Telugu Film Chamber: కీలక నిర్ణయం తీసుకున్న ఫిల్మ్ ఛాంబర్.. ‘పెద్ది’ విడుదలపై దిల్ రాజు క్లారిటీ..

Telugu Film Chamber: కీలక నిర్ణయం తీసుకున్న ఫిల్మ్ ఛాంబర్.. ‘పెద్ది’ విడుదలపై దిల్ రాజు క్లారిటీ..

తెలుగు సినీ నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య వివాదం మరింత ముదురుతోంది. సింగిల్ స్క్రీన్లలో అద్దె విధానం కాకుండా పర్సంటేజ్ విధానం అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేయగా, నిర్మాతలు దీనికి వ్యతిరేకంగా నిలిచారు. ఒకవైపు శిరీష్ రెడ్డి, సునీల్ నారంగ్, చదలవాడ శ్రీనివాసరావు ఉండగా, మరోవైపు నవీన్ ఎర్నేని, నాగవంశీ, సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి ఉన్నారు. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ, ఇవాళ మే15న ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్.. మూడు వర్గాల మధ్య మీటింగ్ జరిగింది. 

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు డి. సురేశ్‌బాబు ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. దాదాపు రెండు గంటలపాటు వాడివేడిగా భేటీ సాగగా, కీలక అంశాలపై చర్చించారు. పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు, థియేటర్ల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించి ఓ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పర్సంటేజ్ విధానంపై అధ్యయనం కోసం 15 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఇందులో 5 మంది నిర్మాతలు, 5 మంది ఎగ్జిబిటర్లు, 5 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉంటారని సురేష్ బాబు తెలిపారు. రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించగా, సినిమాల విడుదలలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సి. కల్యాణ్ తెలిపారు. పరిశ్రమలో అన్ని వర్గాల మధ్య సమన్వయం పెంపే ఈ సమావేశం ప్రధాన లక్ష్యమని తెలిపారు. 

ALSO READ : జయం రవి విడాకులకు నేనెలా కారణం?

దిల్ రాజు మాట్లాడుతూ, “ఈ రోజు ఫిల్మ్ ఛాంబర్‌లో అన్ని వర్గాల ప్రతినిధులతో సమావేశం జరిగింది. పర్సంటేజ్ విధానంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఏ, బి, సి సెంటర్ల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పర్సంటేజ్ విధానాన్ని ఖరారు చేస్తాం. అలాగే జూన్ 4న విడుదల కానున్న ‘పెద్ది’ సినిమాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు” అని తెలిపారు. వాస్తవానికి నాలుగైదు నెలలుగా సరైన సినిమాలు లేక సినీ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి సమయంలో  ‘పెద్ది’ లాంటి భారీ బడ్జెట్ మూవీ వస్తుండటంతో టాలీవుడ్లో ఆసక్తి సంతరించుకుంది.