ఖమ్మం టౌన్, వెలుగు: లైసెన్స్డ్ సర్వేయర్లకు భవిష్యత్తులో విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఖమ్మం కలెక్టర్ దివాకర తెలిపారు. శనివారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డితో కలిసి లైసెన్స్డ్ సర్వేయర్లతో పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం భూ భారతి పోర్టల్ మ్యాపింగ్ ప్రక్రియ అమలులోకి వచ్చిందని, తిరుమలాయపాలెం మండలంలో రీ సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఆ ప్రక్రియలో కొంతమంది లైసెన్స్ సర్వేయర్లను వినియోగిస్తున్నామని, భవిష్యత్తులో భూముల కొనుగోలు, రిజిస్ట్రేషన్ల సమయంలో మ్యాపింగ్ విధానం అమలులోకి వస్తుందన్నారు. కూసుమంచిలో పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటికే ప్రారంభించినట్లు తెలిపారు. లైసెన్స్డ్ సర్వేయర్లు ఇచ్చిన వినతులను ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ పి.శ్రీజతో కలిసి ఇందిరా మహిళా డెయిరీ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
