సిన అవసరం ఉంది. దానిని ఒక వ్యాపార దృక్పథంతో ప్రపంచానికి పరిచయం చేయడంలో మనం వైఫల్యం చెందాం. 

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ప్రాంతం ఒక ప్రత్యేకమైన నేత శైలిని కలిగి ఉంది.  పోచంపల్లి ఇకట్ రంగుల అల్లికలో జ్యామితీయ ఆకృతులను సృష్టించే టై అండ్ డై పద్ధతిలో ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. ఇది అంతర్జాతీయ ఫ్యాషన్ డిజైనర్లను సైతం ఆకర్షించింది. ఈ వైవిధ్యం ఉన్నప్పటికీ, మార్కెట్ రేసులో  ఒక పటిష్టమైన బ్రాండ్ వ్యూహం లేకపోవడం వల్ల ఈ కళాఖండాలు కేవలం స్థానిక సంతలకే పరిమితమవుతున్నాయి. గ్లోబల్ విలేజ్ యుగంలో కూడా మన ఉత్పత్తులు సరిహద్దులు దాటలేకపోవడం శోచనీయం.

అతి పెద్ద సవాలు వలసలు
చేనేత రంగం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు వలసలు. ముఖ్యంగా తెలంగాణలోని  సిరిసిల్ల,  కరీంనగర్,  పోచంపల్లి ప్రాంతాల నుంచి వేలాది పద్మశాలి కుటుంబాలు మహారాష్ట్రలోని భివండీ,  సోలాపూర్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లాయి.  సొంత ఊరిలో మగ్గంపై అద్భుతాలు సృష్టించాల్సిన మేధావులు, అక్కడ పవర్ లూమ్ పరిశ్రమల్లో కేవలం దైనందిన కూలీలుగా మారిపోయారు. సొంత కళను వదిలి, యంత్రాల మధ్య నలిగిపోతూ లేబర్ అనే ముద్ర వేయించుకోవడం మన చేనేత రంగం చవిచూస్తున్న అతిపెద్ద పరాభవం.

భివండీ వెళ్లిన ప్రతి చేనేత కార్మికుడి వెనుక ఒక విఫలమైన ఆర్థిక వ్యవస్థ ఉంది. అక్కడ వారు తయారుచేస్తున్న వస్త్రాలు ప్రపంచ స్థాయి బ్రాండ్ల పేరుతో విక్రయించబడుతుంటే, తయారీదారుడిగా తెలుగు కార్మికుడికి దక్కుతున్నది మాత్రం కేవలం చాలీచాలని వేతనమే. ఈ వలసలు తెలుగు చేనేత వారసత్వాన్ని బలహీనపరుస్తున్నాయి. కళాకారుడు కూలీగా మారడం సమాజానికి తీరని లోటు. ప్రభుత్వం ఈ వలసలను నిరోధించే దిశగా ఎటువంటి బలమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ శ్రమశక్తి అన్యాక్రాంతం అవుతోంది.

కాంచీపురం చీరలకు జి.ఐ. రక్షణ
బనారస్, కాంచీపురం చీరల విజయాన్ని గమనిస్తే అక్కడ ఒక బలమైన ఎకోసిస్టమ్ కనిపిస్తుంది.  వారు మార్కెటింగ్ అంటే కేవలం అమ్మకం కాదని, అది ఒక గౌరవమని నిరూపించారు. కాంచీపురం తనను తాను దక్షిణాది పెళ్లిళ్ల అధికారిక వస్త్రంగా ముద్ర వేసుకుంది. తమిళనాడు ప్రభుత్వం దీనికి పకడ్బందీగా జి.ఐ. రక్షణ కల్పించడమే కాకుండా,  కో-ఆప్టెక్స్ వంటి సంస్థల ద్వారా నాణ్యతను నిరంతరం పర్యవేక్షిస్తోంది. బనారస్ చీరలు మొఘల్ కాలం నాటి రాజసంతో  ముడిపడి ఉన్నాయి. 

ఉత్తరాది సెలబ్రిటీలు, అంతర్జాతీయ డిజైనర్లు బనారస్ వస్త్రాన్ని గ్లోబల్ ఫ్యాషన్ వీక్స్‌‌‌‌కు తీసుకెళ్లారు. వారు వస్త్రాన్ని అమ్మడం లేదు, ఒక చరిత్రను అమ్ముతున్నారు. తెలుగు ప్రాంతాల్లో  వస్త్రం బరువు,  నాణ్యత,  ధర  విషయంలో  వినియోగదారుడికి తిరుగులేని నమ్మకం ఉంటుంది. 

మన దగ్గర అద్భుతమైన నైపుణ్యం ఉన్నప్పటికీ, కొన్ని మౌలిక లోపాలు మార్కెట్‌‌‌‌ను దెబ్బతీస్తున్నాయి. నేత కార్మికుడికి వచ్చే లాభం కంటే, మాస్టర్ వీవర్లు, బడా షోరూమ్ యజమానుల లాభమే పదింతలు ఎక్కువగా ఉంటోంది.  దీనివల్ల  అసలైన కళాకారుడు నిరాశకు గురై వృత్తిని వదిలేస్తున్నాడు. మధ్యవర్తుల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైంది. 

చేనేతకు పూర్వవైభవం తేవాలి
భారతదేశం నుంచి ఏటా వేల కోట్ల రూపాయల టెక్స్​టైల్​ ఎగుమతులు జరుగుతున్నాయి.  ఇందులో తెలుగు రాష్ట్రాల వాటా చాలా తక్కువ. పోచంపల్లి ఇకట్ మాత్రమే కొంతవరకు అంతర్జాతీయ డిజైనర్లను ఆకర్షించగలిగింది. అది కూడా ఒక వ్యవస్థీకృత ఎగుమతి క్లస్టర్‌‌‌‌గా అభివృద్ధి చెందలేదు. వ్యాల్యూ ఎడిషన్  లోపించడం వల్ల మన  సంపద ఇతర రాష్ట్రాలకు తరలిపోతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సస్టైనబుల్ ఫ్యాషన్​పై  ఆసక్తి పెరుగుతోంది. రసాయన రంగులు లేని,  చేతితో నేసిన వస్త్రాలకు  గ్లోబల్ మార్కెట్‌‌‌‌లో విపరీతమైన  డిమాండ్ ఉంది.

ఇన్‌‌‌‌స్టాగ్రామ్, ఇ- కామర్స్ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌ల ద్వారా నేరుగా నేత కార్మికుడి నుంచి వినియోగదారుడికి వస్త్రాన్ని చేరవేసే అవకాశం ఉంది.   మన వద్ద ఉన్న జి.ఐ. ట్యాగ్‌‌‌‌లను కేవలం బోర్డులకే పరిమితం చేయకుండా,   వాటిని  అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌లో ప్రీమియం క్వాలిటీ ముద్రగా మలచాలి.  నాణ్యత నియంత్రణ అనేది ప్రతి గ్రామంలో ఒక ఉద్యమంలా జరగాలి. తెలంగాణ చేనేతకు పూర్వవైభవం రావాలంటే కొన్ని చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. కాంచీపురం మాదిరిగా ప్రతి తెలుగు ప్రాంత చీరకు  ఒక  విశిష్ట  గుర్తింపును ఇవ్వాలి. 

డా. కట్కూరి, పాలసీ విశ్లేషకుడు

  • ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ఐడీ openpage@v6velugu.com
  • రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.