ఇంజనీర్లను అవమానిస్తరా?..సీఎం రేవంత్‌‌‌‌తో రాహుల్‌‌‌‌ క్షమాపణ చెప్పించాలి: కేటీఆర్‌‌‌‌‌‌‌‌

ఇంజనీర్లను అవమానిస్తరా?..సీఎం రేవంత్‌‌‌‌తో రాహుల్‌‌‌‌ క్షమాపణ చెప్పించాలి: కేటీఆర్‌‌‌‌‌‌‌‌
  • యువతతో పెట్టుకుంటే ఏమైతదో చరిత్ర చూడాలంటూ ఫైర్‌‌‌‌‌‌‌‌
  • కాంగ్రెస్‌‌‌‌ అగ్రనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ 

హైదరాబాద్, వెలుగు: దేశ ప్రగతికి, సాంకేతిక విప్లవానికి మూలస్తంభాలైన ఇంజనీర్లను సీఎం రేవంత్ రెడ్డి అవమానించడంపై స్పందించాల్సిన నైతిక, రాజకీయ బాధ్యత రాహుల్ గాంధీపైనే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులను సీఎం రేవంత్ రెడ్డి ‘క్రిమినల్ వేస్ట్’ అని ఎలా అంటారని ప్రశ్నించారు. అసలు క్రిమినల్ వేస్ట్ వాళ్లు కాదని, కాంగ్రెస్ పార్టీయేనని మండిపడ్డారు.

ఈ మేరకు ఆదివారం రాహుల్ గాంధీకి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల హామీల పేరుతో తెలంగాణ యువతను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీయే అసలు క్రిమినల్ వేస్ట్ అని మండిపడ్డారు. తెలంగాణ యువత రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను, కాంగ్రెస్ వైఖరిని గమనిస్తోందని, సరైన సమయంలో వారికి బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే తమ తప్పును సరిదిద్దుకొని, రేవంత్ రెడ్డితో క్షమాపణ చెప్పించడంతో పాటు రాహుల్ గాంధీ కూడా తెలంగాణ యువతకు, ఇంజనీర్లకు, ఉపాధ్యాయులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ప్రపంచాన్ని ఏలుతున్నరు..

మనదేశ ఇంజనీర్లు తమ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా పెద్దపెద్ద ఎంఎన్‌‌‌‌సీలను నడుపుతున్నారని, అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతూ దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. దేశ ప్రగతికి పాటుపడుతూ లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న అలాంటి వారిని రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ అనడం ఆయన అజ్ఞానానికి, దిగజారుడు రాజకీయ నాయకత్వానికి నిదర్శనమన్నారు. విద్యార్థులకే కాకుండా, వారిని తీర్చిదిద్దుతున్న లెక్చరర్లను కూడా రేవంత్ తక్కువ చేసి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. యువత రేపటి భారతదేశ నిర్మాతలంటూ వేదికలపై రాహుల్ గాంధీ ప్రసంగాలకు, ఆయన పార్టీ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలకు పొంతన లేదని విమర్శించారు. 

ఒక్కసారి చరిత్ర చూడండి..

రేవంత్ రెడ్డికి యువత, విద్యార్థులపై నోరు పారేసుకోవడం అలవాటుగా మారిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా యూనివర్సిటీ విద్యార్థులను ‘బీరు బిర్యానీ బ్యాచ్’ అంటూ అవమానించారని, ప్రశ్నించే వారిపై నిందలు వేయడం ఆయనకు నైజంగా మారిందని మండిపడ్డారు. యువశక్తి శక్తి ఏంటో కాంగ్రెస్ పార్టీ చరిత్ర తిరగేస్తే తెలుస్తుందన్నారు. ఎమర్జెన్సీ సమయంలో యువత తిరగబడితే ఇందిరా గాంధీ ప్రభుత్వానికి ఏం జరిగిందో గుర్తుంచుకోవాలన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో యూపీఏ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ యువత తిరగబడి, కాంగ్రెస్ మెడలు వంచి స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తీరును రాహుల్ గాంధీ మరచిపోకూడదని పేర్కొన్నారు.