తమిళనాడులో జోసఫ్ విజయ్ గెలవడం ఇప్పుడున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందూ రాష్ట్ర నిర్మాణ దశలో ఒక కొత్త మలుపు అని చెప్పాలి. జోసఫ్ అనే పేరు బైబిల్ పునాదిగా వచ్చింది. అది జీసెస్ క్రీస్తు తండ్రి పేరు కూడా. జీసెస్ ఆయన కన్న కొడుకు కాకపోయినా జోసఫ్ ఆయనను హైరోడ్ అనే రోమన్ పాలకుడు చంపకుండా కాపాడటానికి ఈజిప్టుకు తీసుకువెళ్లాడు. కొడుకును, తల్లి మేరీని రక్షించాడు. తరువాత ఆయన జీసెస్‌కి రాయడం, చదవడం, వడ్రంగి పని నేర్పించాడు. ఆ జోసఫ్ పేరునే తమిళ విజయ్‌కి ఆయన తల్లిదండ్రులు పెట్టారు. ఆ జోసఫ్ ఇప్పుడు ఆ క్రిస్టియన్ పేరుగల మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు.
జోసఫ్విజయ్ గెలుపు.. భారతదేశంలో క్రైస్తవులంతా జాతివ్యతిరేకులనే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న దశలో కొద్దిమంది మాత్రమే క్రిస్టియన్లు ఉన్న ఒక పెద్ద రాష్ట్రమైన తమిళనాడుకు ముఖ్యమంత్రి కావడం ఆశ్చర్యదాయకమైనదే. ద్రవిడ స్థాన్గా ఎదిగిన పెరియార్ భూమి మాత్రమే ఈ మార్పు తేగలదు. అయితే, జోసఫ్ విజయ్ తన సిద్ధాంత ప్రచారానికి ఎన్నుకున్న సింబల్స్ తమిళ జాతీయవాదాన్ని మరో మలుపు తిప్పాయి. ఆయన ఎన్నుకున్న సింబల్స్‌లో ముగ్గురు పురుషులు, ఇద్దరు స్త్రీలు ఉన్నారు. పురుషుల్లో డా.బీఆర్ అంబేద్కర్, పెరియార్ రామస్వామి నాయకర్, కామరాజ్ నాడర్ ఉండగా స్త్రీలలో తమిళులను ఒకనాడు పరిపాలించిన రాణి వేలు నాచియార్, స్వాతంత్ర్య పోరాట యోధురాలు అంజలీ అమ్మల్ ఉన్నారు.
ఈ స్త్రీ, పురుష ఐకాన్ల ఎన్నిక తమిళ స్త్రీలను ప్రభావితం చేసి ఉంటుంది. దేశస్థాయిలో ఎన్నికల రంగంలో కాంగ్రెస్ పార్టీ ఉపయోగించిన ఒక ఇందిరాగాంధీ ఇమేజ్ తప్ప మనం మళ్లీ స్త్రీ ఐకాన్ బొమ్మను చూడం. ఈ ఐదుగురిలో ఎవరూ కూడా క్రిస్టియన్ కాదు. కానీ, పెరియార్ద్రవిడ కజగం స్థాపించిన దగ్గర నుంచి జోసఫ్ ముఖ్యమంత్రి అయ్యేవరకు అంబేద్కర్, పెరియార్, కామరాజ్ బొమ్మలను ఆ ఇద్దరి స్త్రీ మూర్తులతో జతకట్టి తమిళ జాతీయవాదాన్ని ఇంకో కొత్తరూపంలోకి మార్చింది మాత్రం జోసఫ్ విజయ్ మాత్రమే. అతను గుడులకూ, మసీదులకూ వెళ్లినా మోకాళ్ల మీద పాకి అతి వినయ క్రిస్టి యన్‌గా దేవుడిని చర్చిలో మాత్రమే ప్రార్థించాడు.
స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఒక ప్రాంతీయ పార్టీ పెట్టుకుని కాశ్మీర్లో మాత్రమే ఒక ముస్లిం ముఖ్యమంత్రి కాగా చూశాం. ఒక ప్రాంతీయ పార్టీ పెట్టుకుని ఒక పెద్ద రాష్ట్రంలో జోసఫ్ విజయ్లాగ ఒక దళిత క్రిస్టియన్ ముఖ్యమంత్రవడం చూడలేదు. అందులోనూ ఆయన ఇప్పటికే దేశమంతటికి బాగా పరిచయమున్న ముగ్గురు ఉద్యమ నాయకులను, సిద్ధాంతకర్తలను ఒక దగ్గర చేర్చి ద్రవిడ జాతీయవాదులను, ఆ జాతీయవాదంలో తమకు స్థానం లేదని చాలాకాలంగా మదనపడుతున్న దళితులను, ఈ ఇద్దరికి మధ్యస్థంగా ఉండి స్వాతంత్ర్యోద్యమ కాంగ్రెస్ అభిమానులను మెప్పించాడు జోసఫ్.
తమిళ అంబేద్కర్ వాదం
తమిళనాడులో ఒక బలమైన దళిత మిడిల్ క్లాస్ఉన్నది నిజమే. వాళ్లు పెరియార్‌ను కొంత అభిమానించినా చాలా బలమైన అంబేద్కర్వాదులుగా మారారు. అన్నాదురై పాలనకాలం నుంచి కరుణానిధి, ఎంజీఆర్ పాలన వరకూ తాము దళితులుగా చూడబడుతున్నామని అక్కడి దళిత మేధావులు వాదిస్తున్నారు. ఈ వాదన నుంచి తిరుమావలవన్ ఒక దళిత పార్టీ స్థాపించాడు కానీ అది దళితయేతరుల్లో ఆదరణ పొందలేదు.
కామరాజ్వల్ల కాంగ్రెస్ మనుగడ
తమిళనాడులో ఇంకా కాంగ్రెస్ బతికుందంటే కామరాజ్ నాడర్ ఒక జాతీయ నాయకుడిగా, ఒక జాతీయస్థాయి కింగ్ మేకర్‌గా, ఒక వెల్ఫేర్ ఆర్థిక, విద్యా వ్యవస్థ వ్యవస్థాపకుడిగా కామరాజ్‌కు ఎనలేని గౌరవం. ఆ రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఉంది. కానీ, కాంగ్రెస్ పార్టీ ఆయనకు జాతీయస్థాయిలో ఆ స్థానం కలిపించలేదు. ఆయన ఫొటో దేశస్థాయిలో చూడలేదు.
కామరాజ్, చక్రవర్తి రాజగోపాలాచారి కాంగ్రెస్‌లో రెండు పూర్తిగా భిన్నమైన ఆలోచనలకు ప్రాతినిధ్యం వహించారు. రాజగోపాలాచారి బాగా బ్రాహ్మణవాది. పెరియార్‌కు బద్ధ శత్రువు. అందుకే కాంగ్రెస్ ఆయన్ని మొదటి గవర్నర్ జనరల్‌గా,
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవులిచ్చి మొదటి భారతరత్న అవార్డును కూడా ఆయనకే ఇచ్చి గౌరవించింది.
రాజగోపాలాచారి గాంధీకి సన్నిహితుడేకాక వియ్యంకుడు. అందుకే నెహ్రూ ఆయన చెప్పినవన్నీ చేశారు. తమిళ బ్రాహ్మణులను మొత్తం కేంద్ర ఉద్యోగాల్లో నింపాడు. ఆ చరిత్ర బ్యాక్గ్రౌండులోనే ఈనాటికి తమిళ బ్రాహ్మణులు (అయ్యర్లు, అయ్యంగార్లు) అన్ని రాష్ట్రాల్లో ఉద్యోగ ఆధిక్యతలో ఉన్నారు. తెలంగాణ కులగణనలో తేలిన లెక్కల ప్రకారం అయ్యర్లు, అయ్యంగార్లు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల్లో చాలా ఎక్కువగా ఉన్నారు.
కామరాజ్ నాడార్ మాత్రం తమిళ శూద్ర, దళిత విద్య, ఆర్థిక అభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి. ఆయన ఒక్క కులం కోసం పనిచేయలేదు. అందుకే కామరాజ్‌కు తమిళ ప్రజల్లో ఈనాటికీ ఎనలేని గౌరవం ఉంది. ఇది గమనించే జోసఫ్ విజయ్ అంబేద్కర్‌ను, కామరాజ్‌ను, పెరియార్ పక్కన చేర్చాడు. ఆ ముగ్గురి పక్కన ఇద్దరి స్త్రీ ఐకాన్లను చేర్చాడు.
పెరియార్ కొత్త రూపం
జోసఫ్ విజయ్ రాజకీయ సిద్ధాంత టీమ్ చాలా తెలివైనదని ఈ ఐదుగురిని సింబలైజ్ చేయడం ద్వారా అర్థమౌతూనే ఉంది. అయితే, నిజానికి జోసఫ్ దైవ నమ్మక వ్యక్తిత్వానికి, సినిమాలు బాగా ఆడటానికి అలవర్చుకున్న అన్ని మతాల ఆచారాలను నటించైనా చూపించడానికి రాజకీయంగా హేతువాదైన పెరియార్‌ను తన సిద్ధాంతంలో ఇముడ్చుకోవడానికి చాలా తేడా ఉంది. పెరియార్ విగ్రహాల వద్ద ‘దేరీజ్ నో గాడ్’ అని మూడుసార్లు రిపీట్ చేస్తూ రాసి ఉంటుంది. ఆ పెరియార్‌ను ఒక హేతువాద, మతవాది అయిన అంబేద్కర్, సాధారణ మత నమ్మకస్తుడై కామరాజ్‌తో జత చేశారు జోసఫ్.
పెరియార్దేవుడిని నమ్మడు కాని నేను నమ్ముతానని ప్రకటించాడు. ఈ ఐదుగురి ఫొటోలను జోడించి ఒక బలమైన వెల్ఫేర్ఎజెండాను కూడా జోసఫ్ విజయ్ ప్రజల ముందు ఉంచాడు. తమిళనాడులో శూద్రులందరూ ఓబీసీలుగా నమోదై ఉన్నారు. అందులో ముదలియార్లు, గౌండర్లు, నాయకర్లు కూడా ఉన్నారు. ఇటువంటి కులాలు ఇతర రాష్ట్రాల్లో రిజర్వేషన్ బయట ఉన్నాయి. కానీ, అక్కడ బ్రాహ్మణులు శెట్టియార్లు మినహా అన్ని కులాల రిజర్వేషన్లలో ఉన్నారు. అయితే, జోసఫ్ బ్రాహ్మణులను కూడా తన క్యాంపేన్లోకి తెచ్చుకున్నాడు. అలా చేస్తూనే స్ట్రాంగ్ యాంటీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ స్టాండ్ తీసుకున్నాడు. ఇది అక్కడున్న ద్రవిడ హేతువాదులను, క్రిస్టియన్లను, దళితులను ఆయన ఓటుబ్యాంకులోకి తెచ్చింది. ఇక్కడే క్రియేటివిటీ కనిపించింది.
డబ్బు పంచకుండా గెలుపు
డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్ డబ్బు పంచాయి అని వార్తలొచ్చాయి. కానీ, జోసఫ్ ఒక్క రూపాయి కూడా ఓటర్లకు ఇవ్వలేదట. అయినా ఓటర్లు ఆయనకు ఓటు వేశారంటే ఈ దేశంలో డెమోక్రసీ మనుగడ మీద మనందరికీ ఒక కొత్త ఆశ కలుగుతుంది. పంచేవారుంటే, తీసుకునేవారు ఉంటారు. కానీ, తీసుకునేవారిని పైసా ఇవ్వను కానీ నాకు ఓటు వేయండి అని ఒప్పించి ఓట్లు వేయించుకోవడం ఈ రోజుల్లో మామూలు విషయం కాదు. అట్లని ఆయన బీదవారు అని కాదు. రూ.600 కోట్లు తనకు బ్యాంకుల్లో ఉన్నాయని ఆయన అఫిడవిట్లోనే చెప్పాడు.
అయినా మాకు ఎందుకు ఇవ్వవు అని ప్రజలు అడగలేదంటే తమిళనాడులో ఒక కొత్త గాలి వీచినట్లే. జోసఫ్‌కు పూర్తిస్థాయి మెజారిటీ లేదు గనుక ఆయన ప్రభుత్వం ఐదేండ్లు మనగలుగుతుందా? ఇచ్చిన హామీలు కొన్ని అయినా నెరవేరుస్తుందా? అనేవి భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్నలు. కానీ జోసఫ్ విజయ్ ఉపయోగించిన రాజకీయ నిర్మాణ ఎత్తుగడలు గతంలో సినిమా యాక్టర్లుగా ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత ఉపయోగించినవాటికంటే చాలా భిన్నమైనవి.
ఇది పరిమిత ఎక్స్పర్మెంట్
జోసఫ్ విజయ్‌ది తమిళనాడుకు పరిమితమైన ఎక్స్పర్మెంట్. కానీ దేశ రాజకీయాల్లో ఒక కొత్తగాలిలా కనిపించింది. ఆయన క్రిస్టియన్ అని తెలిసి కూడా క్రిస్టియనేతరులు ఆయనకు పెద్ద ఎత్తున ఓటు వేశారు. అందుకు క్రిస్టియానిటీ, ఇస్లామ్లా కాక ప్రజలందరిరీ విద్య, మెడిసిన్ రంగాలలో ఆదుకున్న సంస్థలు నడిపిన చరిత్ర ఉంది. దేశంలోనే మొట్టమొదటి గొప్ప అలోపతి హాస్పిటల్ అయిన క్రిస్టియన్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ తమిళనాడులోని వెల్లూరులో ప్రారంభమైంది.
దేశంలో చాలా కొత్త, కొత్త ఆపరేషన్లు ఆ ఆసుపత్రిలో వేలాది మంది క్రిస్టియనేతరులకు జరిగాయి. లయోలా వంటి గొప్ప విద్యాసంస్థలు కూడా మద్రాసులోనే ప్రారంభమయ్యాయి. అందువలనే అంటరానితనాన్ని తీవ్రంగా అనుభవించిన నాడార్లు సైతం క్రిస్టియానిటీని తీసుకున్నారు. ఆ రాష్ట్రంలో ఒక దళిత క్రిస్టియన్, బాగా ఇంగ్లిష్‌లో చదువుకున్న యువ నాయకుడు ఎదగడం ఒక ఆశను రేకెత్తించింది.
ప్రొ. కంచ ఐలయ్య షఫర్డ్
- ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ఐడీ openpage@v6velugu.com
- రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
