చరిత్ర సృష్టించిన తన్వీ.. 17 ఏళ్లలోనే తైపీ ఓపెన్‌ సూపర్‌‌‌‌-300 టైటిల్‌‌‌‌ సొంతం

చరిత్ర సృష్టించిన తన్వీ.. 17 ఏళ్లలోనే తైపీ ఓపెన్‌ సూపర్‌‌‌‌-300 టైటిల్‌‌‌‌ సొంతం

తైపీ : భారత యువ షట్లర్ తన్వీ శర్మ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌‌‌‌లో మరో మైలురాయిని అందుకుంది. తైపీ ఓపెన్ సూపర్–300 మహిళల సింగిల్స్ ఫైనల్లో వియత్నాంకు చెందిన ఆరో సీడ్ థుయ్ లిన్ న్గుయెన్‌‌‌‌ను 21–16, 21–16తో వరుస గేమ్‌‌‌‌లలో ఓడించి తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్‌‌‌‌ను కైవసం చేసుకుంది. 17 ఏళ్ల పంజాబ్ క్రీడాకారిణి కేవలం 36 నిమిషాల్లోనే మ్యాచ్‌‌‌‌ను ముగించింది.

మాజీ ప్రపంచ చాంపియన్ పీవీ సింధు మాజీ కోచ్ పార్క్ టే-సాంగ్ శిక్షణలో రాణిస్తున్న తన్వీ.. 2008లో సైనా నెహ్వాల్ తర్వాత తైపీ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచింది. తొలి గేమ్‌‌‌‌లో 10-2 ఆధిక్యం సాధించిన తన్వీ, ప్రత్యర్థి నుంచి ఎదురుదాడి వచ్చినా ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. రెండో గేమ్‌‌‌‌లో 0-3తో వెనుకబడినా అద్భుతంగా పుంజుకుని విజయాన్ని ఖాయం చేసింది. 
విజయం అనంతరం తన బంగారు పతకాన్ని కోచ్ పార్క్ టే-సాంగ్ మెడలో వేసి కృతజ్ఞతలు తెలిపిన తన్వీ అందరి ప్రశంసలు అందుకుంది. తైపీ ఓపెన్ చరిత్రలో అతి పిన్న వయసులో ఫైనల్ చేరిన క్రీడాకారిణిగానూ ఆమె రికార్డు సృష్టించింది. గతంలో ప్రపంచ జూనియర్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో రెండు పతకాలు సాధించిన తన్వీ, ఆసియా టీమ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో భారత్‌‌‌‌కు తొలి స్వర్ణం అందించిన జట్టులోనూ సభ్యురాలిగా ఉంది.