సర్కారు వారి పాట ఎంత? వాటా ఎంత ?

సర్కారు వారి పాట ఎంత? వాటా ఎంత ?

దుబారా తగ్గించి, పొదుపు చర్యలు చేపట్టడం ఇప్పుడే కాదు  ఎప్పుడూ  మంచిదే! కాకపోతే అందులో కాస్త చిత్తశుద్ధి, ఇంకాస్త నిబద్ధత కావాలి.  అత్యయిక పరిస్థితుల్లో మరీ అవసరం.  నలుగురి మెప్పు పొందాలనే  ‘నాటకీయత’ ఇతరులకు  ప్రేరణ ఇవ్వకపోగా నవ్వు తెప్పిస్తుంది. ‘మేమూ చేస్తున్నాం’ అంటూ సర్కారు పెద్దలు చేసే తమాషా సర్కస్‌‌ను తలపించకుంటే చాలు!   ‘యుద్ధ పరిస్థితుల్లో దేశం క్లిష్టదశను దాటుతోంది, మీరు కొన్ని త్యాగాలకు సిద్ధం కావాలి’అని దేశ పౌరులకు ప్రధాని మోదీ పొదుపు చర్యలు పురమాయించే ముందు ప్రభుత్వం వైపు నుంచీ కొన్ని చర్యలు చేపట్టుంటే  హుందాగా ఉండేది.

విపక్షాలు ఘాటుగా విమర్శించి,  తెగ దుమ్మెత్తిపోసిన తర్వాత సర్కారు తరఫునా పొదుపు చర్యలు ఆదేశిస్తున్నట్టు లీక్‌‌లు వచ్చాయి.  కేంద్ర తదుపరి మంత్రివర్గ సమావేశంలో ఈ విషయమై కీలక నిర్ణయాలకు ఆస్కారం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్‌‌రంగ సంస్థలు, కంపెనీలు, కార్పొరేట్లు,  సంపన్నవర్గం... ఏ మేరకు దుబారాలను నియంత్రించి, పొదుపు చర్యలు చేపడతాయి? అన్నది శేష ప్రశ్న!

క్లిష్ట  పరిస్థితుల  దృష్ట్యా పౌరులు దుబారాల అదుపు,  పొదుపు చర్యలు, విచక్షణ నిర్ణయాలు తీసుకోవాలంటూ దేశ ప్రధాని చేసిన సూచనలు బాగున్నాయి.  కానీ,  సమయం..-సందర్భమే బాగోలేదనే  విమర్శలు హోరెత్తాయి.  పశ్చిమాసియాలో  ఇజ్రాయెల్, -అమెరికా– ఇరాన్ యుద్ధ విపరిణామాలు గత కొంత కాలంగా ప్రపంచంపైన, మన దేశంపైనా ప్రతికూల  ప్రభావాన్ని చూపిస్తున్నా... వాటి కారణం చూపి పౌరుల్ని కఠిన నిర్ణయాలకు సిద్ధమవ్వాలని చెప్పింది ఎప్పుడు? అయిదు అసెంబ్లీల ఎన్నికల ప్రక్రియ ముగిసిన  వెనువెంటనే!  పోనీ, ముందుగా ప్రభుత్వం కొన్ని దుబారా నియంత్రణ, పొదుపు చర్యలు చేపట్టి మార్గదర్శకంగా  నిలిచిన తర్వాతే పౌరుల్ని కోరిందా? అంటే, అదీ లేదు! అందుకే తీవ్రమైన విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

ప్రధాని పిలుపులో ఏడు అంశాలు
 ప్రధాని పిలుపులో ముఖ్యంగా ఏడంశాలున్నాయి. 1) ఇంధన కొరత,  దిగుమతుల సమస్య దృష్ట్యా పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధనాల వినియోగాన్ని తగ్గించి  ప్రజారవాణాను  వినియోగించాలి.  2) ఎరువుల వాడకాన్ని తగ్గించి సహజ -ప్రకృతి వ్యవసాయాన్ని పెంచాలి. 3)  విదేశీ మారక  నిల్వల రక్షణకు ఏడాదిపాటు బంగారు కొనుగోళ్లు వాయిదా వేయాలి.  4) ఇదే కారణం రీత్యా  విదేశీ వస్తు  కొనుగోళ్లు తగ్గించి ‘స్వదేశీ’ ప్రాధాన్యతనివ్వాలి. 5) అత్యవసరమైతే తప్ప విదేశీ పర్యటనలు రద్దు/వాయిదా చేసుకోవాలి. 6) ఇంటి నుంచే పనిచేసే పద్ధతిని మళ్లీ పెంచాలి. 7) తిండిలోనూ వంట నూనెల వాడకాన్ని పరిమితం చేసుకోవాలి.  ప్రధాని మోదీ పిలుపు వచ్చిన వెంటనే..... దేశానికి, దేశ ఆర్థిక పరిస్థితికి ఏమైంది? ఉన్నట్టుండి ఎందుకీ ఆంక్షలు?  వాస్తవ పరిస్థితిని పూర్తిగా బయటపెట్టి పారదర్శకంగా ఉండాలనే డిమాండ్ పెరిగింది. లోక్‌‌సభలో  విపక్షనేత రాహుల్‌‌గాంధీ, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, యూపీ మాజీ  సీఎం అఖిలేశ్ యాదవ్ తదితర ప్రతిపక్ష నాయకులు, మేధావులు ఘాటుగా విమర్శించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తన వైపు నుంచీ కొన్ని చర్యలకు సన్నద్ధమైంది.

ముందు నడవటమే నాయకత్వం
‘ఉల్లిగడ్డ  తినొద్దన్నది ఊరందరి కోసమే వెర్రి ముఖమా, మన కోసం కాదు’ అన్నాడట వెనకటికొక పెద్ద మనిషి పెళ్లాంతో! విపక్షాల విమర్శల తర్వాత ‘ముందు మనం చర్యలు చేపడితేనే ప్రజలు అనుసరిస్తారు’ అనుకున్నారేమో ప్రధాని ఆమేరకు దుబారా నియంత్రణ, -పొదుపుకు  ప్రత్యేక చర్యలు ప్రారంభించారు. తన వాహనశ్రేణిని 50 శాతానికి కుదించారు. పర్యటనలు పరిమితం చేయాలని, అనివార్యమైతే తప్ప మీటింగ్స్  ఆన్‌‌లైన్‌‌లోనే  నిర్వహించాలని సూచించినట్టు  వార్తలొస్తున్నాయి. 

ఇవే చర్యలు అన్ని మంత్రిత్వ శాఖల్లో మంత్రులు, అధికారులు పాటించాలని పురమాయించినట్టు  తెలుస్తోంది.  కేంద్రం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు, పబ్లిక్ రంగ సంస్థలు రానున్న రోజుల్లో ఇదే దిశలో నడువనున్నాయి. దేశంలో సహజంగా తలెత్తిన ఆహార కొరత, పాకిస్తాన్‌‌తో యుద్ధానంతర పరిణామాల దృష్ట్యా 1965లో  నాటి ప్రధాని, దివంగత నేత లాల్ బహదూర్ శాస్త్రి కూడా దేశ ప్రజలకు ఓ పిలుపునిచ్చారు.

వారంలో ఒక రోజు, ఓ పూట భోజనం మానేయాలన్నది ఆ పిలుపు సారాంశం. దాని వల్ల ఆ మేర తిండి గింజల పొదుపే కాక ఆహార దుబారా నియంత్రణ, పొదుపు, క్రమశిక్షణను సంస్కృతిగా అలవరుస్తుందనే స్ఫూర్తి కూడా పిలుపు వెనుక దాగుంది. ప్రధాని నిబద్దత పట్ల నాటి దేశ ప్రజలకు విశ్వాసం,  గురి ఉన్నాయి కాబట్టే  చాలామంది  పాటించారు. ప్రతి సోమవారం సాయంత్రం ఇళ్లల్లో వంట మానివేశారు. ‘శాస్త్రి వ్రత’ అని పిలుచుకునేది.  స్వాతంత్ర్యోద్యమ కాలంలో బిహార్‌‌లో భారీ వరదలు వచ్చి అపారంగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినపుడు మహాత్మాగాంధీ తమిళనాడు మధురై పర్యటనలో ఉన్నారు. 

విపత్తు గురించి తెలిసి, ‘వారూ మన తోటి మానవులే, మన దేశ వాసులే, తీవ్రమైన ప్రకృతి విలయం వల్ల అల్లాడుతున్నారు. వారిని ఆదుకోవడం మనందరి ఉమ్మడి కర్తవ్యం, మీకు తోచిన సహాయం చేయండి’ అని సభా వేదిక నుంచి బాపూజీ పిలుపునిస్తే, జేబుల్లో, పర్సుల్లో ఉన్న డబ్బు, ఒంటి మీదున్న నగలు, ఆభరణాలు అక్కడికక్కడే విరాళంగా ఇచ్చి కుప్పపోశారు. గాంధీజీ  నిబద్ధతే వారికి ప్రేరణ!

అన్ని స్థాయిల్లో జరగాలి
విదేశీ మారక  నిల్వల రక్షణ, ఇంధన సంక్షోభ నివారణ, దుబారాల నియంత్రణ, పొదుపు చర్యలు వంటివి  పాలకులైన నాయకులు, అధికారులు ఆచరించాలి. ఈ విషయాల్లో స్వచ్ఛందంగా  ముందుకు రావాలని పిలుపునిస్తూనే కంపెనీలు, కార్పొరేట్లను చట్టం ద్వారా నియంత్రించాలి. సంపన్నులకూ కొన్ని విధివిధానాలు నిర్దేశించాలి.  ఇప్పటికే ఎన్నో త్యాగాలకు సిద్ధపడి, ఆచరిస్తున్న మధ్యతరగతే  ప్రధాని మోదీ పిలుపులోని ఏడంశాలకు ముఖ్యంగా ప్రభావితమవుతుందని విపక్షాలు, మేధావులు పేర్కొంటున్నారు. వారిపై అదనపు భారం మోపే ముందు ప్రభుత్వం ఏం చర్యల్ని పాటిస్తున్నదో ? 

అసలు దేశ ఆర్థిక పరిస్థితి వాస్తవికత ఏమిటో తేటతెల్లంగా వెల్లడించాలని  విపక్షాలు  డిమాండ్  చేస్తున్నాయి.  ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే తమ ‘పొదుపు చర్యల్ని’ ప్రకటించాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశలో తీసు కుంటున్న చర్యలు, నిర్దేశించే విధివిధానాలను ప్రకటించాలి.  ప్రభుత్వపరంగా చాలా విషయాల్లో దుబారా ఎల్లలు లేకుండా సాగుతోంది.  చిన్న చిన్న దూరాలకూ మంత్రులు హెలికాప్టర్లు వాడుతున్నారు. అది ఎక్కే ముందు- దిగిన వెంటనే పెద్ద కాన్వాయ్ వారిని అనుసరిస్తుంది!  గత ప్రభుత్వంలోనూ దుబారా జరిగింది.

వేములవాడలో సీఎం సమావేశం జరిగితే  వంద మందికి హైదరాబాద్ నుంచి వెళ్లినవారికి భోజనం ఖర్చు 
32 లక్షల రూపాయలవటం ఎంతో వివాదాన్ని రేపింది.  గతంలోలాగా ఉదయం 8 గంటలకు కాకుండా 10కి అసెంబ్లీ  మొదలవుతున్నా టిఫిన్ ఏర్పాటు, రోజూ భోజనాలు, అదీ నాలుగు పాయింట్లలో అందుబాటులో ఉంచడం  ఇవన్నీ  దుబారాలు కావా? అనే ప్రశ్న సహజంగానే జనిస్తుంది.  ఇదివరలో మంత్రులు, తమ పీఏ, సెక్యూరిటీతో కూడి ఒకే కారులో వచ్చేది. ఇప్పుడు ఏ మంత్రినైనా అలా ఊహించగలమా? గత  రెండేళ్ల కాలంలో  నేను నాలుగు  సందర్భాల్లో  అసెంబ్లీ  ప్రాంగణానికి వెళితే,  పట్టపగలు అన్నిచోట్లా, దాదాపు అన్ని లైట్లు వెలుగుతూ,  ఫ్యాన్లు తిరుగుతూ, ఏసీలు పనిచేస్తూ కనిపించాయి. అదుపు చేసేవారే లేరు.

ప్రజాధనమంటే లెక్కే లేదా?
రెండు  తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వపరంగా జరిగే దుబారాలకు అంతే లేదు.  చిన్న చిన్న విషయాలకూ పెద్ద మొత్తాల్ని  వ్యయం చేస్తున్నారు.  పెద్ద సంఖ్యలో ప్రభుత్వ సలహాదారుల్ని నియమించి, వారికి జీతం, భత్యం, వాహనం, బంగ్లా వంటి సదుపాయాలు కల్పించి వారి నుంచి పనికొచ్చే సలహాలు తీసుకున్నా.. పాటించిన సందర్భాలు చాలా అరుదు! 

అసలు ఉండవంటేనే సముచితమేమో! అధికారులు ఒక విభాగంలో ఉండి అధ్యయనాలకు రోజులు, నెలల తరబడి విదేశీ పర్యటనలకు వెళతారు.  వచ్చీ రాగానే ఇంకో విభాగానికి బదిలీ అయిపోతారు.  ఏపీ మంత్రి నారా లోకేశ్ తాజాగా పుట్టపర్తి నుంచి ధర్మవరానికి కాన్వాయ్ తగ్గించుకున్నా ప్రశంసకు నోచుకోకపోవడానికి కారణం, ఆయన పుట్టపర్తికి  ప్రత్యేక విమానంలో రావటమే! కాన్వాయ్ తగ్గించుకోవడం ‘డ్రామా’ అని ప్రత్యర్థుల విమర్శ! ‘అదంతా ప్రజాధనం కాదు, నా సొంత ఖర్చు’ అంటారాయన. ప్రభుత్వంలో ఉన్నవారి ఏ ఖర్చు  సొంతం? ఏ ఖర్చు ప్రజాధనం? అన్నదొక  పెద్ద ఫజిల్ !

దిలీప్ రెడ్డి పొలిటికల్ ఎనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్

  • ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ఐడీ openpage@v6velugu.com
  • రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.