కామన్‌‌వెల్త్‎లో భారత్ జోష్.. 39 పతకాలతో టాప్ ఫోర్‎లో ఇండియా

కామన్‌‌వెల్త్‎లో భారత్ జోష్.. 39 పతకాలతో టాప్ ఫోర్‎లో ఇండియా
  • 13 స్వర్ణ, 17 రజత పతకాలు
  • 70 మెడల్స్​తో అగ్రస్థానంలో ఆస్ట్రేలియా
  • 2030లో అహ్మదాబాద్‌‌లో నిర్వాహణ
  • అధికారికంగా బాధ్యతల అప్పగింత
  • గ్లాస్గోలో ఘనంగా ముగిసిన క్రీడలు
  • మెడల్స్ సాధించిన వారికి ఢిల్లీలో ఘనస్వాగతం

గ్లాస్గో: స్కాట్లాండ్‌‌‌‌లోని గ్లాస్గో వేదికగా 11 రోజుల పాటు జరిగిన 2026 కామన్వెల్త్‌‌‌‌ క్రీడలకు ఆదివారం ఘనంగా తెరపడింది. ముగింపు వేడుకలో కామన్వెల్త్‌‌‌‌ క్రీడల అధికారిక జెండాను భారత్‌‌‌‌కు అప్పగించారు. దీంతో 2030లో జరిగే శతాబ్ది (100వ సంవత్సరం) కామన్వెల్త్‌‌‌‌ క్రీడలకు ఆతిథ్యమివ్వనున్న భారత్‌‌‌‌ అధికారికంగా బాధ్యతలు స్వీకరించింది. అహ్మదాబాద్‌‌‌‌-2030ను ప్రతిబింబించే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాన్ని భారత్‌‌‌‌ ప్రదర్శించగా, భారతీయ సంస్కృతి, కామన్వెల్త్‌‌‌‌ దేశాల మధ్య ఉన్న అనుబంధాన్ని మూడు విధాలుగా ఆవిష్కరించారు. ముగింపు వేడుకలో భారత బాక్సర్‌‌‌‌ జైస్మిన్‌‌‌‌ లంబోరియా త్రివర్ణ పతాకంతో జట్టుకు నాయకత్వం వహించింది.

ఈ క్రీడల్లో భారత్‌‌‌‌ 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 39 పతకాలు సాధించి మెడల్స్​టేబుల్‎లో నాలుగో స్థానంలో నిలిచింది. 70 స్వర్ణాలు, 45 రజతాలు, 56 కాంస్యాలతో మొత్తం 171 పతకాలు సాధించిన ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఇంగ్లండ్‌‌‌‌ (29–45–-36) రెండో స్థానంలో , కెనడా (19–20–23)  పథకాలతో మూడో స్థానాల్లో నిలిచింది. భారత్‌‌‌‌తో సమానంగా 39 పతకాలు సాధించిన స్కాట్లాండ్‌‌‌‌.. తక్కువ రజత పతకాల కారణంగా ఐదో స్థానంతో సరిపెట్టుకుంది.

మనోళ్ల పవర్​ఫుల్ పర్ఫామెన్స్.. 

షూటింగ్‌‌‌‌, రెజ్లింగ్‌‌‌‌, బ్యాడ్మింటన్‌‌‌‌, క్రికెట్‌‌‌‌, హాకీ వంటి భారత్‌‌‌‌కు బలమైన క్రీడలు ఈసారి లేకపోయినా భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా బాక్సింగ్‌‌‌‌లో ఏకంగా 10 పతకాలు, అందులో రికార్డు స్థాయిలో ఏడు స్వర్ణాలు సాధించి భారత బాక్సర్లు ఆధిపత్యం చాటారు. వెయిట్‌‌‌‌లిఫ్టింగ్‌‌‌‌లో మీరాబాయి చాను వరుసగా మూడో కామన్వెల్త్‌‌‌‌ స్వర్ణాన్ని అందుకుంది. జూడోలో అస్మితా డే, హర్ష్‌‌‌‌ సింగ్‌‌‌‌ చారిత్రక స్వర్ణాలు గెలవగా, అథ్లెటిక్స్‌‌‌‌లో గుల్వీర్‌‌‌‌ సింగ్‌‌‌‌ 5,000, 10,000 మీటర్లలో రెండు పతకాలు సాధించాడు. 

తేజస్విన్‌‌‌‌ శంకర్‌‌‌‌ డెకాథ్లాన్‌‌‌‌లో పతకం గెలిచి చరిత్ర సృష్టించగా, నీరజ్‌‌‌‌ చోప్రా మరోసారి తన స్థాయిని నిరూపించాడు. పారా అథ్లెటిక్స్‌‌‌‌లో శర్మిలా ధన్‌‌‌‌కర్‌‌‌‌, దిలీప్‌‌‌‌ గవిట్‌‌‌‌, సోమన్‌‌‌‌ రాణా స్వర్ణాలు అందించగా, మూడు ఈవెంట్లలో భారత్‌‌‌‌ డబుల్‌‌‌‌ పోడియంలు సాధించడం విశేషం. చివరి రోజు జూడోలో ఇష్‌‌‌‌రూప్‌‌‌‌ నారంగ్‌‌‌‌ మహిళల 78 కేజీల కాంస్య పతక పోరులో కెనడాకు చెందిన కోరలీ గాడ్‌‌‌‌బౌట్‌‌‌‌పై ఓడి పతకం చేజార్చుకుంది. పారా సైక్లింగ్‌‌‌‌లో 16 ఏళ్ల లిషా దాస్‌‌‌‌ మహిళల సీ4-సీ5 1000 మీటర్ల టైమ్‌‌‌‌ట్రయల్‌‌‌‌లో ఆరో స్థానంలో నిలిచింది.

మెడలిస్ట్‎లకు ఘన స్వాగతం

కామన్వెల్త్ క్రీడల్లో  మెడల్స్​ సాధించి  స్వదేశానికి చేరుకున్న భారత అథ్లెట్లకు ఆదివారం ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. తొలి విడతలో ఒలింపిక్ పతక విజేత, స్టార్ వెయిట్‌‌‌‌లిఫ్టర్ మీరాబాయి చాను, లవ్‌‌‌‌ప్రీత్ సింగ్‌‌‌‌తో పాటు పలువురు క్రీడాకారులు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకోగా, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై వారిని అభినందించారు. మహిళల 49 కేజీల విభాగంలో వరుసగా మూడో కామన్వెల్త్ స్వర్ణం గెలిచిన మీరాబాయి చాను.. దేశానికి మరోసారి పతకం అందించడం గర్వంగా ఉందన్నారు. పురుషుల 110 కేజీల విభాగంలో కేవలం ఒక కిలో తేడాతో స్వర్ణాన్ని కోల్పోయి రజతంతో సరిపెట్టుకున్న లవ్‌‌‌‌ప్రీత్ సింగ్.. తన తదుపరి లక్ష్యం జపాన్‌‌‌‌లో జరిగే ఆసియా క్రీడలేనని చెప్పారు. మహిళల 58 కేజీల విభాగంలో కాంస్యం సాధించిన బింద్యారాణి దేవి.. రానున్న పోటీల కోసం మరింత కష్టపడతానని తెలిపారు. 

ర్యాంక్​    దేశం    గోల్డ్​​    సిల్వర్​     బ్రాంజ్​    మొత్తం

1    ఆస్ట్రేలియా    70    45    56    171
2    ఇంగ్లండ్    29    45    36    110
3    కెనడా    19    20    23    62
4    భారత్    13    17    9    39
5    స్కాట్లాండ్    13    9    17    39
6    న్యూజిలాండ్    10    14    12    36
7    నైజీరియా    10    7    7    24
8    జమైకా    10    4    5    19
9    వేల్స్    9    10    12    31
10    మలేషియా    8    3    5    16

  • కామన్వెల్త్​లో భారత్​ మార్క్​     
  • బాక్సింగ్‌‌‌‌లో   ఏడు స్వర్ణాలతో కలిపి మొత్తం 10 పతకాలు
  • మీరాబాయి చాను హ్యాట్రిక్‌‌‌‌.. వరుసగా మూడో కామన్వెల్త్​లో గోల్డ్​ మెడల్స్​ 
  • జూడోలో మనోళ్ల చరిత్మాక విజయం..  
  • అస్మితా డే, హర్ష్‌‌‌‌ సింగ్‌‌‌‌ తొలి గోల్డ్​ మెడల్స్​లో  కొత్త అధ్యాయం
  • గుల్వీర్‌‌‌‌ డబుల్‌‌‌‌ ధమాకా.. 5,000, 10,000 మీటర్లలో రెండు పతకాలు
  • తేజస్విన్‌‌‌‌ శంకర్‌‌‌‌ అరుదైన ఘనత.. డెకాథ్లాన్‌‌‌‌లో చారిత్రక పతకం
  • పారా అథ్లెటిక్స్‌‌‌‌లో  మూడు స్వర్ణాలు, మూడు డబుల్‌‌‌‌ 
  • పోడియంలతో రికార్డు పర్ఫామెన్స్​