హైదరాబాద్, వెలుగు: ఎంతో ఘనంగా జరుపుకునే బోనాల ఉత్సవాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకుందని, నిధుల కేటాయింపులో వివక్ష చూపుతోందని అన్నారు. రంజాన్ పండుగ కోసం రూ.33 కోట్లు కేటాయించిన సర్కారు.. 80 శాతానికి పైగా హిందువులు జరుపుకునే బోనాలకు రూ.20 కోట్లు మాత్రమే ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.
జంట నగరాల్లో 3 వేల పైచిలుకు ఆలయాల్లో బోనాలు జరుగుతుంటే, ఈ అరకొర నిధులు ఏ మూలకు సరిపోతాయని నిలదీశారు. రాబోయే గణేష్ ఉత్సవాల విషయంలో కూడా ఇదే వివక్ష కొనసాగిస్తారా అని ప్రశ్నించారు. ఆలయానికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. హిందూ పండుగలంటే ఎందుకంత చులకన అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బోనాల విషయంలో నిర్లక్ష్యంగానే వ్యవహరించిందని, ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోందని విమర్శించారు. హిందూ సమాజం జాగృతం కావాల్సిన సమయం వచ్చిందని, పండుగలకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించేదాకా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
