దేశ భవిష్యత్తుకు దిక్సూచిలా నిలవాల్సిన జాతీయ ప్రవేశ పరీక్షలు నేడు తీవ్ర విశ్వసనీయత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఏళ్ల తరబడి కష్టపడి చదివి పరీక్షలకు హాజరవుతున్న లక్షలాది మంది విద్యార్థుల కలలు, వారి తల్లిదండ్రుల ఆశలు లీకేజీల రూపంలో ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.
దేశంలో 23 లక్షల మందికి పైగా విద్యార్థులు రాసే నీట్-యూజీ పరీక్ష ప్రతి ఏటా లీకేజీల వివాదాల్లో, కోర్టు కేసుల్లో చిక్కుకోవడం పాలకుల నిర్లక్ష్యానికి, పరీక్షా నియంత్రణ సంస్థల వైఫల్యానికి అద్దం పడుతోంది. ఇంతటి ఆధునిక సాంకేతిక యుగంలో, అంతరిక్షంలోకి రాకెట్లను విజయవంతంగా పంపే సామర్థ్యం ఉన్న భారతదేశానికి, ఒక ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించే సామర్థ్యం, సాంకేతికత మనకు లేదా? ఇది మనముందున్న మిలియన్ డాలర్ల ప్రశ్న.
నీట్ పరీక్ష ప్రతి ఏటా వివాదాల్లో చిక్కుకోవడానికి ప్రధాన కారణం.. దాని వెనుక ఉన్న విపరీతమైన డిమాండ్– -సప్లై వ్యత్యాసం. దేశవ్యాప్తంగా విస్తరించిన కోచింగ్ సెంటర్ల వ్యాపార మాఫియా. దాదాపు లక్షకు పైగా ఎంబీబీఎస్ సీట్లు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటే, వాటిలో సగానికి పైగా సీట్లు మాత్రమే ప్రభుత్వ కళాశాలల్లో తక్కువ ఫీజుతో చదువుకునే అవకాశం కల్పించే 'కన్వీనర్ కోటా' కింద ఉంటాయి. ఈ పరిమితమైన సీట్ల కోసం ఏకంగా 23 లక్షల మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఈ తీవ్రమైన పోటీని ఆసరాగా చేసుకుని దేశవ్యాప్తంగా కార్పొరేట్ కోచింగ్ సెంటర్లు విచ్చలవిడిగా పుట్టుకొచ్చాయి.
ఒక కోచింగ్ సెంటర్ మార్కెట్ మనుగడ సాగించాలన్నా, వచ్చే ఏడాది కోట్ల రూపాయల అడ్మిషన్లు రావాలన్నా.. ప్రస్తుత ఏడాదిలో ఆ సంస్థకు ఎన్ని మెడికల్ సీట్లు వచ్చాయనే ‘ట్రాక్ రికార్డ్’ అత్యంత కీలకం. ఈ ర్యాంకుల వేటలో వెనుకబడితే తమ వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలుతుందనే భయంతో కొన్ని సంస్థలు ఏ గడ్డి కరవడానికైనా సిద్ధపడుతున్నాయి. లీకేజీల ముఠాలతో చేతులు కలిపి, పరీక్షకు ముందే ‘గెస్ పేపర్ల’ ముసుగులో అసలైన ప్రశ్నపత్రాలను తమ విద్యార్థులకు చేరవేస్తూ జాతీయ స్థాయి పరీక్షల విశ్వసనీయత దెబ్బతినడానికి కారణమవుతున్నాయి.
నిర్వహణ లోపాలు.. లూప్‌హోల్స్
జాతీయ పరీక్షల సంస్థ ఒకే విధమైన లక్ష్యంతో జేఈఈ, నీట్ పరీక్షలను నిర్వహిస్తున్నప్పటికీ, ఒక పరీక్ష ప్రశాంతంగా సాగుతుంటే, మరొకటి మాత్రం లీకేజీల నెట్‌వర్క్‌కు చిక్కుతోంది. జేఈఈ మెయిన్ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారిత (ఆన్‌లైన్) విధానంలో జరుగుతుంది. ఇందులో ప్రశ్నపత్రాల ప్రింటింగ్, రవాణా వంటి భౌతిక ప్రక్రియలు ఉండవు కాబట్టి మానవ ప్రమేయం తగ్గి లీకేజీలకు అవకాశం లేదు. కానీ, నీట్ పరీక్షను పెన్ను, పేపరు (ఆఫ్‌లైన్) పద్ధతిలో దేశవ్యాప్తంగా 13 భాషల్లో నిర్వహిస్తున్నారు.
ఈ ప్రశ్నపత్రాల రూపకల్పన నుంచి ప్రింటింగ్ ప్రెస్, అక్కడి నుంచి రవాణా సంస్థలు, జిల్లాల్లోని ట్రెజరీ కేంద్రాలు, చివరకు పరీక్షా కేంద్రాల పంపిణీ వరకు ఎన్నో బాహ్య సంస్థల భాగస్వామ్యం, వందలాది మంది వ్యక్తుల ప్రమేయం ఉంటోంది. ఈ సమయంలోనే ఎక్కడో ఒకచోట భద్రతా లోపాలను అక్రమార్కులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. రవాణా, ప్రింటింగ్ దశల్లో ఉండే ఈ లూప్‌హోల్స్ వల్లే పేపర్ లీకేజీలు సర్వసాధారణంగా మారిపోయాయి.
ఆన్‌లైన్ నిర్వహణలోని క్షేత్రస్థాయి సవాళ్లు
నీట్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రకటించారు. కానీ అందుకు దేశంలో మౌలిక వసతుల కొరత ఉంది. నీట్ రాసే 23 లక్షల మందికి సరిపడా ఆన్‌లైన్ సెంటర్లు మన దేశంలో లేవు. ఎన్‌టీఏ ప్రస్తుత సాంకేతిక పరిమితుల ప్రకారం ఒక షిఫ్ట్‌లో గరిష్టంగా కేవలం 1.5 లక్షల మందికి మాత్రమే ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించగలదు. ఈ లెక్కన నీట్ పరీక్ష పూర్తి కావడానికి కనీసం 15 నుంచి 16 రోజుల సమయం పట్టవచ్చని ఒక అంచనా! పలు షిఫ్ట్‌ల్లో పరీక్ష నిర్వహించడం వల్ల ఫలితాల వెల్లడి, అడ్మిషన్లు, నార్మలైజేషన్ ప్రక్రియ తీవ్రమైన సవాళ్లతో కూడుకున్నదిగా మారే అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా, అన్ని రోజులకు సరిపోయేలా వందలాది విభిన్న ప్రశ్నపత్రాలను తయారుచేయడం నిపుణులకు అతిపెద్ద సమస్య. ఎక్కువ షిఫ్ట్‌లు ఉన్నప్పుడు కొన్ని నమూనా ప్రశ్నలు పదేపదే పునరావృతమై, తర్వాతి రోజుల్లో పరీక్ష రాసే విద్యార్థులకు ప్రశ్నల సరళి ముందే తెలిసిపోయే ప్రమాదముంది. అయితే కేంద్ర మంత్రి చెప్పినట్లు అందుకు తగిన మౌలిక సదుపాయాలను కల్పిస్తే మాత్రం ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించడం అన్ని విధాలా మేలు.
చైనా 'గౌకావో' మోడల్
సవాళ్లను అధిగమించి పరీక్షలను పకడ్బందీగా ఎలా నిర్వహించాలో చైనా మనకు రోల్ మోడల్‌గా కనిపిస్తోంది. చైనాలో దాదాపు 1.3 కోట్ల మంది విద్యార్థులు హాజరయ్యే దేశవ్యాప్త ప్రవేశ పరీక్ష ‘గౌకావో’ మోడల్ తో ఎటువంటి లీకేజీలు లేకుండా విజయవంతంగా సాగుతుంది. చైనా ప్రభుత్వం గౌకావో ప్రశ్నపత్రాలను అత్యున్నత ‘జాతీయ రహస్య పత్రాలు’గా పరిగణిస్తోంది. వీటిని 24 గంటల నిఘా ఉండే కట్టుదిట్టమైన జైళ్లల్లో ముద్రిస్తారు. సిబ్బంది బయటకు వెళ్లే అవకాశం ఉండదు. కాబట్టి ముద్రణ దశలో లీకేజీలకు ఆస్కారమే లేదు.
ముద్రించిన పత్రాలను పోలీసు భద్రతతో, జీపీఎస్ ట్రాకింగ్, లైవ్ వీడియో పర్యవేక్షణ మధ్య తరలిస్తారు. పరీక్ష జరిగే రోజుల్లో యాంటీ- చీటింగ్ నెట్‌వర్క్ యాక్టివేట్ అవుతుంది. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో డ్రోన్లు, కృత్రిమ మేధ కెమెరాలతో నిఘా ఉంచుతారు. పరీక్షా కేంద్రాల వద్ద మొబైల్ సిగ్నళ్లను, స్మార్ట్ వాచ్‌లను గుర్తించే ఇంటెలిజెంట్ సెక్యూరిటీ గేట్లను ఏర్పాటు చేస్తారు. అన్నింటికంటే ముఖ్యంగా, పరీక్షలో అక్రమాలకు పాల్పడితే చైనా చట్టాల ప్రకారం ఏడేళ్ల వరకు కఠిన జైలు శిక్ష విధిస్తారు.
ప్రభుత్వ కమిటీల సిఫార్సులు
పరీక్షల నిర్వహణను సమూలంగా ప్రక్షాళన చేయడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ, పార్లమెంటరీ స్థాయి సంఘం లోపాలను అధిగమించడానికి కొన్ని సిఫార్సులు చేసింది. ఇందులో భాగంగా ప్రైవేటు ఏజెన్సీలకు పరీక్షల బాధ్యతలను అవుట్‌సోర్సింగ్ చేయడాన్ని పూర్తిగా తగ్గించి, దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు, ఐఐటీలు, ఎన్‌ఐటీల డిజిటల్ వసతులను వాడుకుంటూ ఎన్‌టీఏ సొంతంగా వేయి సురక్షిత ప్రభుత్వ పరీక్షా కేంద్రాలను దశలవారీగా నిర్మించాలని కమిటీ స్పష్టం చేసింది.
రెండో ప్రధాన సంస్కరణగా లక్షలాది మంది విద్యార్థులు ఉన్నప్పుడు సంప్రదాయ పెన్- అండ్ -పేపర్ విధానాన్ని రద్దు చేసి కంప్యూటర్ ఆధారిత లేదా 'హైబ్రిడ్ మోడల్' కు మారాలని సూచించింది. ఈ హైబ్రిడ్ విధానంలో ప్రశ్నపత్రం డిజిటల్‌గా ఎన్‌క్రిప్ట్ చేసి కేంద్రాలకు చేరుతుంది. పరీక్షకు కొద్ది నిమిషాల ముందు మాత్రమే అక్కడ హైస్పీడ్ ప్రింటర్ల ద్వారా ముద్రించి విద్యార్థులకు ఓఎంఆర్ షీట్లతోపాటు అందిస్తారు. రిస్క్ తీవ్రతను తగ్గించడానికి జేఈఈ తరహాలోనే రెండు దశల (నీట్ ప్రిలిమ్స్, అడ్వాన్స్ డ్) పరీక్షలను ప్రవేశపెట్టాలని, ప్రిలిమ్స్‌ను ఆన్‌లైన్‌లో నిర్వహించి షార్ట్‌లిస్ట్ చేయాలని కమిటీ సూచించింది.
'డిజి-ఎగ్జామ్' సిస్టమ్.. ఏఐ నిఘా
‘డిజి -ఎగ్జామ్’ వ్యవస్థ కింద బయోమెట్రిక్ ఆధారిత ఆధార్ వెరిఫికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిఘా ద్వారా ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసే ముఠాలను అప్లికేషన్ దశ నుంచే నిరోధించవచ్చు. దీనితోపాటు పార్లమెంటరీ కమిటీ సిఫార్సుల ప్రకారం, గతంలో పేపర్ సెట్టింగ్, రవాణా, మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడి ఏదైనా ఒక రాష్ట్రంలో బ్లాక్ లిస్టులో ఉన్న ప్రైవేటు సంస్థల వివరాలతో ఒక జాతీయ స్థాయి డేటాబేస్ ఏర్పాటు చేయాలి. అటువంటి సంస్థలకు ఎన్‌టీఏ లేదా ఇతర రాష్ట్ర బోర్డులు మళ్లీ కాంట్రాక్టులు ఇవ్వకుండా కఠినంగా నిషేధించినప్పుడే పరీక్షల పారదర్శకత సాధ్యమవుతుంది.
ప్రతిభ కలిగిన పేద, మధ్యతరగతి విద్యార్థుల శ్రమను, వారి భవిష్యత్తును కొందరు ధనవంతులు, దళారులు డబ్బుతో కొనేసే ఈ దుర్మార్గపు సంస్కృతికి ఇకనైనా చరమగీతం పాడాలి. రాధాకృష్ణన్ కమిటీ, పార్లమెంటరీ కమిటీలు అందించిన సిఫార్సులను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా పకడ్బందీగా చట్టపరమైన, సాంకేతిక రక్షణ కవచాన్ని అమలుచేయాలి.
మేకల క్రిష్ణ ప్రధాన కార్యదర్శి తెలంగాణ జర్నలిస్టుల ఫోరం
- ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
- రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
- స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.
